నాకో మిత్రుడున్నాడు- మాంటీ రాబర్ట్స్. అతను చాలా ధనవంతుడు. సాన్‌సిడ్రో పట్టణానికి ఆవల, 200 ఎకరాల పచ్చిక భూమి ఒకటి ఉంది అతనికి. అందులో అతను గుర్రాలను పెంచుతాడు!

మేలుజాతి అరేబియన్ గుర్రాలనుండి మామూలు పొట్టి గుర్రాలవరకూ రకరకాల గుర్రాలు పెరుగుతుంటాయి అతని దగ్గర. వాటికన్నిటికీ అతను శిక్షణనిచ్చి, పందెపు గుర్రాలుగా తయారు చేస్తుంటాడు. ఒక్కో గుర్రాన్నీ పందాల వాళ్ళు లక్షల రూపాయలిచ్చి కొనుక్కుపోతుంటారు!

నేను ఒక్కోసారి గ్రామాలకు వెళ్ళి, యువకులకు ఉత్సాహాన్ని కలిగించే పనులేవైనా చేసి వస్తుంటాను. అలాంటప్పుడు మాంటీ నాకు తన గుర్రాన్నిచ్చి పంపించటమే కాకుండా, దానికి అయ్యే ఖర్చుల్ని కూడా తనే భరిస్తుంటాడు.

ఒక మామూలు గుర్రాల వ్యాపారికి ఇట్లాంటి మంచి బుద్ధి ఎందుకొచ్చిందో నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు- ఓసారి నన్ను తన మిత్రులకు పరిచయం చేస్తూ అతను ఇలా చెప్పేంతవరకూ- ఇది విన్నాక నాకు అతను బలే నచ్చాడు:

"చాలా ఏళ్ళ క్రితం ఒక కుర్రాడు ఉండేవాడు. వాళ్ల నాన్న గుర్రాలకు శిక్షణనిచ్చేవాడు: 'ఒక చోట' అని కాకుండా, ఎవరి దగ్గర పని ఉంటే వాళ్ల దగ్గర పని చేసేవాడు- ఒక గుర్రపు శాల అనక, ఒక ఊరనక, ఒక పందెపు ట్రాక్‌ అనక, ఒక పొలం అనక- ఎక్కడ పని ఉంటే అక్కడికల్లా తిరుగుతూ ఉండేవాడు. దానివల్ల అతని కొడుకు చదువులు ఎక్కడా సరిగ్గా సాగకుండా అయ్యింది. ప్రతి బడిలోనూ అతనికి 'మొద్దు' అని పేరొచ్చింది..

"ఒకసారి అతను చదివే బడిలో మాస్టారు వీళ్ల తరగతి పిల్లలకు ఒక అసైన్‌మెంటు ఇచ్చారు- 'పెద్దయిన తర్వాత ఏమవుతావు, ఏం చేస్తావు?' అని వివరంగా రాసి ఇవ్వాలి.

"ఈ కుర్రాడు ఆ రోజు రాత్రంతా కూర్చొని, తను పెద్దయ్యాక ఏం చేద్దామను-కుంటున్నాడో ఏడు పేజీల్లో రాశాడు: 'గుర్రాల్ని మేపే పచ్చిక బయలుకు యజమాని అవుతాడు తను!'.

తన కలని అతను చాలా స్పష్టంగా వివరించాడు కూడా- తను ఏ 200ఎకరాల పచ్చిక భూమికైతే యజమాని అవ్వాలనుకుంటున్నాడో, ఆ భూమి బొమ్మకూడా గీసాడు; అందులో ఏ భవనం ఎక్కడ ఉండబోతున్నదో గీసి చూపాడు; ఏ గుర్రపుశాల ఎటువైపున ఉండబోతున్నదీ చూపాడు; ఆ రెండొందల ఎకరాల కలల పచ్చికభూమిలో ఉండబోతున్న 4000 చదరపు అడుగుల ఇంటి ప్లాను కూడా గీసేసాడు! ఈ పని చేస్తున్నప్పుడు అతను అందులో‌ తన హృదయాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించాడు. తర్వాతి రోజున ఉత్సాహంగా తను చేసిన ఆ అసైన్‌మెంటును తీసుకెళ్ళి మాస్టారికి అందించాడు.

రెండు రోజుల తర్వాత అతని అసైన్‌మెంటు అతనికి తిరిగి ఇవ్వబడింది- అసైన్‌మెంటు మొదటి పేజీలో ఎర్ర ఇంకుతో పెద్ద F రాసి ఉన్నది. "క్లాసు ఐపోయాక నన్ను కలు" అని కూడా రాసి ఉన్నది క్రింద!

కలకన్న ఆ కుర్రాడు క్లాసు ఐపోగానే వెళ్ళి మాస్టారిని కలిసాడు: 'నాకు F గ్రేడు ఎందుకిచ్చారు?' అని అడిగాడు.

మాస్టారు అన్నారు: "ఎందుకంటే అది పూర్తిగా అసంబద్ధంగా ఉంది గనక. నీలాంటి కుర్రవాడికి ఏమాత్రం సాధ్యం కాని కల
అది! చూడు- నీ దగ్గర డబ్బు లేదు. మీ నాన్న దేశ ద్రిమ్మరి- నిలకడ లేని కుటుంబం మీది. నీ దగ్గర వనరులేవీ లేవు.

గుర్రాల్ని మేపే పచ్చిక బయలు అంటే ఎన్ని డబ్బులో కూడా నీకు తెలీదు. పిల్లల్ని కనే జాతి గుర్రాలను కొనుక్కొచ్చుకోవాలి మొదట- దానికి కూడా నీ దగ్గర డబ్బు లేదు. ఇక ఆ తర్వాత పెద్ద గుర్రాలకు శిక్షణనిచ్చేందుకు ఫీజులూ చెల్లించాల్సి వస్తుంది. ఆ డబ్బూ లేదు- నువ్వు నీ కలని తీర్చుకొనే అవకాశం అసలైతే సున్న!"

"నువ్వు నీ కలని తిరగరాయాలి- మరింత వాస్తవికంగా ఉండే అంశం ఏదైనా ఎంచుకో. అప్పుడు మరి, నీ గ్రేడును మార్చగలనేమో చూస్తాను"

ఆ కుర్రాడు ఇంటికి వెళ్లి మాస్టారు చెప్పిన దాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించాడు. అతని ఆలోచనలు ఎంతకీ తెగలేదు. వాళ్ల నాన్నని సలహా అడిగితే ఆయన "చూడు నాయనా! ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఆలోచించిగానీ ఏ నిర్ణయమూ తీసుకునేందుకు లేదు. ఏలాంటి నిర్ణయం తీసుకున్నా ముందు మనసును బాగా గట్టిచేసుకో" అని ఊరుకున్నాడు.

చివరికి, ఒక వారం రోజులు ఆలోచించాక, పిల్లవాడు తను అంతకు ముందు రాసిన అసైన్‌మెంటునే- ఒక్క మార్పు కూడా చేయకుండా- తీసుకెళ్ళి మాస్టారికి అందిస్తూ చెప్పాడు- "మీరు మీ F గ్రేడును అలాగే ఉంచుకోండి; నేను నా కలని అలాగే ఉంచుకుంటాను" అని.

అక్కడ చేరిన మిత్రులకు ఈ కథని చెబుతూ మాంటీ రాబర్ట్స్ అన్నాడు-"మీకు ఈ కథని ఎందుకు చెబుతున్నానంటే, మీరంతా ఇప్పుడు, ఇదిగో- నా 200ఎకరాల గుర్రాలశాల మధ్య, నా 4000 చదరపు అడుగుల సొంత ఇంట్లో కూర్చొని ఉన్నారు గనక!

ఆనాడు నేను మా మాస్టారుకి ఇచ్చిన అసైన్‌మెంటు ప్రతిని ఫ్రేం కట్టించి పెట్టుకున్నాను- ఆ గోడకు వేలాడుతున్నది అదే" అని.

ఈ సంగతి చెప్పి, అతను ఒక గ్లాసెడు నీళ్ళు త్రాగి, తన కథని కొనసాగించాడు-

"కొసమెరుపు ఏంటంటే, రెండేళ్ల క్రితం అదే మాస్టారు ఓ ముప్ఫై మంది పిల్లల్ని వెంట వేసుకొని వచ్చి, నా పచ్చిక బయలులో ఒక వారం రోజులు క్యాంపు ఉన్నాడు.

వెళ్తూ వెళ్తూ ఆయన తన మనసులో ఇంతకాలం దాచుకున్న రహస్యాన్ని చెప్పేశాడు- 'చూడు మాంటీ! నేను నీకు పాఠాలు చెప్పిన ఆ కొద్ది సంవత్సరాల కాలంలో నేను చాలా మంది పిల్లల కలల్ని దోచుకున్నాను. వాళ్ళ కలల స్థానంలో అర్థం లేని వాస్తవిక ఆలోచనల్ని చాలా వాటిని నింపి పెట్టాను. నువ్వు నీ కలని నాకు దోచిపెట్టకుండా ఆపుకోగలిగావు. అంత స్థైర్యమూ, ఊహా నీకుండటం నిజంగా నీ అదృష్టం. లేకపోతే నువ్వు.. ' అని ఆగాడు.

అందుకనే చెబుతాను- "మీ కలల్ని మీరే ఉంచుకోండి. వేరే ఎవ్వరికీ దోచిపెట్టకండి. ఏది ఏమైనా సరే, మీ అంతరాత్మ చెప్పేదాన్నే అనుసరించండి. ఎంత అసంభవం అనిపించినా సరే, మీ కలలు మీవి- వాటిమీద వేరే ఎవ్వరికీ హక్కులు ఇవ్వకండి!"