ఒక ఊరిలో శర్వా అనే పిల్లవాడు ఒకడు ఉండేవాడు. వాడు రోజూ బడికి వెళ్ళేవాడు; కానీ తరగతిలో మాత్రం వాడి దృష్టంతా సినిమాల మీద, ఆటల మీద, షికార్ల మీదే ఉండేది. ఈ మధ్య వీడికి "ఫ్రెండ్స్ ఫాలోయింగ్" కూడా పెరిగి పోతోంది- సార్ చెప్పింది కొంచెం కూడా బుర్రకెక్కదు!

ఇక పరీక్షలు వస్తే వాడి పనల్లా- "ఒరే...ఒరే...చూపించరా!" అని తెలివైన పిల్లల్ని అడుక్కోవటం. నిజానికి అందరూ బ్రిలియంట్సేనండి: కొందరు మంచిగా చదువుకుని "బ్రిలియంట్" అనిపించు-కుంటారు; కొందరు వీడిలా "జులాయి" అనిపించుకుంటారు.

అయితే ఇప్పుడు శర్వా చేతిలో పుస్తకాలు ఉన్నాయన్న మాటేగానీ, బుర్రలోకి ఒక్క అక్షరం కూడా ఎక్కడం లేదు. మాస్టారెప్పుడూ డెవిల్ లాగా అరుస్తాడు- 'పైకెదగండ్రా' అంటాడు. "నేనింకా ఎంత ఎదగాలి, మా అమ్మ అయితే నన్ను 'చెట్టులా పెరిగావు గదరా!' అంటుంది. అసలు చదువెందుకు? నాకయితే పుస్తకం చేతిలోకి రాగానే నిద్ర ముంచుకొస్తుంది!" అని తనలో తాను అనుకోసాగాడు శర్వా.

అలాగని అతనేమీ గొప్ప ధనవంతుడు కాదు. చాలా పేదవాడు. నిజానికి వాళ్ళకు సొంత ఇల్లు లేదు- అద్దె ఇంట్లో ఉంటున్నారు; తల్లి ఇంటి దగ్గరే మిషన్ కుట్టుకుని, చిన్న టైలర్ గా పేరు తెచ్చుకుని, డబ్బులు సంపాదించి జీవనం సాగిస్తుంది. తల్లేమో ఇలా; కొడుకేమో అలా! తల్లేమో 'కొడుకుని బాగా చదివించాలి; మంచి ఉద్యోగం రావాలి' అన్న ధ్యాసలో ఉంది. కొడుకేమో జులాయిలా ఉంటున్నాడు.

పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకే లాగా ఉండవు కదా. ఒక రోజు రాత్రి శర్వాకి, వాళ్ళమ్మకి అన్నం లేదు. ఖాళీ కడుపుతోనే పడుకోవలసి వచ్చింది. అప్పుడు ఆలోచించాడు శర్వా- 'తన లాంటి వాళ్ళు ఎంత మంది ఇలా తినేందుకు తిండి లేక అకలితో పడుకుంటున్నారో' అని. ఆకలి బాధ తెలిసొచ్చింది- ఒక్క మన దేశంలోనే భోజనం లేక ఆకలితో పడుకునే పేదవాళ్ళు ఇరవై కోట్లకు పైగా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి పేదవారు కనిపించరు... ఈ వ్యవస్థ అలాంటిది!
ఆ నాడు శర్వాకి తెలిసొచ్చింది- 'విద్య రాకపోవటం' అనేది ఎంత దురదృష్టమో. "బ్రతకడానికి డబ్బులుండాలి- ఆ డబ్బులు కావాలంటే విద్య కావాలి! చదువులైనా రావాలి; లేకపోతే ఏదో ఒక వృత్తి విద్య అన్నా రావాలి.."

ఇక ఆ రోజు నుండి శర్వా షికార్లు, సినిమాలు, స్నేహితులతో ఊరికే తిరగడం- ఇవన్నీ బంద్ చేశాడు. చక్కగా చదువుకోవడం మొదలు పెట్టాడు.

తరగతిలో సార్ చెప్పుతున్న అంశాలను మనసుపెట్టి వినటం మొదలు పెట్టాడు. పరీక్షల్లో తన ప్రతిభని కనబరచసాగాడు.

ఏ రోజుకారోజు పాఠాలను పూర్తిగా చదివి నేర్చుకున్న తర్వాతనే నిద్రపోవటం మొదలు పెట్టాడు. తల్లి కూడా వాడిలోని మార్పును గమనించింది. వాడి చదువుల్లో సాయపడసాగింది.

అయితే మరో వైపున తల్లీ కొడుకుల జీవనం మరింత దుర్భరమైంది. పేదరికం ముదిరింది. కొడుకుని చదివించే శక్తి లేక 'ఒరే, చదువుని ఆపేసి ఏదైనా కూలిపని చెయ్యిరా' అంటుంది తల్లి- "అమ్మా! చదువుని ఆపమనకమ్మా! కొన్నేళ్ళు చక్కగా చదివానంటే, మంచి ఉద్యోగం చేయచ్చు. మన కష్టాలన్నీ తీరుతాయమ్మా! ఆలోగా చదువుకునే టైములో తప్ప, మిగతా ఖాళీ సమయంలో కథలు, నాటికలు, జోక్స్ వంటి రచనలు చేసి 'రచయిత'గా పేరు తెచ్చుకుంటాను. నా రచనల్ని పుస్తకాలుగా ముద్రించేవాళ్ళు ఇచ్చే డబ్బుతో చదువుకుంటానమ్మా! నా మాటను కాదనకు" అంటాడు కొడుకు.

ఈ‌ రోజుల్లో ప్రతీదీ అమ్ముతున్నాడండీ, ఈ మానవుడు! నీళ్ళ దగ్గర నుంచి ప్రతీదీ అమ్ముతున్నాడు. వాడు ఏదైనా అమ్ముతాడు- చివరకు పేల్చే గాలిని కూడా.. చదువునే అమ్ముతున్నాడు కదా ప్రస్తుతం?! ఇక రాబోయే కాలంలో ఆనాటి పుస్తకాల్లో చెప్పే ప్రతీ అక్షరాన్నీ అమ్ముకుంటాడు. అవసరమైతే సూర్యుడ్ని కూడా ఎవడికో అమ్మేస్తాడు: "ఏయ్...! సూర్యుడ్ని నేను కొన్నాను. సూర్యుడు నావాడు. సూర్యుడి నుండి వచ్చే వెలుగు నాది. దానికి ఫైన్ కట్టు" అంటాడు.

వాడికి వ్యాపారమే... వ్యాపారం. అది తప్ప మరింకేదీ లేదు. అయినా 'మనకెందుకులే, ప్రజలకి లేనిది మనకెందుకు?' అని అనుకుంటే ఇక పశువుకు, మనిషికి తేడాయే లేదు!

అటుపైన శర్వా చదువులు బాగా చదివాడు. రకరకాల పరీక్షలు రాసి, డాక్టరయ్యాడు. మరో వైపున అతను గొప్ప మానవత్వం‌ ఉన్న రచయితగా కూడా పేరు తెచ్చుకున్నాడు.

డాక్టర్-రచయిత! ఎలా ఉండిన శర్వా, ఎలా అయ్యాడో చూశారుగా? సుఖం కావాలంటే ముందు కష్టాన్ని అనుభవించాల్సిందే, తప్పదు. కష్టం సుఖానికి తాళంచెవి లాంటిది.

అందుకని, నేను మీకు చెప్పేదేమంటే, తల్లిదండ్రులు మనకు చెప్పే ప్రతీ విషయాన్ని అర్థం చేసుకోవాలి. 'ఎందుకింత నస?' అనుకోకూడదు. శర్వా చివరకు తన తల్లి కన్న కలల్ని పూర్తి చేశాడు- కొడుకంటే అలా ఉండాలి!

మరి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. డాక్టరు శర్వాలాగానా, లేకపోతే తిరుగుబోతు వెధవగానా? నిర్ణయం మీదే!