అనగనగా ఒక అందమైన అడవి. దానిలో దట్టమైన చెట్లు. ఆ అడవి అనేక జంతువులకు, పక్షులకు ఆవాసం. ఆ అడవిలోనే ఒక కుందేలు కుటుంబం ఉండేది- అమ్మ, నాన్న, రెండు పిల్లలు.
ఒక రోజున పెద్ద కుందేళ్ళు రెండూ పిల్లలకు జాగ్రత్తలు చెప్పి ఆహారం వెతుక్కుంటూ‌ వెళ్ళాయి. చిట్టి కుందేళ్ళు రెండూ పొదల చుట్టూ పరుగులెత్తి ఆడుకొని, అలసి సొలసి నిద్రపోయాయి. అవి లేచే సరికి చీకటి పడింది- కానీ పెద్ద కుందేళ్ళు ఇంకా రాలేదు!
చిట్టి కుందేళ్ళకు చాలా భయం వేసింది. అమ్మానాన్నలు వెనక్కి తిరిగి రావటం ఏనాడూ ఇంత ఆలస్యం కాలేదు మరి. అందుకని అవి భయం భయంగానే తల్లిదండ్రులను వెతుకుతూ అడవిలోకి వెళ్ళాయి. అక్కడ వాటికి తెలిసిన జింక ఒకటి కనబడింది. దాన్ని చూడగానే వాటికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అవి రెండూ జింక దగ్గరికి వెళ్ళి "అవ్వా, మా అమ్మా నాన్నలు ఎక్కడైనా కనిపించారా, నీకు? తెల్లవారనగా వెళ్ళారు-ఇప్పటివరకూ రాలేదు. మాకు చాలా భయం వేస్తున్నది" అన్నాయి.
జింక వాటికేసి జాలిగా చూస్తూ "కనిపించారురా, ఇవాళ్ల మధ్యాహ్నం కొందరు వేటగాళ్ళు నా వెంట పడ్డారు. నేను తప్పించుకున్నాను. ఆ సమయంలో మీ అమ్మానాన్నలు కూడా కనిపించారు నాకు.. వేటగాళ్ల చేతిలో పడ్డారేమో ఏమైనా..ఆ సమయంలో అక్కడ ఓ రామచిలుక కూడా కనిపించింది- మీరు ఇదే దారిలో కొంచెం ముందుకెళ్తే ఆ రామచిలుక ఉండే చెట్టు వస్తుంది. దాన్ని అడగండి, వాళ్ల జాడ తెలుస్తుంది" అన్నది.
చిట్టి కుందేళ్ళు రెండూ రామ చిలుకను వెతుక్కుంటూ ఇంకా లోపలికి వెళ్ళాయి. అవి రామ చిలుక ఉండే చెట్టును చేరుకునేసరికి బాగా చీకటిపడింది. రామచిలుక అన్నది- "అవునమ్మా, నేను చూస్తుండగానే మీ అమ్మానాన్నలు ఇద్దరినీ వేటగాళ్ళు పట్టుకున్నారు. అయితే-ఏడవద్దు-పూర్తిగా వినండి నేను చెప్పేది- వాళ్ల చేతుల్లోంచి మీ నాన్న తెలివిగా తప్పించుకున్నాడు. నేను కలవగానే నాతో 'వేటగాళ్లబారినుండి నా భార్యను తప్పించటంకోసం వాళ్ల వెనకనే వెళ్తాను- ఆమెను వెంటబెట్టుకొని రేపు ఉదయాన్నే వెనక్కి వచ్చేస్తాను , మా పిల్లలు వస్తే జాగ్రత్తగాఉండమని చెప్పు!' అని చెప్పి, ముందుకెళ్ళాడు మీనాన్న. మీరు ఈ పూటకు ఇక్కడే ఉండండి- రేపు ఉదయాన్నే మనం ముగ్గురం వెళ్ళి వాళ్ళని కలుసుకోవచ్చు" అన్నది రామ చిలుక.
చిట్టికుందేళ్ళకు కొంచెం ప్రాణం లేచివచ్చినట్లయింది. ఆ సరికి బాగా అలిసిపోయి ఉన్నాయేమో, వాటికి పడుకోగానే నిద్రపట్టేసింది. ఇంకా తెల్లవారకనే రామచిలుక వాటిని నిద్రలేపింది. మూడూ కలిసి వాళ్ల అమ్మానాన్నల్ని వెతుక్కుంటూ‌ ముందుకు వెళ్ళాయి. కొంత దూరం వెళ్ళేసరికి కుందేళ్ళ నాన్న ఒక్కడే విచారంగా వెనక్కి తిరిగి వస్తూ కనబడ్డాడు వాళ్ళకు. "వచ్చారా, మీ అమ్మను వాళ్ళు ఎవరో వ్యాపారికి అమ్మేశారు. నేను ఆ వ్యాపారిని వెంబడించే వీలు లేకపోయింది. ఇప్పుడామె ఎక్కడున్నదో, ఏమో!" అన్నాడు విచారంగా.
కుందేలు పిల్లలు రెండూ చిలుకతో "నిన్న రాత్రి మాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నావు. ఇప్పుడు మరోసాయం చెయ్యి, మా అమ్మ ఎక్కడున్నదో వెతికి పెట్టు, దయచేసి" అని వేడుకున్నాయి. "అయ్యో, ఆ మాత్రం ప్రయత్నం చెయ్యలేనా? మీరు ఉండండి, పట్నం ఇక్కడికి దగ్గరేగా? నేను అక్కడ వెతికి వచ్చి చెబుతాను" అని ఎగురుకుంటూ‌ పోయింది రామ చిలుక.
అక్కడ, కుందేలును కొన్న వ్యాపారి తన కొడుకు రాజేష్‌కి దాన్ని బహుమతిగా ఇచ్చాడు. రాజేష్ చిన్నతనంలోనే వాళ్లమ్మ చనిపోయింది. అప్పటినుండీ వాళ్ళ నాన్నే రాజేష్‌ని ప్రేమగా పెంచుతూ వస్తున్నాడు. రాజేష్‌కి కూడా వాళ్ల నాన్నంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న కుందేలును తెచ్చి ఇచ్చాక, రాజేష్‌కి ఒక్క నిముషం కూడా కుందేలును విడిచిపెట్టి ఉండబుద్ధి కాలేదు. ఎప్పుడూ ఆ కుందేలుతోనే ఆడుకోవటం మొదలు పెట్టాడు. కుందేలుని తెచ్చి, తన గదిలో నేలమీద పడుకోబెట్టి, దానికి పళ్ల ముక్కలు పెట్టాడు. తినలేదు. మళ్ళీ "దీనికి ఏం ఇష్టం?!" అని ఆలోచించి, కొన్ని కరివేపాకులు, కొన్ని పోసల గరిక గడ్డి తెచ్చి దాని నోటికి అందించాడు. అయినా తినలేదది. కుందేలు చాలా దిగులుగా ఉంది. రాజేష్‌కి అర్థం అయ్యింది- ఇది బాధ పడుతున్నట్లుంది అని. "ఈ కుందేలు తన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చింది కదా, అందుకని విచారంగా ఉన్నట్లుంది" అనుకున్నాడు. అప్పుడే వాడికి వాళ్ళ నాన్న చెప్పిన కథ ఒకటి గుర్తుకొచ్చింది. 'సొంతవాళ్లని విడిచిపెడితే, నిజంగానే ఎంత బాధగా ఉంటుందో కదా' అనిపించింది.
"అవునా, నీకు మీ ఇంట్లోవాళ్ళు గుర్తుకొస్తున్నారా?" అని అడిగాడు కుందేలును.
కుందేలును వెతుక్కుంటూ వచ్చిన రామచిలుక ఆ సమయానికి రాజేష్ గది కిటికీలో వాలి అంతా గమనిస్తూ ఉన్నది. రాజేష్ అలా అడగ్గానే అది "అవును అవును" అన్నది ముద్దుగా.
రాజేష్ చటుక్కున తలెత్తి రామచిలుకను చూసి "వీళ్ళ ఇల్లెక్కడో తెలుసా, నీకు?" అన్నాడు.
"తెలుసు తెలుసు" అన్నది చిలుక.
"మరి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తావా?" అడిగాడు రాజేష్.
"అవును అవును" అంది చిలుక.
"నాన్నా, ఈ కుందేలు- పాపం బెంగ పడుతున్నది. దీన్ని తీసుకెళ్ళి వాళ్ల ఇంట్లో వదిలిపెడదాం నాన్నా" అరిచాడు రాజేష్, వాళ్ల నాన్నకి వినబడేట్లు.
"సరేలేరా, ఎప్పుడు వెళ్దాం?" అడిగాడు నాన్న. రాజేష్ దయ, జాలి ఉన్న మంచి పిల్లాడుగా ఎదగటం ఆయనకీ ఇష్టమే మరి!
కుందేలు సంతోషంగా నవ్వి, రాజేష్‌కి దగ్గరగా జరిగింది. రామచిలుక "ధన్యవాదాలు" అంది.
రామ చిలుక దారి చూపిస్తుంటే రాజేష్, వాళ్ల నాన్న ఇద్దరూ కుందేలును అడవిలోకి తీసుకెళ్ళి వదిలిపెట్టారు. వెంటనే అది చిట్టి కుందేళ్ళ దగ్గరికి పరుగెత్తింది. చిట్టి కుందేళ్ళు రెండూ సంతోషంగా దాని చుట్టూ గెంతాయి కొద్ది సేపు. అక్కడే నిలబడి చూస్తున్న రాజేష్, వాళ్ల నాన్న వాటిని చూసి ఎంతో ముచ్చటపడ్డారు.
పెద్ద కుందేలు గబుక్కున పోయి రెండు జామపళ్ళు వెతికి తీసుకొచ్చి, రామ చిలుకకు ఇచ్చింది- "ఒకటినీకు-ఒకటి రాజేష్‌కు " అని. ఆ కుందేలిచ్చిన జామపండు ఎంత రుచిగా ఉందో!