ఈ సారి కొత్తపల్లిలో అన్ని కథలూ బాగుండి చదివించాయి. కొన్ని కథలు సాదాగానే మొదలయినా చివర్లో మాత్రం మెరిసాయి. 'బురద' కథలో - దొంగతనం అంటకట్టడానికి ముందు తానే దొంగగా మారడం; బురద చల్లడానికి ముందు తన చేతులకు బురద అంటడం - దీన్నే మనసుకి అంటిన బురదగా చెప్పడం - చాలా బావుంది. అలానే 'చిలుక తెలివి' తెలిసిన కథే అనుకుంటూ చదివినా ముగింపు కొంచెం కొత్తగానే ఉంది. 'తోటమాలి తెలివి' లో అసలు మొక్కని కనిపెట్టే ఉపాయం అటుంచి చివర్లో తోటమాలి మొక్కకి నీళ్ళు పోయడం హృద్యంగా ఉంది. ఈ చివరి వాక్యం వల్ల కథకు ఎంతో నిండుదనం వచ్చింది. కలగా తేలిపోవడం అనే ముగింపు పాతదే అయినా మంచి విషయాలను చక్కగా చెప్పిన కథలు - 'మారిన వేటగాడు', 'పగటి కలలు'.
జంతువుల పట్ల ప్రేమను చూపించడం ఎంత ముఖ్యమో 'కుందేలును కాపాడిన రాజేష్' (బొమ్మకి వ్రాసిన) కథ తెలిపింది. అర్థం చేసుకోగలిగితే పావురాలు కూడా మత సామరస్యాన్ని బోధించగలవని వివరించింది 'పావురం చెప్పిన పాఠం' కథ. కథలో చివర్లో చెప్పిన నీతితో పాటు ప్రకృతిలో ఉన్న ఆహారపు చక్రంలో మనిషి స్థానాన్ని చెప్పకనే పరోక్షం గా చెప్పినట్లుంది 'పొంచి ఉన్న ప్రమాదం' కథ.
చిట్టి పొట్టి బొమ్మల కథ 'రాజు బడికి వెళ్ళాడు' బాగుంది. ప్రతినెలా ఇలాంటి చిట్టి బొమ్మల కథలు కనీసం ఒకటైనా ఉంటే బావుంటుంది. (ఈ సంచికలో రెండున్నాయి!) మనసునీ శరీరాన్నీ అదుపులో ఉంచడం యొక్క ప్రాముఖ్యాన్ని 'అనువైన విద్య' కథ చెప్తే, సైన్స్ సహాయంతో కొందరు మూఢనమ్మకాలను ఎలా ప్రోది చేస్తారో చక్కగా వివరించింది 'రక్తం త్రాగే దేవత' కథ. సౌందర్యం అశాశ్వతం అని ఎన్నోసార్లు ఎన్నో కథలలో చదివిన విషయాన్ని నూతనంగా చెప్పింది 'రాజ కుమారుని సౌందర్యం' కథ. 'నీతి చంద్రిక'లో కథనం సరళంగా, సూటిగా, హత్తుకునేలా ఉంది. అలాగే 'విధి వ్రాత' లోని కథనం కూడా.
ఈ సంచిక లోపలి బొమ్మలు అన్నీ బానే ఉన్నాయి. ముఖ్యంగా 'నీతి చంద్రిక'లో ముసలి కాకి గుడ్లగూబకి తన కథని విన్పిస్తూ - మిగతా కాకులన్నీ తనని బాధ పెట్టిన విషయాన్ని సూచిస్తూ వేసిన బొమ్మలో నేపధ్యంగా పెద్ద కాకిని వెయ్యడం చాలా మంచి ఆలోచన. కానీ 'మారిన వేటగాడు' లో సీతమ్మనూ, 'తోటమాలి తెలివి'లో కళాకారుణ్ణీ ఇంకొంచెం శ్రద్ధగా వేస్తే బాగుండేదనిపించింది. ముఖచిత్రం కొంచెం నిరాశ పరచిందనే చెప్పాలి. బహుశా ప్రతినెలా ముఖచిత్రంలో ఎంతో ఆశించి ఆత్రుతగా ఎదురు చూడడం వల్లనేమో !
చిట్టి గేయం - ఉగాదీ, చిట్టి బొమ్మా అలరించాయి. నవ్వూసులు (జోక్స్) దాదాపు అన్నీ కొత్తగానే ఉండి బాగా నవ్వించాయి. చిలిపి ప్రశ్నలు తమాషాగా ఉంటే, యువ కెరటాలు స్ఫూర్తి దాయకంగా ఉంది. 'చిన్న చిన్న పిల్లలం' గేయంలో వేసిన ఛాయా చిత్రాలు స్ఫుటంగా, హృద్యంగా ఉన్నాయి. ఇంత మంచి కాగితం మీద ఇంత చక్కటి ప్రమాణాలతో ముద్రిస్తున్న 'ముద్రిక' వారికీ, కొత్త పల్లి జట్టుకీ అభినందనలు.
ఇవి గమనించారా, పెద్దలూ-కొంచెంకొంచెంగా పెద్దవుతూ తెలుగు బాగా చదువుకుంటున్న పిల్లలూ? :
సంపాదకీయం లో వ్యవస్థ అనే మాటని 'యవత్స' అంటున్నాడు రంగయ్య తాత. 'త' కి 'స' వత్తుని తిరగవేసినట్టుగా పలకడం కొన్ని ప్రాంతాల్లో వినవచ్చు - చురుకైన చెవితో ఆలకిస్తే. 'వస్తా' అనే మాట 'వత్సా' లాగా వినిపిస్తుందేమో గమనించండి ఎక్కడైనా !
ఈ సంచికలోని కథల్లో 'ప్రావీణ్యత', 'ప్రాధాన్యత' అనే మాటలు గమనించారా? వీటి బదులు 'ప్రావీణ్యం', 'ప్రాధాన్యం' అనే మాటలు వాడినా ఆవాక్యాలు చక్కగా అర్థమౌతాయి (ప్రయత్నించి చూడండి). ఇట్లా అనవసరంగా 'త' లు ఎందుకు కొన్ని మాటల చివర 'త'గులు కున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా ?