తాబేలు తియ్యగా పలికిన ఆ మాటల్ని నిజమనుకున్నది నక్క. 'నేను మోపిన కాలు వల్లనే తాబేలు సరిగ్గా నానలేకపోతున్నది' అనుకున్నది. అట్లా అనుకొని, దాని వీపు మీది నుండి తన కాలి బరువును కొద్దిగా సడలించింది. మరుక్షణం తాబేలు కదిలింది- ప్రాణాలు దక్కించుకొని, ధనుస్సునుండి వదిలిన బాణం మాదిరి తటాలున సరస్సులోపలికి జారిపోయింది.
మొసలికి ఈ కథ చెప్పి, కోతి అన్నది- "ఓ తెలివిలేని మొసలీ! మోసాలన్నిటికీ కాణాచి అయిన నక్కే ఆ విధంగా మోసపోగా లేనిది, నీలాంటి పుట్టు గ్రుడ్డి మోసపోవటంలో ఇక ఆశ్చర్యం ఏమున్నది? అయినా, ఇప్పటికి అయ్యింది చాలు చాలు- నీతో స్నేహం చేసినందుకు తగిన శాస్తి త్వరగానే జరిగింది. ఇంక నీ స్నేహాన్ని నీ దగ్గరే ఉంచుకో.
నిజానికి, ఒకప్పుడు నా శక్తి సామర్ధ్యాలకు ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులుండేవి. అయినా దైవం అనుకూలించక, నా రాజ్యాన్ని, మర్యాదను కోల్పోయి, శత్రువులతో వేగలేక, భార్య-బిడ్డలు-కుటుంబ సౌఖ్యం పట్ల, బంధువుల పట్ల విముఖుడినైపోయి, నా సొంత ఊరిని విడిచి వచ్చి, నిలువ నీడలేక, త్రాగ నీరు లేక ఏకాకినై అడవులు పట్టి తిరిగి తిరిగి చివరికి ఈ చెట్టును చేరుకొని, తనంతట తాను లభించే ఆహారాన్ని ఏరుకొని తిని- అలా కడుపు నింపుకుంటూ, కులాన్నీ-గోత్రాన్నీ-పేరునూ అన్నీ దాచుకొని మొన్నటి దాకా కాలం గడుపుతూ వచ్చాను. తర్వాత అన్నేళ్లకు నీ పెద్దతనాన్ని చూసి, నా బుద్ధి గడ్డితిన్నది- నువ్వింత 'మిత్ర వంచకుడివి' అని తెలుసుకోలేకపోయాను- నీతో స్నేహానికి అంగీకరించాను.
ఇక నువ్వు పాపాత్మురాలైన నీ భార్య దుర్బోధవల్ల మతి చెడి, మోసపు ఉపాయంతో నన్ను మట్టుపెట్టాలనుకొని, నంగనాచిలాగా 'మా ఇంట్లో విందు ఆరగిద్దువు రా' అని నచ్చికబుచ్చికలాడితే, నేను అందులోని మోసం తెలీక, నీ మందిరంలో స్థిరంగా సుఖంగా తలదాచుకోవచ్చని నమ్మకంతో, అంతులేని సంతోషంతో బయలుదేరి వచ్చాను. అయినా నా అదృష్టం బాగుండటం చేత మార్గమధ్యంలో నీ ఆకారవికారాలను గమనించి, నీ మనసులో కదలాడుతున్న వికారాలను ఊహించ-గల్గాను. నా పూర్వ పుణ్యంకొద్దీ ఈ ఉపాయం తోచింది గనక, ఇలా పులి నాకి విడిచిపెట్టినదాని లాగా బ్రతికి మాట్లాడ-గల్గుతున్నాను.
ఇంట్లో ఉండి లోకం తెలీకుండా బ్రతికే ఆడవారికి మంచి ఏమిటో తెలీదు; చెడు ఏమిటో తెలీదు. కేవలం మాయోపాయాలు పన్ని తమ పట్టును సాధించుకోజూస్తారు. నువ్వు నాతో స్నేహం చేసి ఇల్లు పట్టనట్లు ఉండిపోయేసరికి, ఏదో ఒక విధంగా నన్ను చంపిస్తే చాలునని నీ భార్య పన్నిన పన్నాగమే కావచ్చు, ఇదంతా. ఈ శరీరాలదేమున్నది- ఇవి కేవలం నీటి బుడగలవంటివి. యవ్వనం కేవలం నురుగులాంటిది. సంపద అన్నది మెరుపు లాగా చంచలమైనది. అలంకారాలన్నీ గోడమీది బొమ్మలలాంటివి. భార్యాబిడ్డలు స్మశానం వరకు మన వెంట రాగలరేమోగానీ, అటుపైన మన వెంట రారు- ధర్మం ఒక్కటే, అనునిత్యం మన వెంట వచ్చేది; మనల్ని కాపాడేది. అయినప్పటికీ, నువ్వు నాతో శత్రుత్వాన్నీ లెక్కించలేదు; ధర్మాధర్మాలనూ లెక్కించ-లేదు- క్షణభంగురమైన ఈ శరీరాన్ని నమ్ముకొని, కీర్తిశరీరాన్ని తృణీకరించావు; శాశ్వతమైన అపఖ్యాతిని మూట-గట్టుకున్నావు. ప్రాణాధికుడైన మిత్రుడినే ఇట్లా చేసిన పరమ సాహసికుడివే, నువ్వు! నీకు ఇక ఇతరులంతా గడ్డిపోచలతో సమానం కాబోలు! ఇక మీద నీ గతి ఎట్లా కానున్నదో, ఎవరికేమి ఎరుక? నీలాంటి మిత్రద్రోహిని చూసినంత మాత్రాన పాపం తగులుకుంటుంది. ఇంక నువ్వు నా ముందు నిలబడి నన్ను ఇంకా రెచ్చగొట్టకు- వేవేగనే ఇంటి త్రోవ పట్టుకొని పో!" అని ముక్కూ-ముఖం చూడకుండా తిట్టి, జవాబు ఇచ్చేందుకు నోరు పెగలకుండా చేసి, ఆ మొసలిరాజును అక్కడినుండి సాగనంపింది. క్రకచం కూడా నీరసపడిపోయి, దిక్కులు చూస్తూ వట్టి చేతులతో తన ఇంటి త్రోవ పట్టింది.
-కాబట్టి మోసంతోఎట్లాంటి పనినైనా సాధించవచ్చు. నా మీద దయ ఉంచి మీరంతా నాకొక్క సహాయం మటుకు చెయ్యండి. మీరంతా ముందుగా పోయి, ఆ బ్రాహ్మణుడు వెళ్ళే దారిలో దూర దూరంగా నిలబడి, ఏవేవో పనులు చేస్తున్నట్లు నటిస్తూ ఉండండి- అతను మీకు దగ్గరగా పోయేటప్పుడు అతన్ని నిలబెట్టి, "అయ్యా! విప్రోత్తమా! నల్లకుక్కను ఎందుకు తీసుకుపోతున్నారు?" అని అడగండి- మీరు ఇంతమాత్రం తోడ్పడ్డారంటే చాలు, మిగిలిన పనిని నేను చక్క పెడతాను" అని ఆ ముసలిదొంగ తోటి మోసగాళ్లతో అన్నాడు.
'సరే' అని వాళ్లంతా బ్రాహ్మణుడికి కనబడకుండా దాటుకొని పోయి, అతను వచ్చేదారిలో అక్కడక్కడా ఒక్కొక్కడు చొప్పున కూర్చున్నారు.
అంతలోనే బ్రాహ్మణుడు మేకపోతును ఈడ్చుకొని మొదటి దొంగ ఉన్న తావునుండి పోబోయాడు. అప్పుడు వాడు బ్రాహ్మణుడికి నమస్కారం పెడుతూ "అయ్యా! మీరు చూస్తే ఎవరో గొప్ప బ్రాహ్మణులలాగా ఉన్నారు; మరి ఈ నల్ల కుక్కను ఎందుకు ఈడ్చుకుపోతున్నారు స్వామీ?" అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు కళ్ళతో నిప్పులు కురిపిస్తూ "ఛీ ఛీ! త్రాగుబోతా! అసహ్యంగా మాట్లాడకు! నేను యజ్ఞం కోసం తీసుకువెళ్తున్న ఈ పవిత్రమైన మేకపోతును 'కుక్క' అనేందుకు నీకు నోరెలా వచ్చిందిరా?! పో! పో" అని అతని మాటలను లక్ష్యపెట్టక తన దారిన తాను ముందుకు సాగాడు.
అతను అలా నాలుగడుగులు ముందుకు పోయాడో లేదో, రెండో దొంగ ఎదురయ్యాడు. అతను బ్రాహ్మణుడికి చేతులు మోడ్చి నమస్కరిస్తూ "స్వామీ! మీరు సర్వమూ తెలిసిన వారు కదా?! అంత గొప్పవారు, సిగ్గు విడచి ఈ నల్లకుక్కను ముట్టుకుంటున్నారేమి?" అని అడిగి అతని సమాధానం కోసం ఎదురు చూడకనే చక్కా పోయాడు. దాంతో బ్రాహ్మణుడికి మనసులో కొంచెం అనుమానం వచ్చింది- అయినా మారు మాట్లాడక మేకను పట్టుకొని ముందుకు పోయాడు.
అంతలోనే మూడో దొంగ ఎదురుపడి "ఇదేమి పోయేకాలం బాపనయ్యా?! ఇంత అక్రమానికి ఒడిగట్టావే? నువ్వెత్తింది బ్రాహ్మణ జన్మం కదా? అయినా సుగుణాన్నీ, శీల సంపత్తినీ ప్రక్కన పెట్టి, లోకులంతా నవ్వేట్లు, అపవిత్రమైన ఈ కర్రికుక్కను నేరుగా రాజమార్గాన్నే ఈడ్చుకొని పోతున్నావేమి? ఈ రాజ్యం ఏం పాపం చేసుకున్నదయ్యా, కులాచారాలు, ధర్మం ఇలా మంటకలిసిపోతున్నాయి?" అని వదరి పోయాడు.
దాంతో ఆ బ్రాహ్మణుడి మనస్సు వికలమైపోయింది. అనుమానంతో అతని హృదయం కొట్టుమిట్టాడగా "ఒకరిద్దరు కాదు-చూసిన వాళ్లంతా దీన్ని 'కుక్క' అంటున్నారేమి? ఒకవేళ నాకే ఏమైనా మతి భ్రమించలేదు గద?! కుక్కను చూసి నేను మేక అనుకుంటున్నానా? ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చి ఉంటుంది?" అని విచారంతో ఆలోచనామగ్నుడై, కాలు ముందుకు సాగక అక్కడే నిల్చుండిపోయాడు.
మొదటినుండి బ్రాహ్మణుడిని వెంబడిస్తూ వస్తున్న ముసలి దొంగ తన ప్రయత్నం ఫలించనున్నది గదా అని సంతోషిస్తూ, బ్రాహ్మణుడికి వినబడేట్లు తన తోటిదొంగతో "ఒరే, చూసావా? పాపం అమాయకుడైన ఈ బ్రాహ్మణుడిని వెర్రివాడిని చేసి, ఎవరో అంట్లకుక్కనొకదాన్ని ఇతనికి కట్టబెట్టారు. ఇప్పుడు చూడు, ఇతని దురవస్థ!" అని ఆ బ్రాహ్మణుడి తెలివిలేమిపై జాలి చూపిస్తున్నట్లు అని, అటుపైన వెటకారంగా వికవికా నవ్వాడు.
ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు తన స్వీయ అనుభూతిని ఒక్కపాటుగా ప్రక్కన పెట్టేసి, 'ఇంతమంది ఒకేలాగా చెప్పిన మాట అబద్ధం కాదు' అని నిశ్చయించుకున్నాడు: తన తప్పిదానికి లోలోపలే నొచ్చుకున్నాడు; కుంచించుకుపోయాడు.
తన వెంటఉన్న యజ్ఞపు మేకను అక్కడే విడచిపెట్టి, మళ్ళీ వెనక్కిపోయి, చెరువులో స్నానంచేసి, పరిశుద్ధుడై, తడిబట్టలతో ఇల్లు చేరుకొని, పాప పరిహారం కోసం గాయత్రీ మంత్రం జపించుకుంటూ కూర్చున్నాడు. కొలను ఒడ్డున చేరిన దొంగలు నలుగురూ అతను వదిలిపెట్టిన మేకపోతును పట్టుకొని, బాపని వెర్రిని తలచుకొని కడుపారా నవ్వుకున్నారు.
(తర్వాత ఏం జరిగిందో వచ్చేమాసం...)