అనగా అనగా ఒక ఊళ్లో రాము అనే బ్యాంకు ఉద్యోగి ఉండేవాడు. నెల జీతం రాగానే అతనొక జత బట్టలు కొనుక్కోవాలనుకున్నాడు. బట్టల దుకాణంలో సేల్స్ మ్యాన్ రకరకాల బట్టలు తీసి తన ముందు వేశాడు- వద్దంటున్నా వినలేదు. వాటిలోఒక్క జతని ఎంపిక చేసుకొనేందుకు చాలా సేపు పట్టింది రాముకు. చివరికి ఎలాగో పని అయ్యిందనిపించి, అలాగే నేరుగా టైలర్ దగ్గరికి వెళ్ళి, కొత్త బట్టలు ఇచ్చాడు కుట్టేందుకు. ఆపైన అటు నుంచి అటు పార్కుకి వెళ్ళి, భోజన సమయానికి ఇంటికి వచ్చాడు. అన్నం తింటున్న సమయంలో గమనించాడు- తనవేలికి ఉండాల్సిన బంగారు ఉంగరం..లేదు!
రాము గుండె గుభేలుమన్నది. ఆ ఉంగరం ఖరీదు పది వేల రూపాయిల పైమాటే. ఖరీదు సంగతి ఎలాగున్నా, అది తన భార్యవైపు వాళ్ళు ముచ్చటగా పెట్టిన ఉంగరం. పోయిందని తెలిస్తే భార్య ఊరుకోదు. అట్లా అని తను మళ్ళీ ఇంకొకటి కొని పెట్టుకోనూ లేడు! ఇంక అతనికి అన్నం సహించలేదు. ఇల్లు అంతా వెతికాడు. ఉంగరం కనిపించలేదు. 'అది ఎక్కడో జారి పడిపోయి ఉండాలి- తను ఈరోజు ఎక్కడెక్కడో తిరిగాడు- ఒకచోటు అని తెలిస్తే అక్కడికి వెళ్ళి అడగొచ్చు..ఎక్కడ పడిపోయి ఉంటుంది? పార్కులో..? టైలర్ షాపులో..? బట్టల దుకాణంలో..? బ్యాంకులోనే పడి ఉందేమో; ఉదయం ఊడ్చేటప్పుడు దొరుకుతుందేమో..తను రేపు త్వరగా వెళ్ళాలి- ఊడ్చే వాళ్ళకంటే ముందు బ్యాంకు చేరుకోవాలి..' ఆలోచనలతో రాము బుర్ర వేడెక్కిపోయింది.
'ఏంటండీ, ఏమైంది, ఏం వెతుకుతున్నారు?' అడిగేసింది భార్య.
'అయిపోయింది. ఇక ఏడుపు మొదలవుతుంది..ఇంతకీ ఉంగరం ఎక్కడ పడిపోయి ఉంటుంది? పార్కులో..? టైలర్ షాపులో..?...' భార్యకి తను ఏం చెప్పాడో రాముకే తెలీదు.
రాము భార్య రాత్రి అంతా ఏడ్చింది. ఆమెకు రాత్రంతా నిద్రే లేదు. రాముకి మాత్రం తెల్లవారుజామున మగత నిద్ర పట్టింది.. ఇంకా తెల్లవారకనే రాము పార్కుకు వెళ్ళాడు. అక్కడ తను తిరిగిన చోట్లలో అంతటా వెతికాడు. ఉంగరం లాంటిదేమీ కనిపించలేదు. అటునుండి అటే బ్యాంకుకు వెళ్ళాడు. బ్యాంకులో తన సీటు దగ్గర వెతికాడు. ఉంగరం లేదు. అక్కడ ఊడ్చే వాళ్లకు చెప్పాడు తన ఉంగరం గురించి. 'కొంచెం జాగ్రత్తగా ఊడ్చండి' అన్నాడు. అంతలో తన కోసం ఎవరో వచ్చి నిల్చున్నారని కబురు వచ్చింది. చూస్తే అతను బట్టల దుకాణంలో సేల్స్ మ్యాన్. 'అయ్యా ! బట్టల మధ్య మీ ఉంగరంకనిపించింది. దాని మీద వీణ బొమ్మ మధ్యలో మీ పేరు ఉంది. మిమ్మల్ని బ్యాంకులో చాలా సార్లు చూసాను కదా, దాంతో గుర్తు పట్టాను. మీ ఉంగరం ఇదిగోండి సార్ ..' ఉంగరాన్ని అందించాడతను.
రాముకి సంతోషమూ, ఆశ్చర్యమూ కలగలిపి వచ్చినట్లయింది- 'ఈ ఉంగరం మీరే ఉంచుకొని ఉంటే నాకు తెలిసేది కాదు గదా' గొణిగాడు.
'పరాయి సొమ్ము పాము లాంటిది సార్! మనిషి జన్మ ఉత్తమమైనది. పరాయిసొమ్ము ఆశించేవాడు మనిషిగాపనికిరాడు. నిజాయితీ..' ఏదో నాలుగు లైన్ల మంచి మాటలు చెప్పాడతను.
'ఏంటో ఈ పిచ్చి నమ్మకాలు. వీటి వల్లనే గదా, వీడికి పదివేలు నష్టం?- లేకపోతే ఉంగరం పూర్తిగా వాడిదే అయిఉండేది కదా! అయితేనేమిలే, వీడి పిచ్చినమ్మకం వల్ల నా ఉంగరం నాకు దొరికింది- అంతేచాలు!' అనిపించింది రాముకు. సేల్స్ మ్యానుకు 'థాంక్స్' చెప్పి పంపించేసి, వెంటనే ఇంటికి ఫోను చేసి అరిచాడు- 'ఉంగరం దొరికింది! ఉంగరం దొరికింది!' అని.
'ఏమైనా కల వచ్చిందా, పరుపులోనే ఉండి అరుస్తున్నారు?' అడిగింది భార్య.
లేచి చూస్తే అప్పటికి ఇంకా తెల్లవారనే లేదు..నిజంగానే ఏదో కల వచ్చినట్లుంది. రాముకి ఏడుపు వచ్చినంత పనైంది. ఇంకా ఉంగరం దొరకనే లేదు!
తెల్లవారకనే రాము బయలుదేరి ఈసారి నిజంగానే పార్కులో అంతా వెతికాడు . పార్కునుండి వస్తూ టైలరు దుకాణంలో అడిగాడు. బ్యాంకులో ఊడ్చేవాళ్ళను అడిగి వచ్చాడు. ఎందుకైనా మంచిదని బట్టల దుకాణంలో సేల్సుమ్యానును అడిగి వచ్చాడు- ఎండకి ముఖమంతా చెమటలు పట్టాయి తప్పిస్తే, ఉంగరం ఎక్కడా లేదు. చివరికి చెమట తుడుచుకునేందుకు జేబులోంచి రుమాలును బయటికి లాగాడు- దానితోపాటు బయటికి వచ్చి టింగుమని కాళ్లదగ్గర పడింది, ఉంగరం!
అంటే అసలు ఉంగరం నిన్నటినుండీ తన జేబులోనే ఉందన్నమాట!
బట్టల దుకాణం మీదుగా ఇంటికి వెళ్తున్న రాముకు కలలో సేల్సుమ్యాన్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి.." పరాయి సొమ్ము పాము లాంటిది. మనిషి జన్మ ఉత్తమమైనది..నిజాయితీ.." అని.
"అవును- మనుషుల్లో నిజంగా ఆ మాత్రం నీతి నియమాలు లేకపోతే బ్రతకటం కష్టమే!" అనిపించిందతనికి ఈసారి.