శాంతిపురంలో యతీంద్ర అనే ధనవంతుడు ఒకడు ఉండేవాడు. అతని ఇంట్లో వీరయ్య అనే పనివాడు ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం చెరువుకు వెళ్ళి కావడిలో రెండు కుండలు పెట్టుకొని నీళ్ళు తెచ్చేవాడు. ఆ తర్వాత పశువుల పేడ ఎత్తడం, తోటకు వెళ్ళడం- ఇలా మిగతా పనులన్నీ చేసేవాడు. కావడిలో ఒక కుండకు చిన్న చిన్న రంధ్రాలు పడి ఉన్నై. మరో కుండ బాగా ఉన్నది.

చెరువు నుంచి యజమాని ఇంటికి చేరేలోగా మొదటి కుండలోని నీళ్ళు సగం పైన చుక్కలు చుక్కలుగా రంధ్రాలలోంచి కారిపోయేవి. రెండో కుండ మాత్రం నిండుగా ఇల్లు చేరేది.

ఇలా కొంతకాలం గడిచాక, నిండు కుండ రంధ్రాలుపడిన కుండతో అన్నది: "నన్ను ఏ పనికైతే నియోగించారో, దాన్ని నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. కాని నువ్వు సగం నీటిని దారిలో పారపోస్తున్నావు- నీ యజమాని పట్ల విధేయత లేదు, నీకు" అని.

ఆ రోజున వీరయ్య కావడి కుండల్ని చెరువులో ముంచుతూండగా రంధ్రాలుపడిన కుండ అతనితో‌ మాట్లాడింది: "నాకు చాలా సిగ్గుగా ఉంది వీరయ్యా! నాకు నియోగించిన పనిని నేను సక్రమంగా చేయలేకపోతున్నాను. ఈ చిల్లుల కారణంగా నీళ్లన్నీ దారిలోనే కారిపోతున్నాయి" అన్నది.

వీరయ్య ఏమీ మాట్లాడకుండా కావడినెత్తుకొని నడక సాగించాడు. మధ్య దారిలో కావడిని క్రిందికి దించి, రంధ్రాలు పడిన కుండని అడిగాడు- "నీకు బయట ఏం కనిపిస్తున్నాయి?" అని. "అందమైన పూలచెట్లు కనిపిస్తున్నాయి" అన్నది చిల్లి కుండ. "మరి నీకు ఏం కనిపిస్తున్నాయి?" అని నిండు కుండను అడిగాడు వీరయ్య. "బీడు భూముల్లో ఏముంటాయి, ఏమీ లేవు!" అన్నది నిండుకుండ.

వీరయ్య నవ్వి, వాటితో అన్నాడు- "చిల్లికుండలోంచి చిందిన నీరు ఆ పూల చెట్ల జీవితాలకు ఆధారమైంది. అందువల్లనే నేను దాన్ని మార్చడం లేదు! నిండు కుండ యజమానికి సేవ చేస్తున్నట్లే, చిల్లికుండ ఆ చెట్లకు ప్రాణాన్నిచ్చి యజమానికి ఇంత పుణ్యం సంపాదించి పెడుతున్నది. ఈ రెండింటిలోనూ ఎవరు గొప్ప అంటే ఏం చెప్పగలం?" అని.