అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకి ధనవంతుడొకడు చిన్న ఏనుగు పిల్లని బహుమానంగా ఇచ్చాడు. అవ్వ పేదరాలు. అంత ఏనుగుకు సరిపడే ఆహారాన్ని సమకూర్చటం అవ్వ శక్తికి మించిన పని. అయినా అవ్వకు ఆ ఏనుగు పిల్లని చూస్తే ముచ్చటైంది. దాన్ని తన కొడుకుగా భావించి, ఎంతో కష్టపడి దాన్ని పెంచి పెద్ద చేసింది. ఏనుగు కూడా అవ్వకు తగినట్లే చాలా బాధ్యతతో ఎదిగింది. చుట్టుప్రక్కల ఉన్న పిల్లలందరికీ అదంటే చాలా ఇష్టం. అదికూడా వాళ్లందరితోటీ ఆడుకుంటూ సంతోషంగా ఉండేది.
ఒకసారి అవ్వ అడవిలోంచి బరువైన కట్టెల మోపు ఒకదాన్ని ఎత్తుకొని ఇంటికి రావటం గమనించింది ఏనుగు. ఆ సమయంలో అది పొరుగింటి పిల్లలతో ఆడుకుంటున్నది. అంత బరువును మోస్తున్న అవ్వని చూస్తే దాని గుండె కలుక్కుమన్నది. తనని పెంచుతున్న అవ్వకి కృతజ్ఞతగా తనూ ఏదో ఒక పని చేయాలనిపించింది దానికి.
తనకు కూడా అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురావటం వచ్చు కదా, అని అది అడవికి బయలుదేరింది.
అడవిలో అంతటా పచ్చని చెట్లే కనిపించాయి. ఎండిన మ్రానులైతే ఎక్కడా లేవు- 'మరి ఇంకేం చేయాలి?' అని ఆలోచనలో పడింది ఏనుగు. అంతలో దానికి కంగారుతో కూడిన అరుపులు వినిపించాయి. ఆ అరుపులు వస్తున్న దిశగా పరుగుతీసిందది.
అక్కడ, నది ఒడ్డున ఒక వ్యాపారి నిలబడి ఏడుస్తున్నాడు- 'నా సామాన్లు అన్నీ నీటి పాలయ్యాయి. నాకేమో ఈత రాదు. ఎవరైనా నా సామాన్లు తీసి పెట్టండి. మీ రుణం ఉంచుకోను' అంటున్నాడు. అయితే అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ వేగంగా పారే నదిలోకి దిగేందుకు సాహసించటం లేదు.
ఏనుగుకు అతన్ని చూస్తే జాలి వేసింది. అది గబుక్కున నీటిలోకి దూకి, ఒక్కటొక్కటిగా అతని సామాన్లన్నిటినీ నదిలోంచి బయటికి తీసి పెట్టింది. వ్యాపారితో పాటు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుండిపోయారు, ఆ వింతను.
ఏనుగు ఒకటి వచ్చి సామాన్లు తీసి పెడుతున్నదనే సరికి వ్యాపారి ఏడుపు ఆగిపోయింది. దానికి తోడు అక్కడ ఉన్నవాళ్లంతా 'ఏనుగుకు ఏదో ఒకటి ఇవ్వు. పాపం అది అంత శ్రమపడింది నీకోసం' అనే సరికి, వ్యాపారి తన సామాన్లు ఎన్ని ఉన్నాయో అన్ని బంగారు నాణాలను లెక్కపెట్టి ఓ సంచిలో వేసి, ఏనుగు మెడకు కట్టి, దాన్ని సత్కరించి పంపాడు.
ఆ సరికి చీకటి పడుతున్నది. ఏనుగుపిల్ల ఇంకా ఇంటికి రాలేదమని కంగారు పడిన అవ్వ, దాన్ని వెతకటం కోసం అప్పుడప్పుడే పిల్లల్ని పంపబోతున్నది- అంతలోనే ఏనుగు పిల్ల ప్రత్యక్షం అయ్యింది- మెడలో బంగారు నాణాల మూటతో.
ఆ మూటలో అవ్వకొక ఉత్తరం కూడా దొరికింది: 'ఏనుగు గారి యజమానికి- అయ్యా, మీరెవరో నాకు తెలీదు; కానీ మీ ఏనుగు వల్ల నాకు ఈరోజు లక్షలాది రూపాయల నష్టం తప్పింది. అందుకుగాను నేనిచ్చే ఈ చిన్న బహుమతిని స్వీకరించండి. ఇదికాక నానుండి వేరే ఎలాంటి సహాయం కావాలన్నా నేను మీకు చేసిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని మరువకండి. నన్ను తప్పక సంప్రతించండి" అని.
అన్ని బంగారు నాణాలను అవ్వ ఏనాడూ చూసి ఎరుగదు! ఆ సొమ్ముతో అవ్వ కష్టాలు పూర్తిగా తీరాయి.
అటుపైన ఏనుగు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ, కష్టాల్లో ఉన్నవాళ్ళకు అందరికీ సాయం చేస్తూ గడిపింది. అంత చక్కని ఏనుగును సాకినందుకు అవ్వ ఎంతగానో గర్వపడింది.