అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు నివిసించేవి. ఒక రోజున చక్కని ఓ నెమలి నల్లని కాకిని చూసి "మిత్రమా! నేనెంత అందగా ఉన్నానో చూశావా? అందరూ నన్ను ఇష్టపడతారు. కానీ నువ్వు? ఎట్లా ఉన్నావో చూడు! నల్లగా, దిష్టిబొమ్మలాగా?! అందుకనే నిన్ను ఎవరూ ఇష్టపడనిది!" అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ మాటలు విని కాకికి చాలా బాధ వేసింది. అది గూటికి వెళ్ళి, తన అందం గురించే ఆలోచిస్తూ దిగాలుగా కూర్చున్నది. అంతలోనే అటుగా వెళ్తున్న ఓ చిలుక దాన్ని చూసి ఆగింది. "ఏమి కాకి బావా! కులాసానా?" అని అడిగింది. ఏదో లోకంలోఉన్న కాకికి అసలు అదేమన్నదో కూడా వినిపించలేదు.
చిలుక అప్పుడు కాకి దగ్గరకు వెళ్ళి కూర్చొని "కాకి బావా! ఏమి, దిగాలుగా ఉన్నావు?" అని అడిగింది. కళ్ళ నీళ్ళు పెట్టుకొని జరిగిన విషయమంతా చెప్పింది కాకి. అంతా విని చిలుక "కాకి బావా! బాధపడకు. నిజానికి మనం చూసేందుకు ఎలా ఉంటే మాత్రం ఏమున్నది? ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది ముఖ్యం. రూపు ఏదైతేనేమి, మనసు ముఖ్యం కదా. నీకంటూ ఒక రోజు తప్పక వస్తుంది- బాధపడకు!" అని దాన్ని ఓదార్చి వెళ్ళిపోయింది.
అది అన్నట్లే ఒక రోజున కాకికి అవకాశం వచ్చింది. వేటగాడు ఒకడు చెట్ల మాటునుండి నెమలికి బాణం గురిపెట్టాడు. ఆ సమయానికి నెమలి వెనక్కి తిరిగి పురివిప్పుకొని నాట్యం చేయటంలో మునిగి ఉన్నది. వేటగాడిని చూడగానే కాకి నెమలిని హెచ్చరిస్తూ "మిత్రమా! పారిపో! వేటగాడు!" అని గట్టిగా అరవటం మొదలు పెట్టింది. గబుక్కున ఈ లోకంలోకి వచ్చిన నెమలి తోక ముడుచుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. వేటగాడు దాని వెంట పడ్డాడు. నెమలి చెట్ల కొమ్మల మీదుగా దూక్కుంటూ అతి కష్టం మీద వాడి బారినుండి తప్పించుకోగలిగింది.
తరువాత ఆ రోజు సాయంత్రం నెమలి కాకిని వెతుక్కుంటూ వచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవటమే కాకుండా తనను క్షమించమని అడిగింది. "ఎందుకు, ఏం తప్పు చేశావు?" అంది కాకి. నెమలి తనను ఎగతాళి చేసిన సంగతి అసలు గుర్తే లేదు దానికి!
"ఆ రోజు నువ్వు అందంగా లేవని చులకనగా మాట్లాడాను కదా, నీ మంచితనాన్ని గుర్తించలేదు. అయినా నువ్వు దాన్ని మనసులో పెట్టుకోకుండా ఇవాళ్ల నా ప్రాణాలను కాపాడావు. నన్ను క్షమించు. శరీరాల అందం కంటే మనసుల అందమే గొప్పదని నాకు అర్థమైంది. ఇకమీద నేను ఎవ్వరినీ కించపరచను" అన్నది నెమలి, కాకి చేతులు పట్టుకొని.
"ఓ, అదా?! ఆ రోజున నువ్వు అట్లా అనే సరికి చాలా బాధేసింది. కానీ అప్పుడు నేను ఏమీ అనలేక, నాలో నేనే ఏడ్చుకున్నాను. ఇకమీద ఎవ్వరిని గురించీ చులకనగా మాట్లాడనన్నావుగా! ఏమీ పర్లేదు. ఇప్పటి నుండి మనం అందరం ఫ్రెండ్స్" అంటూ సంతోషంగా చేతినందించింది కాకి. అదే సమయానికి అక్కడికి వచ్చిన చిలుక సంతోషంగా చప్పట్లు కొట్టింది. అటుపైన నెమలి, కాకి, చిలుక అడవిలో కలిసి మెలిసి సంతోషంగా జీవించాయి.