అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో చెట్లు, మొక్కలు, రకరకాల జంతువులు, పక్షులు ఉండేవి. ఆ జంతువులు, పక్షులు అన్నీ కూడా చాలా కలిసి మెలిసి ఉండేవి. వాటి స్నేహం గురించి తెలిసిన ఊరి వాళ్లెవరూ ఆ అడవి జోలికి పోయేవాళ్ళు కాదు.

అయితే ఒకరోజున సాంబయ్య అనే వేటగాడు ఒకడు పొరుగూరు నుండి వచ్చాడు. జంతువులను వెతుక్కుంటూ తిరుగుతున్న అతనికి అకస్మాత్తుగా‌ ఒక జింక కనిపించింది. వెంటనే విల్లు ఎక్కుపెట్టి దాన్ని కొట్టబోయాడు వాడు. అయితే అంతలోనే ఎక్కడనుంచి వచ్చిందో, ఒక పాము అతనిని చటుక్కున కాటు వేసింది!

దాంతో సాంబయ్య కాస్తా నురగలు కక్కుకుంటూ క్రింద పడి చనిపోయాడు. అది చూసిన మిగతా జంతువులు, పక్షులు చాలా సంతోషపడ్డాయి. అవన్నీ పాముకి కృతజ్ఞతలు చెప్పుకొని, సన్మానం చేసాయి.

అయితే వేటగాడి శవం ఇంకా అక్కడే పడి ఉన్నది. దానినిండా విషం ఉన్నదాయె- దాన్ని వేరే ఏ జంతువూ పొరపాటున కూడా తినకూడదు! మరేం చేయాలి..? చివరికి నక్క అన్నది, "మిత్రులారా‌! మనుషులు శవాలను ఊరేగించి, పూడ్చిపెడతారు- తెలుసు కదా?! మనం కూడా వీడి శరీరాన్ని అలా చెయ్యాలి" అని.

జంతువులన్నీ సరేనన్నాయి. "‌కానీ శవయాత్ర కోసం పల్లకీ లేదే, మన దగ్గర?!" అనుమానం వ్యక్తం చేసింది ఎలుగుబంటి. కుందేలు అన్నది- "అది పెద్ద సమస్య కాదులెండి. వడ్రంగి పిట్టను అడిగి చెక్కను కొయ్యమందాం. చెద పురుగులూ, వడ్రంగి పిట్టా కలిసి పల్లకీని కూడా చేసి పెడతాయి. నిన్ననే నాకొక మంచి పట్టు బట్ట దొరికింది. దాన్ని ఆ పల్లకీకి రెండు వైపులా‌ కట్టేందుకు వాడుకుందాం. ఎలుకలు, పందికొక్కులూ గుంతను త్రవ్వి పెడతాయి. రేపోసారి అందరం కలిసామంటే మజా మజాగా పల్లకీ యాత్ర కానివ్వచ్చు" అని.

వడ్రంగి పిట్టకు, చెద పురుగులకు, ఎలుకలకు పని అప్పజెప్పాక, జంతువులన్నీ వేటి ఇళ్ళకు అవి వెళ్ళిపోయాయి.

మర్నాడు వేటగాడి శవయాత్ర 'ధూం-ధాం'గా మొదలయ్యింది. నాలుగు దుప్పులు నాలుగువైపులా పల్లకిని పట్టుకున్నాయి. కొన్ని జంతువులు ముందు, కొన్ని జంతువులు వెనకా ఠీవిగా నడిచాయి. నక్కలు, తోడేళ్ళు ఊళలు వేశాయి. వేటికవి బాకాలు ఊది సందడి చేశాయి. ఒకవైపున వాటన్నిటికీ నవ్వు వస్తోంది- అయినా నవ్వకూడదన్నట్లు అన్నీ గంభీరంగా ముఖాలు పెట్టుకొని తిరిగాయి. అట్లా వేటగాడి శవాన్ని అడవి అంతటా తిప్పి, చివరికి పూడ్చేసి, అన్నీ హాయిగా నవ్వుకున్నాయి. వేటగాడి శవయాత్ర విజయవంతమైంది!