చాలా కాలం క్రితం చైనా దేశంలో 'చు' అనే ధనవంతుడొకడు ఉండేవాడు. 'చు' చాలా మంచివాడు. కుర్రవాడుగా ఉన్నప్పటినుండి అందరికీ ఉపయోగపడే పనులు చాలా చేశాడు. ఆ రోజుల్లో ప్రజలకు రవాణా సౌకర్యాలు అస్సలు ఉండేవికావు. 'చూ' తన సొంత డబ్బుతోటే చాలా రోడ్లు వేయించాడు, వంతెనలు కట్టించాడు; అవసరం ఉన్న వాళ్లకు లేదనకుండా సాయం చేశాడు. తోటి వాళ్లందరూ 'చూ'ని గురించి చాలా మంచిగా అనుకునేవాళ్లు.
ఒక రోజున చేపలు పట్టేవాడొకడు తను పట్టుకొచ్చిన చేపల్ని అమ్ముకుంటుండగా మేడ మీది నుండి చూశాడు 'చూ'. ఆ చేపల్లో ఒక చిట్టి సొరచేప అతన్ని బలేగా ఆకర్షించింది. అదింకా బ్రతికే ఉన్నది. ఆ చిట్టి చేపకు ఎర్రటి పొలుసులున్నాయి; ఎండ వెలుతురులో అది చలిమంటలాగా ప్రకాశిస్తున్నది. దాని కళ్లు నీలాకాశంలోనక్షత్రాల్లాగా మెరుస్తున్నాయి. ఆ సరికే అరవయ్యోపడిలో ఉన్న 'చు'కి దాన్ని చూస్తే చాలా ముచ్చటవేసింది.
అంత అందమైన చేపను తినటం ఏంటని, అతను దాన్ని చేపలవాడు చెప్పిన ధరకుకొని ఆ పైన దాన్ని తీసుకెళ్లి ఊరిచివరనున్న చెరువులో వదిలేశాడు. ఆ పని చేశాక ఎందుకనో, అతనికి చాలా శాంతిగాను, సంతోషంగాను అనిపించింది. ఆ చిట్టి చేప తనకేసి సంతోషంగా చూసినట్లు, తనని దీవించినట్లు భావించుకొని అతను చాలా ఉత్సాహ పడ్డాడు.
అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే'చు' జబ్బు పడ్డాడు. చాలా నీరసంగాను, కళ్లు తిరుగుతున్నట్లు, అన్నిటినీ మించి నిరాశగాను అనిపించిది అతనికి. ఇక ఆ జబ్బు నుండి తాను కోలుకోలేనని, అనారోగ్యంతోనే చనిపోతానని అనుకొని 'చు' బలే నిరుత్సాహానికి లోనయ్యాడు. రాను రాను ఆ జబ్బు పెరుగుతూ పోయింది. చివరికి 'చు' పడకమీదినుండి లేవలేని స్థితి వచ్చింది.
అతను అట్లా జబ్బుతో పడుకొని ఉండగా ఒకరోజున ఎవరో ఒక పిల్లవాడు ఒకడు అతని దగ్గరికి వచ్చాడు. 'చు'గారూ!మాయజమాని నన్ను మీదగ్గరికి పంపారండి. మిమ్మల్ని తనతో బాటు భోజనానికి ఆహ్వానిస్తున్నట్లు చెప్పమన్నారు ఆయన!" అన్నాడు.
ఆ పిల్లవాడెవరో, అతని యజమాని ఎవరో 'చు'కి ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు కానీ, 'ఈ పడక మీది నుండి దిగి కొంచెం నడిస్తే బానే ఉంటుంది; మంచి భోజనం ఒకటి చేస్తే కొంచెం శక్తి వచ్చినట్లుంటుంది" అని అతను లేచి, మంచం దిగి ఆ పిల్లవాడి వెంట పోయాడు.
"నేను నిజంగానే చాలా జబ్బుపడ్డట్లున్నానే". అనుకున్నాడతను, దారిలో పోతూ;" అంతా మసకమసకగా కనిపిస్తోంది. అంతా బంగారం రంగులో మెరుస్తున్నదే, ఎందుకో?" అని. అట్లా కొద్ది దూరం పోయాడో లేదో, ఆయనొక మహలు ముందు ఉన్నాడు! ఆ మహాలు బంగారు స్తంభాలమీద నిలబడి ఉన్నది. దాని కిటికీలకు వెండి తెరలు వ్రేలాడుతున్నాయి. దూలాలకు వజ్రాలు పొదిగి ధగధగా మెరుస్తున్నాయి. ఆ భవంతికి తాపడం చేసి ఉన్న మణులు, స్పటికాలు విచిత్రమైన బంగారు కాంతిని వెదజల్లుతున్నాయి.
"ఇది డ్రాగన్ చక్రవర్తి ఉండే భవనం-'స్ఫటికమహాలు'లాగా ఉన్నదే" అని క్షణం కాలం పాటు నివ్వెరపోయాడు 'చు'. ఎందుకంటే దాన్ని ఇప్పటివరకూ మానవమాత్రుడన్నవాడు ఎవ్వడూ ఊహల్లో తప్ప, నిజంగా చూసి ఉండలేదు మరి!
అంతలోనే ఆ మహాలులోచి ధగధగా మెరిసే దుస్తులు ధరించిన చక్రవర్తి ఒకాయన బయటికి వచ్చి, 'చు' ని ఆప్యాయంగా కౌగిలించుకొని, సాదగంగా లోనికి తోడ్కొని పోయాడు. గుబురుగా ఉన్న కనుబొమ్మలు, పొడవాటి కళ్లు, 5 జటలుగా పేనిన మీసాలు-గొప్ప ఠీవిగా, రాజసంతో అలరారే ఆ చక్రవర్తి కేవలమైన మంచితనాన్ని వెదజల్లుతున్నాడు. ఆయనతో కొంతసేపు సంభాషించాక గానీ 'చు' కి అర్థంకాలేదు-ఆయన మరెవరో కాదు -స్వయానా డ్రాగన్ చక్రవర్తే!
ఆ విధంగా వాళ్లిద్దరూ పర్వతాలలోనూ, సముద్రంలోనూ లభించే వివిధ రుచుకరమైన పదార్థాలతో కూడిన గొప్ప విందులో పాలు పంచుకుంటుండగా, డ్రాగన్ చక్రవర్తి 'చు' తో చెప్పాడు. "నా చిట్టి మమవళ్లలో ఒకడు ఆడుకుంటూ ఎలా వెళ్లాడో సముద్రంలోకి వెళ్లిపోయాడు. అక్కడ వాడిని ఎవడో ఓ దొంగవాడు బంధించి చంపెయ్యబోయాడట. వాడి అదృష్టం బాగుండబట్టి, నువ్వు వాడిని కాపాడావు. దీనికై మేం అందరం నీకు ఎల్లప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం"
'చు' ఇంకా ఏమి అనకనే ఆయన కొనసాగించాడు "నిజానికి నువ్వు భూమిపైన ఉండాల్సిన సమయం ఇప్పటికి దాదాపు అయిపోవచ్చింది-కానీ నువ్వు చేపరూపంలోని డ్రాగన్ను ఒకదాన్ని కాపాడి మరింత కాలం భూమిపై కొనసాగే హక్కును పొందావు. నేను నీకు స్వయంగా కృతజ్ఞతలు చెప్పుకునేందుకు, ఇంకా యీ చిన్న విందును ఏర్పాడు చేశాను."
'చు' గౌరవంగా తలవంచి నమస్కరిస్తూ "మీ అభిమానాన్ని స్వీకరించేందుకు నాకు మాటలు చాలటం లేదు. మీ ఆదరణకు వేనవేల కృతజ్ఞతలు ఇకపైన నేను నా కృతజ్ఞతను వ్యక్తం చేసుకునే క్రమంలో మరిన్ని మంచిపనులు చేస్తానని మాట ఇస్తున్నాను".
ఆరకంగా మంచి విందు భోజనం చేశాక, 'చు' నిద్రలేచాడు-ఆశ్చర్యంగా అతనికి కడుపు నిండుగా అనిపించింది. "నేనేదో కలగని ఉండాలి-మరి నా కడుపెందుకు, నిండుగా ఉంది?" అని అతను ఆశ్చర్యపోయాడు. అటుపైన అతని ఆరోగ్యం బాగవ్వటమే కాదు, 120 సంవత్సరాల వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకుండా బ్రతికాడు!