ఒక ఊళ్లో 'అమిత' అనే పిల్లి ఒకటి ఉండేది . పేరుకు తగ్గట్టు, దానికి చాలా ఆశలు ఉండేవి . అందరి ఇండ్లలోనూ దూరి, అది దొంగతనంగా పాలు-పెరుగు తాగేసేది. అప్పుడప్పుడూ తనకు కనిపించిన ఎలుకలను కూడా పట్టుకునేది .
ఒక సారి 'అమిత'అట్లా తిరుగుతూ, తిరుగుతూ అనుకోకుండా ఊరు దాటి అడవిలోకి వెళ్ళింది. ఎప్పుడూ అడవిని చూడలేదు కదా, అందుకని దానికి ఆ అడవి చాలా నచ్చింది . అటూ , ఇటూ పరిగెత్తుతూ అడవి అంతా కలయ తిరిగింది. అంతలో అక్కడే ఒక చెట్టు కింద పడుకొని ఉన్న పులినొకదాన్ని చూసింది .
పులిని చూసి అమిత అనుకుంది- "ఇది నాలానే ఉంది కదా- కాకపోతే ఇంకొంచెం లావుగా, పొడుగ్గా ఉంది. అయినా ఈ అడవిలో ఆహారం పుష్కలంగా దొరుకుతోంది ; కాబట్టి ఇక్కడ ఉంటే నేనైనా అలాగే తయారయ్యేదాన్ని, దానిదేముంది?!" అని.
అడవిలో తిరిగే చిన్న చిన్న జంతువులు పులిని చూసి భయంతో పక్కకి వెళ్లడాన్ని గమనించింది అమిత. అదే వాటికి తను ఎదురుపడితే మటుకు, పట్టించుకోకుండా వెళ్ళిపోయాయి .
అప్పుడు అమిత అనుకుంది "నాలాగే ఉన్న పులికి అడవిలో ఎంత గౌరవం,మర్యాద లభిస్తున్నాయో చూడు! నాకు కాకపోతే పోనీ- కనీసం నా పిల్లలకైనా అంతటి మర్యాదలు జరగాలి" అని.
అట్లా అనుకుని అది గబగబా ఇంటికి వచ్చి, తన చిన్న పిల్లి కూనను తీసుకెళ్ళి, మెల్లగా పులి పిల్లల దగ్గర వదిలి వచ్చింది .
పిల్లి కూనను కూడా తన పిల్లే అనుకుని, పాలు ఇచ్చి జాగ్రత్తగా చూసుకొంది పులి . ఆ పిల్లి కూన కూడా మిగతా పులి పిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా ఉంది .
అమిత రోజూ అడవికి వచ్చి దూరం నుండి గమనించేది: తన పిల్ల ఇప్పుడు పులిపిల్లలతో సమానంగా పెరుగుతున్నది. 'అది కూడా పెరిగి పెద్దయ్యాక పులి లాగా ఉంటుంది. తన లాగా భయపడుతూ బ్రతికే అవసరం దానికి లేదు!' అని సంతోషించేది .

ఒక రోజు పులి పిల్లలన్నీ సరదాగా ఆడుకోవడానికి వెళ్ళాయి . వాటితో బాటే పిల్లి పిల్ల కూడా‌వెళ్ళింది. అమిత కూడా వచ్చి దూరంగా నక్కి కూర్చొని, పులి పిల్లలతో ఆడుకుంటున్న తన పిల్లని చూసి మురిసిపోతున్నది. అంతలో అకస్మాత్తుగా అక్కడికి కొన్ని సింహం పిల్లలు వచ్చాయి . వాటిని చూడగానే పిల్లి పిల్లకు చాలా భయం వేసింది. పరుగెత్తి పారిపోబోయిందది. అయితే దానితో పాటు ఉన్న పులి పిల్లలు మటుకు "ఏయ్! ఇవి సింహం పిల్లలు! మన బంధువులే , భయమెందుకు ?" అని దాన్ని వెళ్లనీయలేదు .
అంతలోనే సింహం పిల్లల్లో ఒకటి పిల్లిపిల్లని గుర్తుపట్టి, ఎగిరి వచ్చి దానిమీదకు పంజా విసిరింది . ఆ ఒక్క దెబ్బకే పిల్లిపిల్ల కాస్తా చనిపోయింది. 'ఇదేంటి?' అని నిర్ఘాంతపోయిన పులి పిల్లలు కూడా ఆ వెంటనే 'తమతో ఉన్నది పిల్లి' అని తెలుసుకొని ఊరుకున్నాయి. ఎవరో మోసం చేసి పిల్లిని తెచ్చి తమ దగ్గర వదిలి వెళ్ళారని, వాళ్ళ దురాశకు తగిన ప్రతి ఫలం దొరికిందని అనుకున్నాయి.
ఇదంతా గమనిస్తున్న అమితకు అంతులేని దు:ఖం కలిగింది. 'తన పిల్లను పిల్లి లాగానే బ్రతకనిచ్చి ఉంటే ఆనందంగా ఉండేది కదా, తన దురాశకు మూల్యం అది చెల్లించాల్సి వచ్చింది, అనవసరంగా చనిపోయిందే!' అని బాధపడింది . తల్లి తండ్రులు తమ ఇష్టాలను, ఆశలను బలవంతంగా పిల్లలపై రుద్దకూడదని ఆలస్యంగా గ్రహించిందది.