జెన్ బౌద్ధ గురువు 'షిచిరి' గురించిన కథ ఇది.
ప్రతిరోజూ రాత్రి ఎనిమిది కల్లా అందరినీ ఎవరి దారిన వాళ్ళను పంపించేసి, ఒంటరిగా, తన మానాన తను ఉండేవాడు షిచిరి.
అలా ఒకరోజున, పడుకునేముందు అలవాటుగా కొంచెం సేపు ధ్యానానికి కూర్చున్న సమయంలో అకస్మాత్తుగా ఊడిపడ్డాడు ఒక దొంగ: ఆయన మెడమీద కత్తి ఉంచి "మర్యాదగా నీ దగ్గర ఉన్న సొమ్మునంతా నా వశం చేస్తావా, నిన్ను ఇలాగే ఖతం చెయ్యమంటావా?" అన్నాడు కరకుగా.
షిచిరీకి ఎలాగూ భయం వెయ్యలేదు; కానీ ధ్యానం చెడిపోతుందేమోనని మా చెడ్డ అనుమానం వేసింది.
"నన్ను డిస్టర్బు చెయ్యకు! డబ్బేగా, కావాల్సింది? ఎంత కావాలో అంత తీసుకో- అదిగో ఆ బీరువాలో ఉంది!" అనేసి, మళ్ళీ తన ధ్యానంలో తను మునిగిపోయాడు.
దొంగతనం మరీ ఇంత సులువుగా అయిపోతుందని దొంగ ఊహించలేదు: అందుకని అతను చాలానే ఆశ్చర్యపోయాడు, కానీ వెంటనే తేరుకొని తన పని తను కానిచ్చాడు- బీరువాలో ఉన్న డబ్బులన్నీ ఎత్తి మూట కట్టుకుంటుంటే మధ్యలో షిచిరీ ఓమాటు కళ్ళు తెరిచి "ఇదిగో, నీ పేరేంటో గానీ- అక్కడున్న డబ్బులు మొత్తం తీసుకోకు. రేపు ప్రొద్దునే ప్రభుత్వం వారి పన్ను కట్టేందుకు కొంత వదిలిపెట్టు; కావాలంటే మిగతాది అంతా పట్టుకెళ్ళు!" అన్నాడు.
దొంగవాడు సరేనని, కొంత సొమ్మును అక్కడే వదిలి, మిగతాది మూటకట్టుకొని, ఇంటికి బయలుదేరాడు.
అతను ఇంకా గడప దాటకనే, వెనకనుండి షిచిరే గొంతు వినిపించింది మళ్ళీ- "ఏం మనిషివయ్యా, నువ్వు?! అంత సొమ్ము తీసుకు పోతున్నావు, కనీసం 'థాంక్స్' అని ఒక్క మాట కూడా అనలేదే?! మర్యాద ఏమైంది?!" అని.
ఈసారి దొంగ నిజంగా అదిరిపోయాడు. ఒక్క క్షణం పాటు అతని మెదడు పనిచేయటం మానేసింది. "ధన్యవాదాలండి" అని గబగబా గొణిగేసి, వాడు ఇంటికి పరుగు పెట్టాడు. ఆ తర్వాత తన స్నేహితులందరికీ చెప్పాడు వాడు- 'నా జీవితంలో అంతకు ముందు ఎన్నడూ అంత భయపడి ఎరుగను' అని.
కొద్ది రోజులు గడిచాయి. దొంగ పట్టుబడ్డాడు. వేరే ఎక్కడో దొంగతనం చేస్తూ చేస్తూ రాజభటుల చేతికి చిక్కిపోయాడు. షిచిరీ ఆశ్రమంలో చేసిన దొంగతనంతో సహా తను చేసిన ఇతర నేరాలన్నిటినీ అతను న్యాయాధికారి సమక్షంలో అంగీకరించాడు.
న్యాయాధికారిగారు వాంజ్ఞ్మూలం ఇచ్చేం-దుకుగాను షిచిరీని పిలిపించారు. "ఈ మనిషి మీ ఇంటి నుండి డబ్బు
దొంగిలించాడట కదా?! జాగ్రత్తగా చూడండి ఇతన్ని. ఇతనేగా, దొంగ? జాగ్రత్తగా చూసి చెప్పండి" అన్నారు.
"లేదు, లేదు! నాకు ఇతను తెలుసు. ఇతను మా ఇంట్లో దొంగతనం ఏమీ చెయ్యలేదు. ఆ డబ్బంతా నేనే అతనికి ఇచ్చాను. అందుకుగాను అతను నాకు ధన్యవాదాలు కూడా చెప్పాడు!" అన్నాడు షిచిరీ చాలా మామూలుగా.
ఆ క్షణంలో దొంగ మనసు ద్రవించింది. పశ్చాత్తాపపు బీజం అతనిలో నెలకొన్నది.
తన శిక్ష ముగించుకోగానే అతను షిచిరీ దగ్గరకు వచ్చి శిష్యుడిగా స్వీకరించమని ప్రాధేయపడ్డాడు.
త్వరలోనే అతనిలోని మాలిన్యం అంతా పోయి, కడిగిన ముత్యం మాదిరి పరిశుద్ధుడయ్యాడు!