ఇక ఆ తర్వాత అది ఆ గుడ్లగూబల రాజుతో ఇష్టంగా ముచ్చట్లు పెట్టుకుంటూ, నిముషం కూడా ఆ రాజును విడచిపెట్టక అతని సమ్ముఖంలోనే నిలబడి ఉండటం మొదలు పెట్టింది.
రాజు చూపులు ఎక్కడ వాలతాయా అన్నట్లు రెప్పలార్పకుండా రాజువైపే చూస్తూ అతి విశ్వాసపాత్రంగా గడిపింది. ప్రతిరోజూ వింతవింతగా నవరసభరితమైన వినోదాలతో రాజుకు సంతోషం కలిగించించి. అంతకంతకూ మొదటికంటే నూరు రెట్ల విధేయతలను కురిపిస్తూ, అనేక రకాల పరిచర్యలతో ఉపమన్యుడి మనసుకు నచ్చే విధంగా ప్రవర్తించింది. చాలా నమ్మకం కలిగించుకొని, అన్నిచోట్లా ఎలాంటి అడ్డూ లేకుండా తిరిగింది.
ఆ కోటతో బాగా పరిచయం పెంచుకున్నది. అందులో రహస్యంగా తిరిగేందుకు, తప్పించుకునేందుకు ఉన్న మార్గాలనూ, కోట బలాబలాలను పూర్తిగా ఆకళించుకున్నది.
ఆ తర్వాత ఒకనాటి పగటిపూట, గుడ్లగూబలన్నీ ఆదమరచి సుఖంగా నిద్రపోతున్న సమయంలో అది గుహ బయటికి వచ్చి, దగ్గరలో ఆవుల గుంపులు ఉండే తావుకు వెళ్ళి, ఎండు గడ్డి గాదాలను కాలి వ్రేళ్ల సందుల్లో ఇరికించుకొని వచ్చి గుహద్వారం ముందు కుప్పలు చేసి పెట్టింది. వెంటనే చప్పుడు చేయకుండా కాకి రాజు మేఘవర్ణుడు వలస వెళ్ళిన కొండకు ఎగిరి వెళ్ళింది.
ఆ రాజుకు నమస్కరించి "ప్రభూ! మనం పట్టిన పంతం నెగ్గే సమయం దగ్గర పడింది. తమరు నాపై పెట్టిన విశ్వానపు రుణం తీర్చుకునే అవకాశం ఇవాళ్ల వచ్చింది. తమరి మనోరధాన్ని తీర్చేందుకు నేను పడ్డ శ్రమ అంతా నేడు ఫలించనున్నది. మీరంతా ఏక నిశ్చయులై నాకు చేదోడుగా తరలి రావాలి.
నేను ఆ ఉపమన్యుడి స్నేహం సంపాదించేందుకుగాను పడరాని పాట్లు ఎన్ని పడ్డానో, ఏమని చెప్పమంటారు? అయ్యో! ఉపమర్దనుడి పాపం పండింది కాబట్టి అంత సులభంగా నేను వేసిన వలలో తగులుకున్నాడు; నాకు తినేందుకు అన్నం, త్రాగేందుకు నీళ్ళు కల్పించాడు; నా బాగోగులు చూసుకోవటంకోసం పరిచారకులను నియమించాడు.
ఆ పరిచారకులంతా మొదట్లో నేను కనబడితే చాలు- గుటుక్కుమనకుండా మ్రింగాలని ప్రయత్నించేవాళ్ళు. అప్పుడంతా వాళ్ళు పెట్టే కష్టాలను భరిస్తూ, వాళ్ళు 'ఇదిగో తిను' అని ఏదో ఇస్తే ఆ ఇచ్చినదాన్నే తింటూ, నోరు కట్టుకొని, శరీరం శుష్కించిపోయినా ఓర్చుకొని, అదీ దొరకనినాడు ఊరికే నీళ్ళు త్రాగి కడుపు నింపుకున్నాను- తగిన సమయంకోసం ఎదురుచూస్తూ వచ్చాను. ఆ విధంగా చివరికి వాళ్ళందరి ఆదరాన్ని కూడా సంపాదించుకున్నాను. తలపెట్టిన పని నెరవేరనున్నది, మనం పడ్డ శ్రమ ఇప్పుడు గుర్తుకు రాదసలు.
యముడి చేతిలో ఉన్న పాశాలు తగులుకున్నాయి, ఉపమర్దనుడికి. ఇప్పుడు అతను రాజ్యాన్ని పరిపాలించటం మరచాడు- 'నా తోడిదే లోకం' అన్నట్లు, ఏమారి ఉన్నాడు. నాతో స్నేహం చేయవద్దు అని అతని మంత్రులెందరో నోళ్ళు నొప్పి పుట్టేట్లు చెప్పారు అతనికి. రోగికి పథ్యం గురించి ఎంత చెప్పినా ఇష్టం కానట్లు, వాళ్లు చెప్పే మంచి మాటలేవీ అతని చెవికి ఎక్కలేదు. వాళ్ల సంతోషం ఇవాల్టితో ముగియనున్నది. ఇప్పుడు మాట్లాడుతూ కూర్చునేందుకు మనకు కొంచెం కూడా అవకాశం లేదు. వాళ్ళందరి కన్నుగప్పి నేను ఇక్కడికి వచ్చాను- బావిలో ఉన్న నీళ్ళు వెల్లువయి ఎక్కడికీ పోవు- నేను అక్కడేమేం చేశానో ఆ కథలన్నీ తర్వాత సవిస్తరంగా చెబుతాను. ఇక ఇప్పుడు- ఈ క్షణంలో ఏంచేయాలో చెబుతాను వినండి-
గుహలో గుడ్లగూబలన్నీ నిద్రావశాలై ఈ లోకాన్ని మరచి ఉన్నాయి. నేను లేచి, ఆ చుట్టు ప్రక్కల ఆవులు ఉండే తావులకు వెళ్ళి, గడ్డీ గాదం తెచ్చి, గుహ వాకిట్లో పెట్టి, మిమ్మల్ని పిలుచుకొని పోయేందుకు వచ్చాను. మనందరం ఇప్పుడు వెళ్ళి, ఆ గడ్డికి మంట పెట్టి, నిద్రపోయే గుడ్లగూబలన్నిటినీ పెద్దనిద్రే పోయేట్లు (చచ్చిపోయేట్లు) చేద్దాం. ఇప్పుడు మనవాళ్లందరూ కదలాలి- మండే కొరువులు ముక్కుల్లో కరచుకొని బయలుదేరాలి. నాతోపాటు వచ్చి గుడ్లగూబల పనిని ముగించాలి" అన్నది.
కాకులన్నీ వెంటనే బయలుదేరాయి. చిరంజీవి కూడా మండే పుల్లను ఒకదాన్ని ముక్కున కరచుకొని, మిగిలినవాళ్లందరికీ దోవ చూపిస్తూ ముందు నడిచింది. అలా దండుగా బయలుదేరిన ఆ కాకులన్నీ పెద్ద పెద్ద కొండలు దాటుకొని వచ్చి నిశ్శబ్దంగా గుడ్లగూబల గుహ ముందు నిలచాయి. అక్కడ గుహద్వారం ముందు పేర్చిన పుల్లలకు మరికొన్ని పుల్లలు చేర్చి, వాటిని అంటించి రెక్కలతో విసరాయి. అప్పుడు రగిలిన ఆ మంటలు గుహ అంతర్భాగం వరకూ దూరాయి. కట్టెపుల్లలనుండి వెలువడిన పొగ గుహ అంతటా ఒక్కసారిగా కమ్ముకున్నది.
ఆ దెబ్బకు ఒక్కసారిగా మేల్కొన్న గుడ్లగూబలు చెవులు పిక్కటిల్లేలా అరుస్తూ, దారీ తెన్నూ కానక అటూ ఇటూ తిరిగాయి. గుహ అంతటా కమ్ముకున్న పొగ, మంటలు వాటినీ ఎటూ పోనివ్వలేదు. వాటి కష్టానికి నిద్రమత్తు కూడా తోడయ్యి, అవన్నీ తమ రాజు వద్దకు చేరి, ప్రభువని కూడా చూడక "అయ్యా! 'ఈ చిరంజీవి మనకు శత్రువు; దీన్ని చేరదీయద్దు. కీడు మూడుతుంది' అని చెవిలో ఇల్లు కట్టుకొని పోరాం. అయినా మా మాటల్ని వినలేదు నువ్వు. మా సలహాలన్నీ పెడచెవినబెట్టి, నీ మనస్సును పట్టుకున్న పిచ్చిని వెనకవేసుకొని వచ్చావు. ఇతరులెవ్వరూ అందుకోజాలని పదవిలో ఎదురులేకుండా బ్రతికిన నువ్వు, అంతులేని ఐశ్వర్యం ఉండి కూడా తినలేనివాడిలాగా తయారయ్యావు. నీ సామ్రాజ్యాన్ని నువ్వే నిష్కారణంగా కూలదన్నుకున్నావు. లేకలేక కన్న సంతానాన్ని, ఎన్నటికీ సంపాదించుకోలేని బంధుజనాన్నీ, ప్రాణ సమానులైన స్నేహితులను ఊరికే మ్రింగినవాడివైనావు. మా మాట వినక, శత్రువుకు చోటు ఇచ్చిన ఫలితం- నిన్ను భూతంలాగా కబళిస్తున్నది. ఇప్పుడైనా నీ అహంకారం అణిగిందా?" అని ఉపమర్దనుడిని తిట్టాయి.
ఆ సరికి మంటలు, పొగ గుహ మూల మూలలా క్రమ్ముకున్నాయి. ఆ వేడికి గుడ్లగూబల రెక్కలన్నీ కమిరి పోయాయి. ఇక తట్టుకోలేక, అవన్నీ గుహ మూల మూలల్లోకి దూరుకొని, మంటల్లో మాడి చనిపోయాయి.
ఈ విధంగాశత్రువులందరూ నశించి, కొద్ది సేపట్లోనే గుహ అంతా ఏనుగు తిన్న వెలగపండు మాదిరి ఖాళీ అయిపోగానే, కాకులన్నీ సంతోషంతో గంతులు వేసి, చిరంజీవిని కౌగలించుకొని అభినందించాయి.
"ఓయీ, చిరంజీవీ! నువ్వు పట్టు పట్టబట్టి కదా, మనందరం ఈ విజయం కళ్ల చూడగలిగింది?! ఇక్కడినుండి నువ్వు వచ్చి మా కంట పడనంత కాలమూ మేం ఎట్లా బ్రతికామో మాకే తెలీదు. మా అందరి ప్రాణాలూ నువ్వే. నువ్వులేక మేం ఇక్కడ ఒక్క నిముషమైనా నిలువ గలిగే వాళ్లమా? నీ తెలివితేటల వల్లనే గదా, ఆ గుడ్లగూబలు ఒక్కటన్నా మిగలకుండా అన్నీ సమూలంగా నశించాయి?!
ఇప్పుడు మా మనసుల్లో కల దు:ఖం అంతా ఉపశమించింది. గొప్ప పుణ్యం ఏదో చేసుకొని ఉంటాం, అందువల్లనే మాకు నీలాంటి స్నేహితుడు దొరికాడు. ఇంక మాకు ఏమి తక్కువ?" అని పలురకాలుగా చిరంజీవిని మెచ్చుకున్నాయి.
కాకిరాజు మేఘవర్ణుడు కూడా చిరంజీవిని మెచ్చుకొని, కాలి పొగచూరిన శత్రువుల గుహనంతా కలయ తిరిగి చూసి సంతోషపడ్డది. అటుపైన కాకులన్నీ దిక్కులు పిక్కటిల్లేట్లు 'కావ్..కావ్'మనని అరుస్తూ తమ సొంత గూళ్ళకు చేరుకొని సుఖించాయి."
చక్రవాక మంత్రి హిరణ్యగర్భుడికి ఈ విధంగా కాకి-గుడ్లగూబల కథను చెప్పి, 'అందుకనే, శత్రువును ఇంట్లో పెట్టుకుంటే చాలా ఆపదలు కొనితెచ్చుకున్నట్లవుతుంది' అంటారు. ప్రభువులవారు ఏమనుకుంటున్నారోగాని, నాకైతే ఈ కాకిని నమ్మటం అన్నివిధాలుగానూ అనర్థదాయకమే అనిపిస్తున్నది. తమరు ఈ కాకి తీపి పలుకులకు మోసపోయి, ఇతను మనకు యుద్ధంలో సాయపడతాడని ఉవ్విళ్ళూరుతున్నట్లు తోస్తున్నది. నిజంగా చెప్పాలంటే ఇతను చక్కెర పూత పూసిన విషమే తప్ప, మరేమీ కాదు. నదిలో ప్రవహించే చల్లటినీళ్ళే ఒడ్డున ఉన్న చెట్లను నిర్మూలిస్తాయని గమనించాలి తమరు. ఏ విధంగా చూసినా ఈ నీలవర్ణుడు అనుమానించదగినవాడు తప్ప, నిజంగా ఆదరించదగినవాడు అనిపించటంలేదు. ఈయన చేసే సాయం ఎంతటిదో దేవుడెరుగు; మనకు అపాయం చేయకపోతే చాలు.
కొంచెం వింటానంటే నా మనసులో ఉన్న మంచి మాట- మరొకటి చెబుతాను- దాన్ని అమలు చేద్దాం. లేదంటే కూడా పరవాలేదు- మేలు కోరి చెప్పే మాటను కనీసం ఆ భగవంతుడైనా మెచ్చుతాడేమో:
'దుష్టకార్యం ' అని భావించకుండా, వీడిని ఈ క్షణమే చంపేద్దాం. వీడు పోతే మన మనసులను ఆవరించి ఉన్న ఈ పీడ అంతా వదిలిపోతుంది- నిజం" అని చెబుతున్న మంత్రి మాటలకు హిరణ్య గర్భుడు చిరునవ్వు నవ్వి- "నువ్వన్నదంతా నిజమే. అయినా ఓ సంగతి ఆలోచించు. కొత్తగా వచ్చినంత మాత్రాన 'నమ్మకస్తుడు కాదు' అని నిశ్చయించేయటం సరైన పని కాదు. ఇతడు ఇంతవరకూ మనకు ఏ చిన్నపాటి ద్రోహమూ చేయలేదు. ఎవరి గుణాలైనా 'ఇలాంటివి' అని వాడి ప్రవర్తననుండి గ్రహించాలి తప్ప, వాడి పుట్టుకనుండి, జాతి నుండి కాదు. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా వచ్చిన కొత్తవాళ్ళే మేలు చేసేవాళ్లవుతారు; దగ్గరనుకున్నవాళ్ళే ఒక్కోసారి కీడు తలపెడతారు. మన శరీరంలోనే పుట్టిన రోగం మనకు కీడు చేసిన సమయంలో, వేరే ఎక్కడో పుట్టిన ఔషథం మనకు మేలు చేయట్లేదా? కొందరు మొదట హితులలాగా కనబడతారు; ఆ తర్వాత వాళ్ళు శత్రువులవుతారు. మరికొందరు మొదట అహితులమాదిరి అనిపిస్తారు, కానీ అవసరం పడినప్పుడు హితులవుతారు. ఇతను మనకు ఏ కొంచెం కీడూ తలపెడతాడని అని నాకు అనిపించటంలేదు. మనకు అపకారమే చేసేవాడైతే ఆనాడు కొలువులో చిలుకను చంపేందుకు అంత గొప్పగా ముందుకెందుకు వస్తాడు? మనమీద గల వాత్సల్యం కారణంగా మనకు మేలు చేసేందుకు వచ్చాడుతప్ప, వేరే పాపం తెలీదు ఇతనికి. ఇతను పరమ ధార్మికుడు; సత్య సంధుడు. పరీక్షకోసం అన్నట్లుగా ఇతన్ని కొన్నాళ్ళు మన దగ్గర ఉంచుకొని, ఈ లోపల ఇతనిలో ఏదైనా అవగుణం కనిపిస్తే- అప్పుడు ఇతన్ని ఏదైనా చేసినా లోకం మెచ్చుతుందిగాని, తొందరపడి, ధర్మం మరచి, నిష్కారణంగా ఏదైనా కీడు చేస్తే లోకం మనల్ని 'ఛీ' అనదా?
అంతేకాదు; నేరుగా మన ప్రత్యర్థి పక్షంవాడు అని కదా, 'ఈ పక్షిని నమ్మకూడదు' అంటున్నది? 'పనిని నెరవేర్చుకోవాలి' అనే పట్టుదల గలవాడు ఒక్కోసారి శత్రువును కూడా కలుపుకొని మెలగాలి. అటు చూస్తే బలవంతుడైన శత్రువు మనమీద యుద్ధానికి వచ్చి ఉన్నాడు. మనం ఇప్పుడు ఇతన్ని విడనాడటం ఏమంత ప్రయోజనకరం కాదు. కనీసం మన అవసరం తీరేంతవరకూ మనం ఇతనితో స్నేహం చేయటం మంచిది. శత్రువులకు హితుడైనవాడి పట్ల బుద్ధిమంతుడి పలుకు వెన్నలాగా మృదువుగా ఉండాలి; హృదయం ఇనుమంత కఠోరంగా ఉండాలి. 'చెలిమితో చేదైనా తినిపించవచ్చుగానీ, బలవంతంచేసి పాలు కూడా త్రాగించలేం' అని నానుడి వినలేదా?
పని నెరవేరటం కోసం శత్రువుతో స్నేహం చేసినా కూడా, మనసులో నమ్మక, అప్రమత్తుడై ఉడటం బుద్ధిమంతుల లక్షణం' అని పెద్దలు చెబుతారు. మన అవసరం తీరేంతవరకూ, బయటికి ఈ నీలవర్ణుడిని నమ్మినట్లు నటిద్దాం; లోపల నమ్మకుండా ఉందాం. ముల్లుతోటి ముల్లుని తీసి, అటుపైన ఆ ముల్లును కూడా పారవేసే విధంగా ఇతని సహకారంతో ఆ శత్రువును ఓడించి, మన అవసరం నెరవేరాక ఇతన్ని విడనాడదాం. గతంలో ఎలుక ఒకటి, అవసరార్థం ఓ పిల్లితోటి స్నేహం చేసి, అవసరం తీరిన తర్వాత దాన్ని విడచిపెట్టిందట- నీకా కథ చెబుతాను విను: అని ఎలుక-పిల్లుల కథ చెప్పటం మొదలు పెట్టింది. ( ఆ కథ వచ్చేసారి...)