నగరాలకు దూరంగా ఉన్న ఓ పల్లెటూరు, మూఢ నమ్మకాలకు పుట్టునిల్లు- ఆ ఊర్లో 8వ తరగతి చదువుతోంది, స్వాతి. స్వాతి చాలా చురుకైనది. ఓసారి ఆ అమ్మాయి, తన స్నేహితురాలు రాణితో కలిసి వస్తుంటే దారిలో ఓ ఇంటి చుట్టూ గుమిగూడి గందరగోళంగా ఉన్న గుంపు ఒకటి కనబడింది.
"ఏమైందే అక్కడ, అంతమంది గుమిగూడారు?" అడిగింది స్వాతి.
"అది భార్గవక్క వాళ్ళ ఇల్లు. నిన్న సాయంత్రం భార్గవక్కకు దెయ్యం పట్టిందట గదా, ఇప్పుడు అందరూ చేరి దయ్యాన్ని పారిపోగొడుతున్నట్లున్నది. మనమూ పోయి చూద్దామా?" అంది రాణి.
"దెయ్యం పట్టిందా? అంటే ఏంటి? అసలు ఏమైందట?" అడిగింది స్వాతి, కంగారుగా.
"నిన్న ఏకాదశి ఉపవాసం కదా. భార్గవక్కకూడా ఉపవాసం ఉండి, మధ్యాహ్నంగా కొండ మీద ఉన్న దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళిందట. అక్కడ కొలనులో నీళ్ళు పట్టుకొని, దుర్గమ్మ తల్లి విగ్రహం దగ్గరికి తెచ్చి పెట్టిందట. ఆ తర్వాత విగ్రహానికి అభిషేకం చేయాలని లేచి నిలబడిందట- వెంటనే ఏమైందో, ఏమో- కళ్ళు తిరిగి పడి పోయిందట. సరిగ్గా ఆ సమయానికి అక్కడ చాలామంది ఉండబట్టి సరిపోయింది. వాళ్లంతా వెంటనే ఆమె పేరు మీద ఏవేవో పూజలు చేసారు. అక్కని అలాగే ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికొచ్చేసరికి అక్క కోలుకున్నది- అయితే ఆ తర్వాత కూడా అక్క సరిగాలేదట- నాలుగైదుసార్లు కళ్ళు తిరిగి పడిపోయిందట. ఇంట్లోవాళ్ళు కంగారు పడి దాసు దగ్గరికి పట్టుకెళ్ళారు. ఆయన కనుక్కున్నాడు, అక్కకి దయ్యం పట్టిందని. ఏదో చిన్న పూజ చేసి తాయెత్తు కట్టాడట; అయినా ఇల్లు చేరుకోగానే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయిందట అక్క. అందుకే, మళ్ళీ దాసు వచ్చినట్లున్నాడు ఇప్పుడు " అంది రాణి.
స్వాతి, రాణి ఇద్దరూ అక్కడికి వెళ్లి దూరంగా నిలబడి చూశారు: "నన్ను వదలండి, కొట్టకండి" అంటూ భూమి దద్దరిల్లేలా ఏడుస్తూ ఉంది భార్గవక్క. "నిన్ను వదిలితే మమ్మల్ని పట్టుకోవడానికా!" అంటూ మరింత గట్టిగా కొడుతున్నాడు దాసు. రక్తంతో తన శరీరం తడిసి పోతున్నది. చుట్టూ నిల్చున్నవాళ్ళు ఎవ్వరూ అక్కని చూసి జాలి కూడా పడటం లేదు. భార్గవక్క రక్తపు మడుగులోంచి "రక్తం కారుతోంది, ఊపిరి ఆడటం లేదు" అంటూ అరిస్తే "నువ్వు మా రక్తం తాగడానికే వచ్చావే" అంటూ జుట్టు పట్టుకొని కొడుతున్నాడాయన.
స్వాతికి ఏడుపొక్కటే తక్కువ. అక్క పరిస్థితి చూసి చాలా భయం వేసింది. గబుక్కున అక్కడికి దగ్గరలోనే ఉన్న తమ చిన్నత్త వాళ్ళింటికి పరుగు పెట్టింది. చిన్న త్త బాగా చదువుకున్నదీ, మంచిది కూడా. 'ఆమె అయితే భార్గవక్కను కాపాడగలదు' అనిపించింది స్వాతికి. చిన్నత్త వెంటనే బయలుదేరి వచ్చింది. స్వాతి, చిన్నత్త ఇద్దరూ కలిసి వెళ్ళేసరికి అక్కడ చేరిన జనాలంతా కలిసి కొడుతున్నారు భార్గవక్కను.
స్వాతి, చిన్నత్త ఇద్దరూ ధైర్యంగా జనాలకు అడ్డుపడి, చివరికి ఎలాగో ఒకలాగా భార్గవక్కను వాళ్ల బారినుండి కాపాడి, లోపలి గదిలోకి తీసుకెళ్ళారు. "అమ్మా, భార్గవి బాగా నీరసించి పోయింది. డాక్టరు గారి దగ్గరకు తీసుకెళ్ళండి. ఇలా రక్తం వచ్చేటట్లు కొట్టడం సరి కాదు. ఆమెను హింసించకండి, దయచేసి నా మాట వినండమ్మా" అని గట్టిగా చెప్పింది చిన్నత్త, వాళ్ళ ఇంట్లోవాళ్ళకు. దానికి అక్కడున్న వాళ్ళంతా "దీనికి డాక్టరుతో ఏం పని? దాసు దగ్గరికి తీసుకెళ్ళి వదిలెయ్యాలి- రెండు రోజుల్లో దయ్యం గియ్యం పారిపోతుంది, మీ బిడ్డ మీకు దక్కుతుంది" అన్నారు.
స్వాతి, చిన్నత్త ఇద్దరే అయ్యేసరికి, భార్గవక్కను అప్పటికి తప్పించగల్గినా, ఇంటి వాళ్ళని మటుకు డాక్టరు విషయకంగా ఒప్పించలేక పోయారు.
అక్కడున్న వాళ్ళు ప్రవర్తించే తీరును చూసి స్వాతికి చాలా ఆశ్చర్యమూ, బాధా కలిగాయి. చిన్నత్త ఎంత చెప్పినా వాళ్ళు వినటమే లేదు. చివరికి వాళ్ళు చిన్నత్తను, స్వాతిని అక్కడినుండి పంపించేశారు కూడా!
ఇంటికి చేరుకోగానే స్వాతి వాళ్ళ నాన్నను ఆశ్రయించింది. స్వాతి వాళ్ళ నాన్న మానవత్వం ఉన్న మనిషి. ఆయనకు స్వాతి అంటే చాలా ఇష్టం కూడా- స్వాతి ఏమడిగినా ఇస్తారాయన. స్వాతి వాళ్ళ నాన్నతో "నాన్నా, ఒకమ్మాయికి దెయ్యం పట్టిందని కొడుతున్నారు" అంటూ జరిగిన విషయం చెప్పింది. "మీ స్నేహితుడున్నాడు కద నాన్నా, డాక్టరంకుల్? ఆయన్ని మనమే అక్కడికి తీసుకెళ్దాం నాన్నా! కావాలంటే, ఆ డాక్టర్ అంకుల్ కి కావలసిన డబ్బులు నా పుట్టిన రోజు కోసం దాచిన డబ్బుల నుండి ఇస్తాను" అని ప్రేమగా అడిగింది స్వాతి.
స్వాతి వాళ్ళ నాన్న ఇక ఆగలేదు. డాక్టర్ అంకుల్‌ని, ఆయనతోబాటు ఇన్స్పెక్టరుగారిని ఇద్దరినీ వెంటనే రమ్మని పిలిచారు. స్వాతి, వాళ్ళ నాన్న, చిన్నత్త, డాక్టరంకుల్, ఇన్స్పెక్టరుగారు- అందరూ కలిసి వచ్చాక, ఇక ఊరి జనాలు ఎవ్వరూ నోరెత్తలేకపోయారు. డాక్టరంకుల్ భార్గవిని చెకప్ చేసారు. తరువాత తెలిసింది అసలు నిజం- "ఈ పాప రక్త హీనతకు నిలువెత్తు నమూనా. ఉపవాసాలు ఎక్కువగా చేయడం వల్ల, ఒంట్లో శక్తి తక్కువై కళ్ళు తిరిగాయి. అంతే తప్ప ఏ దెయ్యమూ లేదు; గియ్యమూ లేదు. అసలే బలహీనంగా ఉన్న పాపను పట్టుకొని రక్తం వచ్చేటట్లు కొట్టారు: మనిషి అని మరచి పోయారు. అందులోనూ ఒక ఆడపిల్లని! ముందు ఆ అమ్మాయికి ఏమైనా పండ్ల రసం ఇవ్వండి! త్వరగా అన్నం పెట్టండి! రెండు రోజుల్లోబాగు కాకపోతే నన్నడగండి! ఏంటమ్మా, ఈ రోజుల్లోకూడా ఇంత మూర్ఖత్వమా?" అని తిట్టి, రక్తహీనత తగ్గేందుకు టానిక్ ఇచ్చారు డాక్టరంకుల్. దెబ్బలు తగ్గడానికి కొన్ని మాత్రలు, ఆయింటుమెంటు ఇచ్చారు.
భార్గవక్క ఆహారం తీసుకొని, ఆ టానిక్ వేసుకుంది. అప్పటి నుంచి ఉపవాసాలు మాని, చెప్పిన మందులు సరిగా వాడింది. మూడు రోజులకే ఆరోగ్యంగా తయారయ్యింది.
డాక్టరు గారు స్వాతిని మెచ్చుకున్నారు. డాక్టరు ఫీజుగా తను దాచుకున్న డబ్బుల్ని ఇస్తే ఆయన తీసుకోలేదు. "చూడుపాపా, మీ ఊళ్ళోనే కాదు; ఇంకా చాలా ఊళ్ళలో ఇదే పరిస్థితి ఉన్నది. అసలు వాస్తవాలను అందరికీ చెప్పాల్సిన పని,చాలా పెద్దది ఉంది- నువ్వు నాకు ఇవ్వాల్సింది ఫీజు డబ్బులు కాదు- సమయం! నువ్వు మాతోపాటు వస్తానంటే, మనం ఇలాంటి పిచ్చి నమ్మకాలను నిర్మూలించేందుకుగాను యాత్ర ఒకటి పెట్టుకుందాం. మనతోబాటు ఇద్దరు మెజీషియన్లు కూడా వస్తామన్నారు. ఏమంటావు?" అన్నారు డాక్టరంకుల్.
స్వాతి వాళ్ల నాన్నవైపు చూసింది. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు.
స్వాతి వాళ్ళ ఊరిలోనే కాదు, ఆ చుట్టు ప్రక్కల గ్రామాలన్నిటా ఒక కొత్త చైతన్యం మేల్కొంది: "దేవుడి పేరిట, దెయ్యాల పేరిట జరిగే హింస వల్ల లాభం లేదు సరికదా - విలువైన మనిషి జీవితాన్ని యాతన పెడుతున్నాం! మనిషి లాగా పుడితే సరిపోదు. మనిషిగా ఎదగాలి. ప్రతి దానికీ ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది. కార్య-కారణాలను వదిలిపెడితే మనిషి జంతువుకన్నా హీనమైపోతాడు. మూఢనమ్మకాలను వదిలిపెడదాం! మానవత్వాన్ని స్వాగతిద్దాం" అని అందరికీ అనిపించసాగింది.