"ఓహో! అంత గొప్పవాడా! అందుకనే కాబోలు, నీచేత అంత సులభంగా మోసపోయాడు!. ఏది ఇంకొంచెం పొగుడు అతన్ని, విందాం!" అన్నది నెమలి వెటకారంగా.
అప్పుడు కాకి చిన్నబుచ్చుకొని కూడా, ధైర్యంగా "ప్రభూ! ఎవరినైనా పూర్తిగా విశ్వసించి, ఆ నమ్మకంకొద్దీ ఏమారి ఉంటే, అలా ఆదమరచిన వాళ్ళని మోసం చేయటం ఏమంత పెద్ద ఘనకార్యం కాదు. నమ్మి, మన తొడ మీద తల పెట్టుకొని నిద్రపోతున్నవాడి గొంతు కోసి చంపటమూ ఒక పౌరుషమేనా?".
'నల్లని వన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలు' అనుకొనే అమాయకులు 'మా లాగానే లోకంలో అందరూ కూడా మంచివాళ్ళు; ఎల్లప్పుడూ సత్యమే చెబుతారు; మోసం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు' అనుకుంటూ ఉంటారు. తమ లోపల ఉండే మాయ మర్మాలు బయటపడకుండా, నేర్పుతో తేనె పల్కులు పలికే దుర్మార్గుల వలలో- మొదట మొదట, తమ అమాయకత్వం కొద్దీ -చిక్కుకుంటారు కూడా.
అయితే అలా ఒకటి రెండు సార్లు నష్టపోయిన తర్వాత, ఆ అనుభవాన్ని అనుసరించి తర్వాతి కాలంలో జాగ్రత్త పడుతుంటారు, వాళ్ళు కూడానూ.
ఎవరైనా క్రొత్తగా వచ్చిన వాడి గుణగుణాలను వాడి మాట తీరును బట్టి నిశ్చయించు-కోవాలి తప్పిస్తే, వాడి మనసులోకి జొరబడి చూడలేరు కదా! గతంలో ఇట్లాగే బ్రాహ్మణుడొకడు మోసగాళ్ళ మాటల వలనే మోసపోయాడు కదా- తమరికి ఆ కథ చెబుతాను వినండి:
బ్రాహ్మణుడు-దొంగలు
మంచి నిష్ఠగల బ్రాహ్మణుడు ఒకడు ఒకరోజున యజ్ఞం చేయాలనుకున్నాడు. ఆ యజ్ఞం కోసం నల్ల మేక ఒకటి కావలసి ఉండింది. అతను పొరుగూర్లో అలాంటి మేక నొకదాన్ని సంపాదించుకొని, దాని మెడకొక త్రాడు కట్టి, చాలా సంతోషంగా దాన్ని ఇంటికి యీడ్చుకొని పోసాగాడు.
దారిలో ఒక చెరువు గట్టు మీద కూర్చున్న దుర్మార్గులు కొందరు ఆ మేకను చూసి ముచ్చటపడ్డారు. దాన్ని కాజేయాలని, వాళ్లలో ఒకడిలా అన్నాడు- "ఇదిగో, యీ బ్రాహ్మణుడు ఎంత చక్కగా బలిసిన మేకపోతును తీసుకు పోతున్నాడో చూడండి.
ఒక బంగారు నాణెం ఇచ్చి కొందామన్నా మనకు ఇట్లా క్రొవ్విన పోతు దొరకదు. ఈ బ్రాహ్మణుడిని మోసం చేసి దీన్ని ఎలాగైనా కాజేశామంటే, ఇక వారం రోజుల వరకూ మనం ఇటూ అటూ వెతుక్కునే పని లేకుండా మాంసం తింటూ గడపవచ్చు" అని.
దానికి మరొకడు "బ్రాహ్మణుడు పిశాచంలాగా పట్టుకొని ఏమారకుండా దాని గొంతుకు ఉరి త్రాడు మల్లే కట్టి లాక్కుపోతున్నాడే! దాని పెనుగులాటకు ఊర్లో దుమ్మంతా ఎట్లా రేగుతున్నదో చూడండి. పట్టపగటి పూట, నడిరోడ్డున- మనం వాడి కళ్ళు కప్పి దీన్ని లేవనెత్తుకు పోయేదెట్లాగ? ఇంతమంది కళ్ళు కప్పగలమా? వీలుకాదు- వదిలెయ్యండి.
రాజభటులు కూడా దుడ్డు కర్రలు పట్టుకొని నగరంలో అంతటా తిరుగుతున్నారు. 'దొంగలు' అని పట్టుకుపోయి మన కోపిష్టి రాజు ఎదుట నిలబెట్టారంటే, ఘోర శిక్షలకు గురవ్వాల్సివస్తుంది. దేవుడు మనకు ఇచ్చినదాన్ని తింటూ సుఖంగా ఉండక, క్రొవ్వెక్కి, చేయరాని పనులు చేస్తే మనందరికి ఒకేసారి చుక్కలు కనిపిస్తాయి. వృధా ప్రయాసవద్దు. దీని వల్ల మనకు అవమానం కలుగుతుంది తప్ప, మన కోరిక మాత్రం నెరవేరదు. నా మాట విని వీడిని వదిలెయ్యండి" అన్నాడు.
చిన్ననాటి నుండే మోసపు పనులు చేసి చేసి రాటు దేలి పోయిన ముసలిదొంగ ఒకడు వీడి మాటలకు పకపకా నవ్వి-"ఒరే! నీకు అనుభవం లేక పిరికి మాటలు మాట్లాడుతున్నావు గానీ, నిజంగా నాలాంటి వాడు తలచుకుంటే ఇంత చిన్న పని సాధించటం ఎంత ?! మూడు కళ్ళున్న ఆ పరమశివుడిని కూడా మోసం చేసి నా కోరికను యీడేర్చుకోగల శక్తి నాకున్నది చూస్తుండు. మీరంతా చూస్తుండగానే, నా శక్తి చేత, యీ మేకను కుక్కను చేసి తీసుకువస్తాను- మీ కోరిక తీరేట్లు దీని మాంసంతో మీకందరికీ విందు చేస్తాను; మీ చేత 'శహబాష్' అనిపించుకుంటాను. మొసలిని మోసగించే కదా, కోతి తన ప్రాణం కాపాడుకున్నది?! ముందు మీకు ఆ కథ చెబుతాను వినండి- అని ఇలా చెప్పసాగాడు:
కోతి-మొసలి
పశ్చిమ సముద్ర తీరాన ఉన్న అడవిలో 'బలవర్థనుడు' అనే ముసలి కోతి ఒకటి నివసిస్తూండేది. ముసలి తనం వల్ల దాని శక్తి సన్నగిల్లేసరికి, దాయాదులు దాని ఆస్తులనన్నింటినీ దోచుకొని, దాన్ని వెళ్ళగొట్టి అడవుల పాలు చేశారు. బలవర్థనం అడవుల్లో అంతటా తిరిగి- తిరిగి చివరికి 'తపతి' నది ఒడ్డున పళ్ళతో నిండిన గొప్ప మేడి చెట్టునొకదాన్ని ఆశ్రయించుకున్నది. ఆ పళ్ళనే తింటూ కాలం గడుపు కొస్తున్నది.
ఇట్లా కేవలం పళ్ళు మాత్రం తింటూ జీవిస్తున్న కోతి ఆ మేడి చెట్టు మీదే సుఖంగా చాలాకాలం ఉన్నది. ఒక రోజున పండ్లు తింటూంటే ఒక మేడి పండు దాని చేతిలోంచి జారి, క్రింద ఉన్న నీళ్ళలో పడి 'బుడుంగు'మంటూ మునిగింది. కోతి చెవులకు ఆ శబ్దం చాలా నచ్చింది. తనలో ఉన్న కోతి ప్రవృత్తి బయటపడగా, బలవర్థనం ఒకదాని తర్వాత మరొక మేడి పండును వరసగా నీళ్ళలోకి విసిరి, ఆ శబ్దం వినటం, కేరింతలు కొట్టడం మెదలెట్టింది.
సరిగ్గా ఆ సమయానికే చెట్టు క్రిందికి వచ్చి, బురదలో వచ్చి పడుకొని ఉన్నది, "క్రకచం" అనే ఒక మొసలి. కోతి విసిరిన పండొకటి నేరుగా దాని నోట్లోనే పడింది. అది పండుని చప్పరించి, రుచి మరిగింది. అటుపైన అది నీళ్ళలోకి పోయి, కోతి విసురుతున్న పండునల్లా పట్టుకొని నాలుక దురద తీరేట్లు మెల్ల మెల్లగా చప్పరించుకుంటూ తినసాగింది.
అలా పళ్ళమీది ఆశ కొద్దీ అది కోతితో స్నేహం చేసి, ఇల్లూ-వాకిలీ మర్చిపోయి, భార్యాబిడ్డలను వదిలేసి, నెలల కొలదీ అక్కడే కాలక్షేపం చేయటం మెదలు పెట్టింది.
ఇక అక్కడ, దాని ఇంట్లో, క్రకచం భార్య దాని కోసం వేచి చూసీ-చూసీ, ఇక తాళలేక, భర్తను తలచుకొని రాత్రనక-పగలనక కళ్ళలోంచి కన్నీరు ధారలు కట్టగా ఏడుస్తూ ఉండి, చివరికొక స్నేహితురాలిని పిలిచి, "ఒసే! నా ప్రాణ నాధుడికి ఏమైందో, మరి ఇంతకాలంగా ఇంటికి రాలేదు. ఆయన క్షేమం విచారించి కనుక్కో; ఆయన జాడ తెలిపి పుణ్యం కట్టుకో. లేకపోతే నా ప్రాణాలిక నిలువవు" అని అనేక విధాలుగా ప్రార్థించింది.
ఆ చెలికత్తె కూడా వేగంగా అన్ని దిక్కులూ వెతికి, చివరికి ఆ మేడి చెట్టు క్రింద, కోతితో ముచ్చటలాడుతూ నవ్వులు కురిపిస్తున్న మొసలి వీరుడు క్రకచాన్ని కనుగొని, ఆ సంగతినే క్రకచం భార్యకు తెలియ జేసింది- "తల్లీ! నీ భర్త క్రకచం ఒక ఆడ కోతి సావాసం మరిగింది. ఆ మురిపెంలో అది ఒళ్ళు మరచి పోయింది. ఇక నీ గోడు- నీ పిల్లల గోడు పట్టించుకునేట్లు లేదు తల్లీ" అని, ఉన్నవీ- లేనివీ కల్పించి చెబుతూ, గ్రుడ్లలో నీరు క్రుక్కుకున్నది!
(...తర్వాత ఏమైందో మళ్ళీ చూద్దాం!)