సర్వేపల్లి రాధా కృష్ణన్- గురుపూజోత్సవం
స్వతంత్ర భారత దేశానికి తొలి ఉపరాష్ట్రపతిగాను, ఆ తర్వాత1967వరకూ రాష్ట్రపతిగా కూడానూ పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888, సెప్టెంబరు 5న తమిళనాడులో జన్మించారు.
హిందూమతం గురించీ ఆధ్యాత్మికత గురించీ అనేక ప్రామాణిక గ్రంధాలు రచించారాయన.
రాధాకృష్ణన్ మొదట మైసూరు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పని చేశారు. అటుపైన బెనారస్ హిందూ యూనివర్సిటీతో సహా అనేక దేశ-విదేశ విశ్వవిద్యాలయాలకు ఆచార్యుడిగాను, కులపతిగాను సేవలందించి, 1975లో పరమపదించారు.
ఉపాధ్యాయ వృత్తికి తలమానికమైన సర్వేపల్లి పుట్టిన రోజు సెప్టెంబరు 5 వ తేదీని మనం ఈనాటికీ గురుపూజోత్సవంగా జరుపుకుంటున్నాం.
బాక్సింగ్ యోద్ధ - మేరీ కోం
మణిపూర్ రాష్ట్రానికి చెందిన 31ఏళ్ల మేరీ కోం మహిళా బాక్సర్‌గా ప్రపంచ ఖ్యాతినార్జించింది. పురుషుల ప్రాధాన్యతే కలిగిన బాక్సింగ్ క్రీడను మహిళా ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆమెదే.
2012ఒలింపిక్ క్రీడల్లో మేరీకోం మన దేశానికి బాక్సింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించి పెట్టింది. ఆ సంవత్సరంలోనే ఆమె పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది.
ఈశాన్య భారతంలోని యువకులకు బాక్సింగ్ క్రీడలో శిక్షణ ఇచ్చేందుకు గాను మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మేరీకోం స్థాపించిన 'ప్రాంతీయ బాక్సింగ్ అకాడమీ' కి ఈ మధ్య కాలంలో మంచి స్పందన లభించింది.
మేరీ కోం జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా కూడా ఒకటి ఈ మాసంలోనే విడుదల కానున్నది.
శాస్త్రవేత్త సి యన్ ఆర్ రావు
రసాయన శాస్త్రానికి చేసిన సేవలకు గాను గత సంవత్సరం భారత రత్న అందుకున్న ఆచార్య 'చింతామణి నాగేశ రామచంద్రరావు' (సి యన్ ఆర్ రావు) కర్ణాటక రాష్ట్రం వాడు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పరిశోధకుడిగాను, ఐ.ఐ.టీ కాన్పూరులో ఆచార్యుడిగాను, బెంగుళూరులోని ఐ.ఐ.యస్.సీకి ఒక దశాబ్దం పాటు డైరెక్టరుగాను, ఇంకా ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, క్యాలిఫోర్నియా వంటి అనేక విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగాను గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న సియన్నార్ రావుకు 'ఘన స్థితి రసాయన శాస్త్రం అన్నా, కణ నిర్మాణ రసాయన శాస్తం' అన్నా చాలా ఇష్టం.
అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే సూపర్ కండక్టర్లను తయారు చేసేందుకు ఉపయోగపడే మిశ్రలోహాల ఆక్సైడులను గురించి సియన్నార్ రావు చేసిన పరిశోధనలు చాలా ప్రామాణికమైనవిగా గుర్తించబడుతున్నాయి. 'శాస్త్ర పరిశోధనా రంగాలకు ప్రభుత్వ కేటాయింపులు మరింత పెంచాలి' అని సియన్నార్ రావు ప్రగాఢంగా విశ్వసిస్తారు.