రామాపురంలో ఉండే అజయ్‌కి చదరంగం ఆట అంటే‌ చాలా‌ఇష్టం. వాడు చదరంగం చాలా బాగా ఆడేవాడు కూడా. అజయ్ తమ్ముడు అనిల్‌కి కూడా చదరంగం ఆడటం అంటే‌ ఇష్టం. అయితే వాడికి ఆ ఆట ఏమంత బాగా వచ్చేది కాదు. స్నేహితులతో చదరంగం ఆడినప్పుడల్లా అజయే గెలిచేవాడు. దాంతో వాళ్ళ స్నేహితులకు అజయ్‌తో చదరంగం ఆడటం అంటే ఇష్టం లేకుండా పోయింది. వాళ్ళు వాడిని తప్పించుకొని తిరగటం మొదలు పెట్టారు.
ఇక అజయ్‌కి ఇష్టంగా దొరికింది అనిల్ ఒక్కడే.

అజయ్ ఎప్పుడు 'ఛెస్ ఆడదామా?' అనగానే "ఓ, రా, రా - ఆడదాం!' అని ఆడి, సంతోషంగా ఓడిపోయేవాడు అనిల్. ఎన్నిసార్లు ఆడితే అన్నిసార్లు ఓడేవాడు; అయినా వాడికి చీమకుట్టినట్లు కూడా ఉండేది కాదు.
ఒక సారి రామాపురంలో చదరంగం పోటీలు పెట్టారు. వాటిలో అజయ్, అనిల్‌తో‌ పాటు ఇంకా చాలా మంది పిల్లలు పాల్గొన్నారు. తెలిసినవాళ్ళు అందరూ ఆ పోటీల్లో అజయ్ గెలుస్తాడని ఊహించారు. కానీ ఆ పోటీలలో చివరికంటా నిలిచి గెలిచింది, అనిల్! అందరూ నిర్ఘాంతపోయారు.
పోటీలు ముగిసాక అజయ్ అనిల్‌ని అడిగాడు: "నీకు అదృష్టం కలిసి వచ్చినట్లుందిరా, తమ్ముడూ! లేకపోతే ప్రతిసారీ నాతో ఓడే నువ్వు, ఈ పోటీలలో ఎట్లా గెలవగలిగావు?" అని.
"నేను నీతో చాలా సార్లు చదరంగం ఆడాను కదా, ప్రతి సారీ ఓడాను. అట్లా ఓడినప్పుడల్లా నేను ఓ క్రొత్త విషయాన్ని తెలుసుకున్నాను. నా ఓటమికి కారణాలు అర్థం చేసుకుంటూ వచ్చాను. ఇప్పటి విజయానికి కారణం అదే!" అన్నాడు అనిల్ .