విశాఖపట్టణం శివార్లలో సీతారామ కాలనీ ఉంది. దానికి కొంచెం దూరంలో పట్టణం నుండి తెచ్చిన చెత్తాచెదారం పడేస్తారు. ఆ ప్రక్కనే పట్టణపు మురుగునీరు ప్రవహిస్తుంది. సీతారామ కాలనీ వాసులు పేదవాళ్ళు . కాలనీలో ఎక్కువగా గుడిసెలు, అక్కడక్కడా మిద్దెలు ఉన్నాయి. అలాంటి ఒక మిద్దెలో రాఘవయ్య దంపతులు నివసిస్తున్నారు. పిల్లలు లేరని చాలా బెంగపడేవాళ్ళు.
ఒకరోజు ఇంటి వెనక ఉన్న చిన్నతోటకు నీళ్ళు పెడుతున్నాడు రాఘవయ్య. అంతలో పైనుండి దభాలున ఏదో వచ్చి మల్లెపొదలో పడింది. రాఘవయ్య తలెత్తి పైకి చూసాడు. ఒక కాకి ఎగురుతూ కనిపించింది. అంతలో మల్లెపొదలోంచి ఏదో అరుస్తున్న శబ్దం వినిపించింది. చూస్తే అది ఒక కోడిపిల్ల. దానికి ఒక రెక్క, ఒక కాలు విరిగి పోయి ఉన్నై. నడవలేక అక్కడే పడి అరుస్తోందది. రాఘవయ్యకు దాన్ని చూసి జాలేసింది. నెమ్మదిగా చేతిలోకి తీసుకున్నాడు. ఇంట్లోకి తీసుకెళ్ళి దాని కాలికి కట్టుకట్టాడు; దాని రెక్కకు పసుపు, వేపాకుల లేపనాన్ని పూతగా పూసాడు. రాఘవయ్య భార్య సుభద్రమ్మ అటకపై నుండి చిన్న గంప తీసి, దాని కింద కోడిపిల్లను పెట్టింది.
ఓ గిన్నెలో కొన్ని బియ్యపు గింజలు, వేరొక గిన్నెలో నీళ్ళు పోసి గంప కింద పెట్టింది.
వారం రోజుల్లో కోడిపిల్ల కాలు, రెక్క బాగయ్యాయి. నిమిషం కూడా వదలకుండా అరుచుకుంటూ వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉండేదది. పిల్లలు లేకపోవడంతో దానికి రాణి అని పేరు పెట్టుకొని, దాన్నే తమ పిల్లలాగా పెంచటం మొదలెట్టారు వాళ్ళు. అట్లా ఆరు నెలలు గడిచాయి. కోడిపిల్ల కాస్తా చిన్న కోడిపెట్టలా మారింది. అందంతోపాటు చలాకీతనం, తెలివితేటలు సొంతం చేసుకున్నది. అందంగా ఉంటానని భలే బడాయి పోవటం, వంకర టింకరగా నడవటం మొదలు పెట్టింది.
రకరకాల గింజలు, తౌడు కలిపి పొద్దున్నే రాణిముందు గిన్నెలో పెడుతుంది సుభద్రమ్మ. హాయిగా ఆరగించి పెత్తనానికి కాలనీ చివరి వరకు వెళ్తుంది రాణి. అక్కడ ఊళ్ళోవాళ్ల కోళ్ళతో, బాతులతో సాయంత్రం దాకా గడుపుతుంది. చెత్తలో ఉన్న గింజలు ఏరుకొని తింటుంది. అక్కడున్న ఆ మురికి నీరే తాగి, సాయంత్రానికి తిరిగి ఇల్లు చేరుతుంది. "అట్లా బయట తిరగద్దు- కుక్కలు, పిల్లులు పట్టుకుంటాయి' అని సుభద్రమ్మ ఎంత మొత్తుకున్నా రాణి మటుకు ఆమె మాట వినదు. కోపం వచ్చి సుభద్రమ్మ అరిస్తే రాఘవయ్య చెంతకు చేరుతుంది. ఆయన దాన్ని బుజ్జగిస్తూ ఎత్తుకుంటాడు.
కొన్నాళ్ళకు రాణి ఒక గుడ్డు పెట్టింది. గుడ్డును చూసిన రాఘవయ్య, సుభద్రమ్మ ఆశ్చర్యపోయారు. అది మామూలు గుడ్డు కాదు- బంగారు కాంతితో మెరిసిపోతోంది! ఆ గుడ్డును చూడ్డానికి కాలనీ జనం గుంపులు గుంపులుగా వచ్చారు. రాణిని పక్షిదేవత ఆవహించిందని అనుకోవటం మొదలుపెట్టారు. ఆ రోజు మొదలు కాలనీ ఆడంగులు పొద్దుటే వచ్చి దానికి పూజలు చేయసాగారు. సాయంత్రం వరకు వచ్చే పోయే వాళ్ళతో వాళ్ల ఇల్లు తిరునాళ అయ్యింది.
ఆ నోటా ఈ నోటా సంగతి పత్రికల వాళ్ళకు తెలిసింది- అంతే! నాలుగైదు పత్రికలవాళ్ళు, ఒకరిద్దరు టివిల వాళ్ళు హుటాహుటిన సీతారామకాలనీ వచ్చి చేరుకున్నారు. రాఘవయ్యను, సుభద్రమ్మను రకరకాల ప్రశ్నలు వేశారు. కోడిపెట్టను, బంగారు గుడ్డును అన్ని వైపుల నుండీ ఫోటోలు తీశారు. మరుసటి రోజు వార్తా పత్రికలలో "కోడిపెట్ట-బంగారు గుడ్డు" అంటూ రకరకాలుగా రాశారు; టీవీల్లో మళ్ళీ మళ్ళీ చూపించారు.
విషయం తెలిసి రాజధానిలో ఉన్న పక్షి సంరక్షణ శాఖ వాళ్ళు, పక్షుల పరిశోధనశాల వాళ్ళు పరుగు పరుగున వచ్చారు. కోడిని, కోడిగుడ్డును వివిధ కోణాలలోంచి పరిశీలించి చూశారు. 'కోడిపెట్ట మీద పరీక్షలు జరుపుతాము- ఆ కోడిపెట్టను ఇవ్వండి' అని రాఘవయ్యను బ్రతిమిలాడారు. అతను దానికి 'ససేమిరా' అనేసరికి, మంత్రిగారితో సిఫార్సు చేయించారు. ఇక దాంతో ఆ దంపతులు కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. 'ఒక్కగానొక్క బిడ్డను వదిలి ఎలా ఉంటాం?' అని వాపోయారు.
'మీ కోడికి ఏమీ కానివ్వం. దాన్ని అస్సలు చంపం- మీకు భద్రంగా తెచ్చిస్తాం' అని శాస్త్రజ్ఞులు వాగ్దానం చేసాక, ఇక తప్పదని, కళ్లనిండా నీళ్ళు నింపుకొని, రాణీని వాళ్ళతో పంపారు.
శాస్త్రజ్ఞులు రాణి మీద నెలరోజుల పాటు రకరకాలుగా పరీక్షలు చేసి అసలది బంగారు గుడ్డు కానే కాదని తేల్చారు- "చెత్తా చెదారంలో ఉన్న పలు రకాల రసాయనాలతో కలుషితమైన గింజల్ని ఏరుకొని తినటం వలన, కలుషితమైన మురికి నీళ్ళు తాగటం వలన అది పెట్టిన గ్రుడ్డు సహజగుణం మారింది. అందుకే, తెల్లని పెంకుతో ఉన్న గుడ్డు బదులు రంగుతో ఉన్న గుడ్డు పెట్టింది. ఈ గ్రుడ్డు బంగారం కాదు- కాలుష్యమే" అన్నారు.
ఇంటికి తిరిగి వచ్చిన రాణీ ఎగిరి రాఘవయ్య భుజం మీద కూర్చుంది- ప్రేమగా అతని ముఖంలోకి చూస్తూ!
"ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, కలుషితమైన గింజలు ఏరుకొని తింటే ఎన్ని కష్టాలు వస్తాయో చూడు!" చీవాట్లు పెట్టింది సుభద్రమ్మ.
ఇవేవీ తనకు పట్టనట్లు "కొక్కొక్కొక్కొ.." అని బయటికి పరుగు తీసింది రాణి.