అనగా అనగా చాలా కాలం క్రితం వింధ్య పర్వతాల్లో దట్టమైన అడవి ఒకటి ఉండేది. ఆ అడవిలో చాలా కోతులు నివసిస్తూ ఉండేవి. ఆ కోతుల రాజు చాలా పెద్దగా, చాలా లావుగా, చాలా బలంగా, మిగిలిన కోతులకంటే ప్రమాణంలో ఐదింతలు ఉండేది. అప్పటికే తాను చేసుకున్న మంచి పనుల ఫలితమేమో మరి, అది అన్ని ప్రాణులపట్లా దయ కలిగి ఉండేది; జ్ఞానంతో, మెలకువ కలిగి ప్రవర్తించేది.
ఆ అడవిలోంచి పెద్ద వాగు ఒకటి వెలువడేది. అడవి అవతల ఉన్న జనపదాల గుండా ప్రవహిస్తూ పోయి, అది ఓ పెద్ద నదిలో కలిసేది.
ఒకసారి కోతిరాజు కొన్ని కోతులను వెంటబెట్టుకొని కులాసాగా ఆ వాగు వెంబడి నడుస్తూ పోయింది. అక్కడొకచోట దానికి పెద్ద మామిడి చెట్టు కనిపించింది. పెద్ద పెద్ద కొమ్మలతో, కొమ్మ కొమ్మకూ బంగారు రంగులో మెరిసే పళ్ళతో అలరారే ఆ మామిడి చెట్టు వాగుని ఆనుకొనే ఉంది.
దాన్ని చూడగానే కోతిరాజు "ఈ చెట్టుకి ఉన్న పండ్లన్నిటినీ తక్షణం కోసి తినేయండి. కాయలన్నిటినీ కోసేయండి. ఒక్క పిందె కూడా మిగలకూడదు. లేదంటే అనర్థం ముంచుకొస్తుంది" అని తను అక్కడే నిలబడి, చెట్టుకున్న పండ్లను-కాయలను అన్నిటినీ వెతికి వెతికి కోయించేసింది.
కోతులన్నీ గబగబా మామిడి పండ్లను, కాయలను కోసి, తిన్నంత తిని సంతోషపడ్డాయి తప్పిస్తే తమ రాజు అలాంటి ఆజ్ఞ ఎందుకిచ్చాడో వాటికి తెలీలేదు. సాయంత్రం అయ్యాక, 'ఇక చెట్టంతా ఖాళీ' అని నిశ్చయించుకొని, కోతిరాజు తన అనుచరులతో సహా వచ్చిన దారి పట్టింది.
ఆ హడావిడిలో ఒక్క కాయ తప్పిపోనే పోయింది: పక్షి గూడు వెనక దాగిన పెద్ద కాయ ఒకటి మిగిలిపోయింది. కొద్ది రోజులకు ఆ కాయ మరింత పెద్దదై, చక్కగా పండింది. బంగారు రంగులో మిలమిలా మెరిసే ఆ పండు ఒకనాడు చెట్టునుండి విడివడి, క్రింద ప్రవహించే వాగులో పడి, కొట్టుకొని పోయి, నదిని చేరుకున్నది. సరిగ్గా అదే సమయానికి ధర్మదత్తుడనే రాజు నదిలో స్నానానికి వచ్చాడు.
ఆయన అలాంటి పండుని ఏనాడూ చూసి ఉండలేదు. "ఏమిటిది?" అని తన మంత్రుల్ని అడిగాడాయన. వాళ్లలో ముసలి మంత్రి ఒకడు దాన్ని గుర్తు పట్టి, "దీన్ని మామిడి పండు అంటారు ప్రభూ! చాలా మధురంగా ఉంటుందిది" అని చెప్పాడు. రాజుగారు దాన్ని ముక్కలు చేయించి, అనుమానం కొద్దీ కొన్ని ముక్కల్ని మంత్రుల చేత తినిపించి చూసుకొని, వాళ్లకు ఏమీ కాలేదని నిర్ధారణ అయ్యాక, తనూ తిని చూశాడు. దాని రుచి అద్భుతంగా ఉంది-
ఎంత అద్భుతంగా ఉందంటే, రాజుగారికి అలాంటి పండ్లు ఇంకా ఇంకా తినాలనిపించింది.
మరుసటి రోజే ఆయన తన మంత్రుల్ని, సైనికుల్ని వెంటబెట్టుకొని వాగు వెంట పైకి నడచుకొని వచ్చాడు.
అక్కడ మామిడి చెట్టుని చూడగానే గుర్తుపట్టాడు మంత్రి. సైనికులు చెట్టు మీదికి ఎక్కి రెమ్మ రెమ్మనూ పరిశీలించారు. ఎక్కడా ఒక్క కసరు కాయ కూడా లేదు. "ఇక్కడ అడవిలో ఉన్న కోతులు ఈ పండ్లనుగాని, పండ్ల చెట్టును గానీ బ్రతకనివ్వవు" అని వాళ్ళు రాజుగారికి నివేదించారు.
రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అడవిలో ఉన్న కోతులన్నిటినీ పట్టుకొని చంపివేయమని తన సైనికులకు ఆదేశాలిచ్చాడాయన. సైనికులు మారణ హోమం మొదలు పెట్టారు. వాళ్ళకు నాయకుడుగా ధర్మదత్తుడు తన సైన్యాన్ని ముందుండి నడపసాగాడు.
సంగతి తెల్సుకున్న కోతిరాజు తన పరివారాన్నంతటినీ ఒక చోట చేర్చి "వినండి! అనుకున్నంతా అయ్యింది. నేను భయపడిన రోజు రానే వచ్చింది! ఇప్పుడు ఇక మనం ఈ అడవిలో ఉంటే ప్రాణాలు కోల్పోవటం మినహా చేయగలిగిందేమీ లేదు. మనం ఉంటున్న ఈ అడవికి అవతలగా ఎవరూ చేరరాని వెదురు వనం ఒకటి ఉన్నది. మనందరం అక్కడికి పారిపోదాం" అన్నది.
సరిగ్గా అదే సమయానికి రాజుపంపిన సైనికులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. వాళ్ళు వెంటబడి తరమరాగా వేలాది కోతులు- తల్లులు,పిల్లలు, గర్భిణులు, ముసలివి, రోగ గ్రస్తమైనవి- అన్నీ వేటికవి, ప్రాణభయంతో వెదురు వనం వైపుకు పరుగులు పెట్టాయి. కోతిరాజు వాటినన్నిటినీ సమీకరించుకుంటూ తనూ వెదురువనం వైపుకు పోయింది.
వెదురు వనాన్ని, మిగతా అడవిని వేరు చేస్తూ పెద్ద లోయ ఒకటి ఉన్నది. లోయకు ఇరువైపులా కొండ చరియలు ఉన్నాయి. ఆ రెండు కొండ చరియల మీదా బలమైన చెట్లున్నాయి. వాటి కొమ్మలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి ఉన్నాయి. బలమైన కోతులు ప్రయత్నించి, ఆ కొమ్మల్ని ఆధారంగా చేసుకొని లోయకు ఇటువైపు నుండి అటువైపుకు దూకవచ్చు. కానీ ఒకవేళ జారిలోయలో పడితే మటుకు ప్రాణాలు దక్కవు.
మొదట్లో బలంగా ఉన్న కొన్ని కోతులు ప్రాణాల మీద ఆశ కొద్దీ లోయను లంఘించేందుకు ప్రయత్నించాయి. వాటిలో కొన్ని అంతెత్తునుండి గింగిరాలు తిరుగుతూ లోయలో పడి ప్రాణాలు విడవటంతో, మిగిలిన కోతులను అధైర్యం ఆవరించుకున్నది. "మనం దూకలేం" అని నిస్సత్తువతో కూలబడ్డాయన్నీ. రాజుగారు, రాజుగారి సైనికులు వాటిని వెంటాడుతూ దగ్గరకు వచ్చేస్తున్నారు!
ఆ సమయంలో కోతిరాజు అక్కడికి చేరుకున్నది. మిగిలిన కోతులకంటే బలంగా, అతి పెద్ద శరీరం ఉన్న కోతిరాజు అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నది:
లోయకు ఇటు ప్రక్కన ఉన్న చెట్టు కొమ్మల్ని కాళ్ళతో గట్టిగా బిగించి పట్టుకొని, అటువైపున ఉన్న చెట్టుకొమ్మల్ని చేతులతో పట్టుకొని, రెండింటి నడుమా తన శరీరంతోటే ఒక వంతెనను తయారు చేసింది. "అందరూ నామీదుగా నడచుకొని పొండి! ప్రకృతి నన్ను ఇంత పెద్దగా సృష్టించటంలో రహస్యం ఇదే అయి ఉంటుంది" అన్నదది, నిబ్బరంగా.
మరు నిముషంలోనే వేలాది కోతులు దాని శరీరం మీదుగా నడుస్తూ, పరుగెత్తుతూ, దూకుతూ, పోటీలు పడి లోయకు అవతలి గట్టును చేరుకోసాగాయి. వాటన్నిటి బరువునూ మోస్తూ, నొప్పిని పళ్ళ బిగువున భరిస్తూ కూడా కోతిరాజు "ఆహా! నా కారణంగా ఇంతమందికి రక్షణ లభిస్తున్నది. అది చాలు" అనుకుంటూ వచ్చింది.
ఆ కోతుల్లో కొన్నిటికి కోతిరాజంటే కోపం ఉండేది. అట్లాంటి కోతుల్లో ఒకటి, సమయం చిక్కిందే తడవు, తన చేతిలోని ఇనుప కడ్డీని ఒకదాన్ని కోతిరాజు గుండెల్లో దిగబడేట్టు గుచ్చుతూ అవతలి ఒడ్డుకు దూకి పోయింది! ఆ సమయంలో కోతిరాజు పెట్టిన కేక అడవంతా ప్రతిధ్వనించింది. అంత విపత్తులోనూ అది తన ప్రజలంతా అవతలి గట్టును చేరేంతవరకూ తట్టుకొని, అటుపైన ఒక్కసారిగా కుప్పకూలింది!
కోతిరాజు చేసిన పనినంతా గమనిస్తూ వచ్చిన ధర్మదత్తుడు తన సైనికులను హెచ్చరించి, కోతిరాజు లోయలో పడిపోకుండా కాపాడాడు. తోటి కోతుల కోసం అంత త్యాగం చేసిన కోతిరాజుని చూస్తే ధర్మదత్తుడికి మనసు నిలవలేదు. అయితే దాని శరీరంలో గుచ్చుకున్న శూలం బారినుండి దాన్ని కాపాడటం కష్టమే. చనిపోయే ముందు స్పృహలోకి వచ్చిన కోతిరాజుతో ధర్మగుప్తుడు "ఎందుకిట్లా చేశావు? నువ్వు వాళ్ల రాజువి కదా" అంటూ కంట తడి పెట్టాడు.
ప్రాణాలు కోల్పోతున్న కోతిరాజు నవ్వింది. "నేను వాళ్ల రాజుని కదా, అందుకని!" అన్నది. అంతలోనే దాని ప్రాణాలు పోయాయి.
కోతిరాజు త్యాగం ధర్మదత్తుడి కళ్ళు తెరిపించింది. 'మంచిరాజు తన పౌరులను సొంత ప్రాణాలకంటే ఎక్కువగా ప్రేమించాలి' అని ఆయనకు అర్థమైంది.
"నేను ఇక మీద హింసను మానేస్తాను. మంచి రాజునౌతాను" అనుకున్నాడాయన.
అటుపైన ఆయన రాజ్యంలో మనుషులే కాక అన్ని ప్రాణులూ సుఖశాంతులతో జీవించాయి.