రాణి సౌభాగ్యలక్ష్మీదేవికి తోటలంటే ప్రాణం. అంత:పురం వెనకాల పెద్ద ఉద్యానవనం ఒకటి వేయించారావిడ. తోటనిండా పసుపు బంతులు, చేమంతులు, తెల్లని లిల్లీలు, నందివర్ధనాలు, ఎర్ర గులాబీలు, మందారాలు, సువాసనలు విరజిమ్మే మల్లెలు, విరజాజులు, మాలతీలు. ఇవేకాక కనకాంబరాలు, ప్రొద్దుతిరుగుళ్లు, కలువలు, తామరలు- ఇంకా ఎన్నో.
పూల మొక్కలు, పండ్ల చెట్లు, కూరగాయల మొక్కలు. ధరణి తల్లికి అలంకరించిన విరి హారం, ఆ తోట.
రంగు రంగుల సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తుమ్మెదలు ఆ తోటలోని పూలతో ఆటలాడుకునేవి. ఆ చెట్ల జాడల్లో రకరకాల పక్షులు, జంతువులు సేదతీరేవి.
ప్రతిరోజూ ఉదయం రాణిగారు పూల-తోటలోని మొక్కలతో మాట్లాడుతూ, వాటిని సృశిస్తూ కాలం గడిపేవారు. రాణిగారి రాక కోసం రోజూ పూలన్నీ ఎదురుచూసేవి. అయితే ఆ రోజున రాణిగారికి ఏదో పనుందట. ఆవిడ తోటకు రావట్లేదు: ఈ సంగతి తెలిసిన పూలన్నీ చిన్నబోయాయి.
ఇంతలో పడమరనుండి చల్లని పిల్లతెమ్మెర వీచింది. పూలన్నీ ఒక్కసారిగా పులకించి పోయాయి. మొక్కలు కులాసాగా అటూ ఇటూ ఊగాయి. ఒకదానిని ఒకటి మృదువుగా తాకుతూ గుసగుస-లాడుకున్నాయి.
పువ్వులం మేం పువ్వులం
బంతులం, చేమంతులం
మల్లెలం, మందారాలం
కలువలం, తామరలం
ఆకూ-ఆకు తాకుకుంటూ
ఆనందంగా ఊగుతాం
అంటూ పాడసాగాయి. ఆ ఆనందంలో జంతువులు, పక్షులు, తేనెటీగలు, సీతాకోక చిలుకలు అన్నీ పాల్గొంటున్నాయి-
అంతలో కెవ్వున ఒక కేక వినబడింది వాటికి- అన్నీ ఉలిక్కిపడి అటు వైపుకు చూశాయి- భయంతో కంపించి పోయాయి. చిన్న రాకుమారుడు సురేంద్ర వర్మ అటుకేసి వచ్చి, విరిసీ విరియని మొగ్గతో ఉన్న చిన్ని పొద్దు తిరుగుడు మొక్కను చటుక్కున పీకేశాడు! చిన్ని మొక్క బాధతో అరిచిన అరుపు అది!
పీకిన ఆ మొక్కను దూరంగా విసిరేశాడు సురేంద్రవర్మ, వెటకారంగా నవ్వుతూ. ఆ మొక్క కాస్తా సొమ్మసిల్లి పడిపోయింది!
అప్పటివరకూ కిలకిల నవ్వుతూ, పాటలు పాడుతున్న పూల మొక్కలన్నీ విలవిల లాడిపోయాయి. ఏడుస్తూ చిన్ని మొక్క వైపుకు బాధగా చూశాయి- ఏమీ చేయలేక.
వెంటనే చీమలు రంగంలోకి దిగాయి. ఈ విషయం రాణిగారికి చెప్పాలని ఒకదాని వెనుక ఒకటి వరుసగా అంత:పురం వైపుకు పరుగు పెట్టాయి. వాటి వెనుక తుమ్మెదలు, ఆ వెనుక తేనెటీగలు, సీతాకోక చిలుకలు, పురుగులు, ఆపై పక్షులు, కుందేళ్లు, జింకలు. కానీ అంత:పురం తలుపులు మూసి ఉన్నాయి. వీళ్లెవ్వరికీ అక్కడ ప్రవేశం లేదు!
ఎప్పుడూ రాత్రివేళ వేళ తప్పిస్తే బయటికిరాని గుడ్లగూబ తాతయ్య ఆనాడెందుకో డాక్టరు తులసమ్మ దగ్గరకు వెళుతున్నాడు. వీళ్లందరినీ చూసి, ఏమిటని అడిగాడు.
"తాతా! ఈ చిన్నిమొక్కను చిన్న రాకుమారుడు నిష్కారణంగా పీకేశాడు. అది ఎట్లా సొమ్మసిల్లి పడిపోయిందో చూడు! ఈ విషయం రాణిగారికి చెబుదామంటే అంత:పురం తలుపులు మూసి ఉన్నాయి. ఏదైనా ఉపాయం ఉంటే చెప్తావా?" దిగాలుగా అడిగాయి అన్నీ.
గుడ్లగూబ తాతయ్య కొంచెం ఆలోచించాడు. "దానిదేముంది, సులభం. పెద్దకళ్ళ కోతిపిల్ల ఎక్కడుంది?" అడిగాడు. జంతువులన్నీ పెద్దకళ్ళ కోతిపిల్లను ముందుకు తోశాయి. గుడ్లగూబ తాతయ్య దాని చెవిలో ఏదో గుసగుస చెప్పాడు.
అంతే- అది ఎగిరి గంతేసి, కొమ్మల పైకి ఎక్కుతూ, అంత:పురం గోడపైకి దూకింది. గది-గది చూసుకుంటూ రాణిగారి గదిని కనిపెట్టింది. లోపలికి వచ్చేసిన కోతిపిల్లని చూసి చెలికత్తెలు అటు ఇటూ పరుగులు తీశారు. కూర్చొని ఉన్న రాణిగారి చెయ్యి పట్టుకుని లాగింది కోతిపిల్ల. ఉలిక్కిపడి లేచి, ఆశ్చర్యంగా దానివైపుకు చూశారు రాణిగారు.
మళ్ళీ మళ్లీ రాణిగారి చేతిని లాగుతూ, కిటికీ పైకి ఎగిరింది కోతిపిల్ల. ఆమెకు అర్థం కాలేదు. లేచి, ఏమిటా అని కిటికీ లోంచి బయటికి చూశారు. చిన్ని చీమ నుండి పెద్ద ఏనుగు వరకూ అన్నీ ఆమెకోసం బారులు తీరి వేచి చూస్తున్నాయక్కడ!
రాణిగారు గబగబా బయటికి వచ్చారు. సొమ్మసిల్లి పడిపోయిన చిన్ని పొద్దుతిరుగుడును ఆమెకు చూపించింది కోతిపిల్ల.
రాణిగారి గుండె కరిగి పోయింది. మొక్కను మెల్లగా చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా తడిమింది. తోటమాలులను పిలిచి మొక్కను చూపించింది.
రంగయ్య గాబరా పడ్డాడు. "అమ్మా, మేం పీకలేదు ఆ మొక్కను. ఇందాక.." అన్నాడు కంగారుగా .
“ఊఁ..ఇందాక..?”
“ఇందాక.. చిన్న యువరాజావారు..”
"ఓహోఁ అదా సంగతి! సరే, వారికి నేను చెబుతాను. ఇకపై ఎప్పుడూ మొక్కల్ని ఇలా చెయ్యద్దని చెబుతాను. ముందు నువ్వు దీన్ని నీడలో నాటు. దానికి ఏమీ కాకుండా జాగ్రత్త తీసుకో" హుకుం జారీ చేశారు రాణిగారు.
రంగయ్యకు మొక్కలనాడి బాగా తెలుసు. చిన్ని మొక్కకు చేయవలసిన చికిత్సలన్నీ చేశాడు. మూడు రోజుల తర్వాత చిన్ని
మొక్క తిప్పుకుని లేచి నిటారుగా నుంచుంది.
రాణిగారు వచ్చి చూశారు. చిన్ని మొక్కకు, బుల్లిపువ్వుకు చిన్న ముద్దిచ్చారు. పూలన్నీ సంతోషంతో కిలకిల నవ్వాయి. అన్నీ ఆమె వైపుకు వంగాయి- తమకూ ముద్దివ్వమని!