ఒకసారి ఒక గుడ్డాయన, ఒక గూనాయన మాట్లాడుకుంటూ నడుస్తున్నారు ఓ అడవిలో.
అడవిలో క్రూర మృగాలు చాలానే ఉన్నాయి. వీళ్ళిద్దరికీ ఆ సంగతి తెలుసు. అయినా అవసరం కొద్దీ పొరుగూరికి బయలు దేరారు. మధ్యలో ఈ అడవిని దాటాలి- ఆ సరికే సాయంత్రం కావొస్తున్నది. ఇద్దరికీ మనసులో కొంచెం కంగారుగానే ఉన్నది. అంతలో ఏదో రాయి అడ్డం వచ్చింది- గుడ్డాయనకు అది కనపడలేదు. పాపం అతను ఆ రాయికి దొందురుకొని క్రింద పడ్డాడు. బాధతో మూలిగాడు. శ్రమపడి కూర్చోగలిగాడు గానీ, ఇక నడవటం కష్టం అయ్యింది. చూడగా కాలికి కొంచెం‌ గట్టి గాయమే అయ్యింది-
"చాలా నొప్పిగా ఉందిరా; ఇంక నడవలేను" అన్నాడు అతను స్నేహితుడితో. "అయ్యో! పర్లేదులే, నువ్వు నా వీపుమీద ఎక్కి కూర్చో. నేను నిన్ను మోయగలను- ఏం కాదు" అన్నాడు గూనాయన.
'సరే' అని గూనాయన వీపుమీది ఎక్కి కూర్చున్నాడు గుడ్డాయన.
గూనాయనది అసలే నడుము సమస్య. ఆ పైన ఇప్పుడు గుడ్డాయన బరువు. అలాగే కష్టపడి నడవసాగాడు. అంతలో అతని కాలికో కొబ్బరి మట్ట తగిలింది. నడక తీరు మారటం చూసి 'ఏంటది?' అని అడిగాడు గుడ్డాయన.
"కొబ్బరి మట్ట" అన్నాడు గూనాయన. "ఏదీ, కొంచెం అది అందివ్వు- పనికి వస్తుంది" అన్నాడు గుడ్డాయన. గూనాయన శ్రమపడి కొబ్బరి మట్టను తీసి అందించాడు.
మళ్ళీ ప్రయాణం‌ మొదలైంది.

కొంతసేపటికి గూనాయన కాలికి ఒక కుండ తగిలింది.
'ఏంటది?' అడిగాడు గుడ్డాయన.
'ఏదో ఖాళీ కుండ' చెప్పాడు గూనాయన.
"నా తల ఎలాగూ ఖాళీయే! కుండని ఇటివ్వు; తలకు తగిలించుకుంటాను" అన్నాడు గుడ్డాయన. గూనాయన కుండని ఇస్తే గుడ్డాయన దాన్ని తన తలకు తగిలించుకున్నాడు.
మళ్ళీ నడక మొదలైంది. ఈసారి ఓ పొడుగాటి వెదురు బొంగు దొరికింది వాళ్లకు. గుడ్డాయన దాన్నీ తీసి చేతిలో పట్టుకున్నాడు.
ఆసరికి పాపం గూనాయన చాలా అలిసిపోయాడు. చీకటికూడా పడబో-తున్నది. దగ్గర్లోనే అతనికో కొండ గుహ కనిపించింది.
"గుహలో ఆగుదామా?" అన్నాడు అతను గుడ్డాయనతో.
"ఓసారి చూడు. అందులో జంతువులు ఏమైనా నివాసం ఉంటాయేమో" అన్నాడు గుడ్డాయన.
గుహ శుభ్రంగా ఉంది.
ఇద్దరూ గుహలో విశ్రాంతిగా కూర్చున్నారు.
నిజానికి ఆ గుహ ఓ సింహంది. ఆ సింహం అంతకు ముందు ఓ సర్కస్‌లో పనిచేసి, పారిపోయి అడవికి చేరుకున్నది; అట్లా దానికి మనుషులు ఎంత ప్రమాదకారులో తెలుసు. (అంతేకాక దానికి తెలుగు కూడా బాగానే వచ్చు!)
ఇంకా గుహలోకి రాకనే అది వాసన పట్టింది: "ఎవరో మనుషులు!" ఆ వెంటనే దానికి చాలా భయం వేసింది.
"ఎవరది?! ఎవరు నా గుహలో దూరింది?! ఎవరికి, అంత ధైర్యం?!" అని పెద్దగా గర్జించింది సింహం.
గుడ్డాయనకి, గూనాయనకి గుండెలు చెదిరిపోయాయి. అయితే గుడ్డాయన కొంచెం ముందుగా తేరుకున్నాడు: "చూడు, దీనికి మనం భయపడ్డట్లు తెలీకూడదు. తెలిసిందంటే ఇక మనం ఉండం!" అన్నాడు.
గూనాయన కొంచెం‌ ఆలోచించుకొని ధైర్యంగా "ఎవర్రా అది, మమ్మల్నే అడిగేవాడెవడు?! నీలాంటి వంద సింహాల పెట్టురా, ఈ శరభం! మర్యాదగా తోక ముడిచావంటే సరి. కాదంటావా, ఇక నీ పని ఇవాల్టితో ఆఖరు!" అని అరిచాడు గుహ లోపలినుండే. "నాకన్నా‌ పెద్ద జంతువు ఏదీ లేదు. నేనే అడవికి రాజును! నువ్వు నాకంటే పెద్ద జంతువువైతే నాకేదైనా గుర్తు చూపించు, దమ్ముంటే బయటికి రా!" అన్నది సింహం, "ఏ మనిషి బయటికి వస్తాడో!" అని కొంచెం భయపడుతూనే.
వెంటనే గుడ్డాయన తన చేతిలోని కొబ్బరి పట్టను గుహలోంచి బయటికి చాపాడు: "నా కొమ్ము చూడురా, చూసి వెనక్కి తిరిగి చూడకుండా పో" అరిచాడు, సింహం దాన్ని చూసీ చూడకనే గబుక్కున లోపలికి లాక్కుంటూ.
అంత భయంకరమైన కొమ్మును చూసి సింహానికి భయం వేసింది. అయినా మొండిగా, "ఓస్, దీనిదేముంది, నీ చెయ్యి ఎంత పెద్దదో చూపించు!" అంది.

మరుక్షణం గుడ్డాయన తన చేతిలోని వెదురుకట్టెతో గుహ బయట కూర్చున్న సింహాన్ని ఒక్క తోపు తోశాడు. దాని తాపుకు పిరికి సింహం అంత దూరం వెళ్ళి పడ్డది. అది తేరుకునేంతలో వెదురు కట్టె మళ్ళీ‌ గుహలోకి చేరుకున్నది- "హహ్హహ్హ! నా గోరుతో ముట్టుకుంటేనే అంత దూరం వెళ్ళి పడ్డావు, నీతోటి నాకేమి! మర్యాదగా పో, నా నిద్ర చెడగొట్టకు" అరిచాడు గుడ్డాయన లోపలినుండి.
"నీ అరుపొక్కటీ వినిపించు. అది నా గర్జన కంటే బలమైనదా?" అంది సింహం, చివరి అస్త్రం మాదిరి. ఆ సరికి దానికి లోపల ఉన్నదెవరో 'భయంకరమైన మనిషి' అని అనుమానం వేసింది.
గుడ్డాయనా, గూనాయనా ఇద్దరూ తమ దగ్గరున్న కుండలోకి "ఘ్రూ...ఘ్రా... హూ....ఖ్రూ..."అని ఇష్టం వచ్చినట్లు అరిచారు. కుండలోంచి వెలువడ్డ శబ్దం గుహలోంచి ప్రతిధ్వనించి, బయటికి ఘోరమైన గర్జనలాగా వినబడింది.
ఆ అరుపు విని సింహం నీరు కారిపోయింది కానీ, ఇంకా గుహవైపుకే చూస్తూ నిలబడింది.
అంతలోనే గూనాయన మీది కెక్కిన గుడ్డాయన, తలమీద కుండతో, కొబ్బరి మట్ట కొమ్ముతో, వెదురు బొంగు చేతితో, రెండు గొంతులతో అరుచుకుంటూ గుహలోంచి బయటికి దూకి నేరుగా సింహం మీదికే పడబోయాడు!
ఆ సరికే ఠారుకొని ఉన్న సింహం అదిరిపోయి, వెనక్కి తిరిగి, అడవిలోకి పరుగు లంకించుకున్నది- దానికి మనిషి అంటేనే భయమాయె! "ఇప్పుడు ఇన్ని చేతుల కొమ్ము మనిషి! తను మనుషుల చేతిలో ఇంతకాలం పడిన కష్టాలు చాలు!"
"బ్రతికిపోయాంరా" అనుకున్న గుడ్డాయన, గూనాయన మళ్ళీ గుహలోకి చేరుకొన్నారు. ముళ్ళమీద ఉన్నట్లుగా రాత్రంతా కదలకుండా గడిపి, ఇంకా తెల్లవారకనే అడవి దాటి పరుగు పెట్టారు!