నూట యాభై ఏళ్ళపాటు ఓ ప్రభుత్వ పాఠశాల తన ఉనికిని నిలబెట్టుకుంటూరావటమే కాక, నిత్య చైతన్యంతో, నిరంతరం నేర్చుకుంటూ ఉండటం ఎంతో గొప్పగా ఉంది. అది టెక్కలి బడికే కాదు- తెలుగువాళ్ళందరికీ గర్వ కారణమే. అటువంటి బడి పక్షానప్రత్యేక సంచిక రావటమూ గొప్ప సంతోషమే.
కథలు వ్రాసిన పెద్దలందరికీ మృదు గంభీరశైలిలో కథ చెప్పగల నేర్పు ఉందని తెలుస్తోంది. వరాలిచ్చే దేవతలు దురాశ, బద్ధకంలాంటివాటిని మాత్రం సహించరని, బుద్ధి చెబుతారనీ మన జానపద కథలు చెబుతాయి. అలాంటి కోవకి చెందిన 'పాత కుండ'ని సుమిత్రాదేవిగారు చక్కగా అనువదించారు.
అశోకుడి వైరాగ్యం గురించిన 'బౌద్ధకథ'ని సందర్భానికి చక్కగా అమరిపోయేలా వ్రాశారు సత్యనారాయణగారు.
'నడిచే గ్రంధాలయం' మంచి అంశం. దానిపై కథ అల్లటం మంచి ప్రయత్నం. కానీ కధా పరంగా ఇంకొంత ఆలోచన పెట్టి ఉంటే బాగుండేదనిపించింది.
కథలో వాక్య ప్రయోగాల్లో అక్కడక్కడా దోషాలు కూడా కనబడ్డాయి.."ప్రజలందరిచేత విరివిగా పుస్తకాలు చదవాలని.."లాంటివి.
సుబ్బారావుగారి 'ఫల ప్రదం'లో కథాంశం, శైలీ రెండూ బాగున్నాయి.
'ప్రజల తల్లి' చదివే ముందు దాన్ని వ్రాసిందెవరో చూడలేదు. అది ఎవరో టీచరుగారు వ్రాసి ఉంటారనుకున్నాను. తీరా దాన్ని రాసింది హేమలత, 8వతరగతి అని చూసి ఆశ్చర్యపోయాను. విద్యార్థులు తమకు దీటుగా వుండటం గురువుల విజయమే!
అందరినీ కలుపుకు పోవాలి; అందరితో కలిసి పోవాలన్న విలువైన విషయాన్ని భూపతి మంచి కథ ద్వారా చెప్పాడు. కానీ ఊరివాళ్ళు పాపం ఆ పిల్లాడిని పైకి ఏమీ అనలేదు కదా; మరి వాళ్ళమీద ఎందుకంత కోపం పెరిగిపోయిందో, వాడికి!
'మంచి స్నేహితులు'నిజంగానే నవీన్ చేసిన పంచతంత్ర కథల 'కొలేజ్' నక్కలాగా ఉంది.
'చేపలు-కప్పలు' అచ్చం మనుషుల్లాగే పోట్లాడుకున్నాయి. ముందు వదిలేసిన చేపలు తీరా కప్పతల్లి 'మీ జోలికి రాములే' అని చెప్పాక శిక్షకోసం పట్టుపట్టాయెందుకో?! పోట్లాటలంటే అలానే ఉంటాయి కాబోలు. చటుక్కున తిరిగి ఒకళ్ళనొకళ్ళు క్షమించేసుకోవటం బావుంది కదూ!
పద్మారావు వ్రాసిన 'విలువైన స్నేహం' పంచతంత్ర కథలకు ఏమీ తీసిపోకుండా ఉంది. పేర్లు కూడా గిసర-కర్ణిక అని చక్కగా పెట్టాడు. కానీ ఒక్కటే అర్థం కాలేదు- గుంటలో పడితే పైకి రాలేని నక్క, మరి జింకని గుంటలో పడేసి తిందామన్న ఆలోచన ఎలా చేసిందో! నక్కకి బుర్ర బొత్తిగా తక్కువనుకుంట. క్రాంతి తన పేరు పెట్టుకొని వ్రాసిన 'పాలభూతం' వెరైటీగా ఉంది. 'గాలికి కొట్టుకు పోయినట్లు రివ్వున దూసుకుపోయింది' లాంటి వర్ణనలు కళ్ళకు కట్టినట్లున్నాయి.
చివర్న చెప్పుకున్నా 'పేపర్ బోయ్ 'అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. చంద్రశేఖర్‌లాంటి అబ్బాయి పేపర్ బోయ్ అవ్వాల్సిన కారణాలు ఏవైనా, అతని అనుభవం మాత్రం విలువైనది-గొప్పది. తన అనుభవాలని మనతోపంచుకున్న తీరు అతని పరిణతిని తెలియజేస్తుంది. కష్టాన్నీ సంతోషాన్నీ విడివిడిగా చూస్తూ, ఏ ఒక్కటీ రెండోదాన్ని మింగెయ్యకుండా చూసుకునే నేర్పు పిల్లల్లో వున్నంత పెద్దవాళ్లలో ఉండదేమో!
మొత్తానికి, 'టెక్కలి ప్రత్యేక సంచిక'ఇచ్చినందుకు కొత్తపల్లివారికీ, టెక్కలి విద్యార్థి-అధ్యాపక బృందానికీ, చిత్రకారులకూ అందరికీ అభినందనలు.