డబ్బున్నవాళ్ళకు గౌరవం దక్కటం అనేది సంఘంలో ఇప్పటి అలవాటే కాదు- ఎప్పటి నుండో వస్తున్న రివాజు కూడాను. ధనికులకు సంఘంలో గౌరవం, పలుకుబడి ఏనాడూ అధికంగానే ఉన్నాయి. దాంతో ప్రతి మనిషీ డబ్బును సంపాదించేందుకు, దాన్ని నిల్వ చేసేందుకు తాపత్రయ పడుతూ వస్తున్నాడు- అలా డబ్బుకున్న విలువను పెంచుతున్నాడు కూడా!
ఈ రోజుల్లోనైతే డబ్బును వెల్లడి చేసుకునేందుకు అనేక మార్గాలున్నాయి. అయితే పాత కాలంలో ఇలా అనేక మార్గాలు ఉండేవి కావు. ధనాన్ని నిల్వ చేసి బాగా ధనవంతులైనవాళ్ళు 'మా దగ్గర ఇంత డబ్బు ఉంది తెలుసా?' అని గర్వంగా ప్రకటించుకోవటానికి పూర్వకాలంలో ఒక ఆచారం ఉండేది.
ఆ రోజుల్లో బంగారు నాణాలను టంకాలు అని పిలిచేవాళ్ళు. ఎవరైనా కోటి టంకాల ధనవంతులైతే, ఆ సంగతిని చాటి చెప్పుకునేందుకు గాను ఒక శివలింగానికి నాగాభరణం చేయించి, వేడుకగా పూజించి, ఊళ్ళో వాళ్లందరినీ పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు. అట్లా ఎన్ని కోట్ల టంకాలను సంపాదిస్తే అన్ని శివలింగాలు- అన్ని నాగాభరణాలు! దాన్ని బట్టి ఆ వ్యక్తి దగ్గర ఎన్ని కోట్ల ధనం ఉందో అందరికీ తెలిసేది; ప్రజల్లోను, అధికారుల్లోను, జమీందారీలోను, రాజుల దగ్గరా ఆ వ్యక్తికి అంత గౌరవం లభించేది.
పడగ ఎత్తి నిల్చున్న నాగాభరణాన్ని శివలింగానికి అమర్చి పూజించటం, ఆ శివలింగాన్ని తాము సంపాదించిన కోటి టంకాలపైన స్థాపించటం- దీంతో 'కోటికి పడగ' అనే సామెత మొదలైంది. ఎవరైనా చాలా ధనం సంపాదిస్తే- "వాళ్ళకేమిరా, కోటికి పడగ ఎత్తారు" అనసాగారు. ఇప్పుడు ఆ నాగాభరణాలూ లేవు, శివలింగాలూ లేవు- సామెత మాత్రం అలాగే ఉండిపోయింది!