నిహార్, జాస్మిత అన్నా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ చదువులో మొదట ఉండేవాళ్ళు; చాలా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. పరీక్షలు చక్కగా సంతృప్తికరంగా రాశాక, వేసవి సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు.

నిహార్: జాస్మితా! నువ్వు నా వెంట రా, చప్పుడు చేయకు అస్సలు!

జాస్మిత: సరే! ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం?

నిహార్: మనం ఇప్పుడు అమ్మమ్మను ఆశ్చర్యంలో ముంచెత్తబోతున్నాం. మనం ఇక్కడికి వస్తున్నట్లు అమ్మమ్మకు తెలీదు. అందుకని నువ్వు మాట్లాడకుండా, చప్పుడు చెయ్యకుండా ఉండి సహకరిస్తే, నేను వెళ్ళి అమ్మమ్మ కళ్ళు మూస్తాను..సరేనా?

(ఇద్దరూ అమ్మమ్మ వెనకగా వెళ్ళారు. నిహార్ అమ్మమ్మ కళ్ళు మూశాడు..)

అమ్మమ్మ: ఎవరిది!? ఏమిటిది?!...ఏయ్! ఎవరబ్బా?! ఉం.. నా ప్రియమైన మనవడు-మనవరాలు! నిహార్, జాస్మిత వచ్చేశారు అమ్మమ్మ ఊరికి!

(పిల్లలిద్దరూ నవ్వుతూ కళ్ళమీదినుంచి చేతులు తీశారు..)

జాస్మిత, నిహార్: హాయ్, అమ్మమ్మా!

అమ్మమ్మ: ఏరా, పిల్లలూ! నేను బాగున్నాను; మరి మీరు ఎట్లా ఉన్నారు? పరీక్షలు ఎట్లా వ్రాశారు?

నిహార్: చాలా బాగా వ్రాశాము.

అమ్మమ్మ: బాగా రాత్రి అయింది, రండి.. భోజనం చేద్దాంరండి.

నిహార్: జాస్మితా! ఆ స్వీట్ డబ్బాను చాలా జాగ్రత్తగా, క్రింద పడేయకుండా తీసుకొనిరా-

(అట్లా అంటున్నాడో లేదో స్వీట్ డబ్బా క్రింద పడింది.. "టుమ్ టుమ్ టు టు టుమ్..")

జాస్మిత: ఓరి దేవుడా! స్వీట్ డబ్బా క్రిందపడింది!

నిహార్: నేను నీకు చెప్పానుగా, 'దాన్ని జాగ్రత్తగా తీసుకొని రా!' అని?

అమ్మమ్మ: సరే, పోట్లాడుకోకుండా నిశ్శబ్దంగా ఉండండి! పడింది స్వీట్ డబ్బానే కదా, వదిలేయండి! భోజనం చేద్దాం పదండి.

జాస్మిత: మీకు తెలుసా! నేను ముందే అనుకున్నాను- స్వీట్ డబ్బా కింద పడిపోతుందేమోనని!

అమ్మమ్మ: అబ్బ! అయితే నువ్వు అట్లా అనుకున్నావు కనుకనే అది పడిపోయి ఉంటుంది!

జాస్మిత: అది అలా ఎట్లా సాధ్యం అమ్మమ్మా! మనం అనుకునేది- తర్వాత నిజంగా జరిగేదానికి ఏ విధంగా లింక్ అయి ఉంటుంది?

అమ్మమ్మ: అది అలాగే జరుగుతుంది. ఉదాహరణకు, ఇప్పుడు ఓ పని చెయ్యి- నిహార్ అన్నకు ఆ స్వీట్ డబ్బాని ఇవ్వు. ఆ స్వీట్ డబ్బా వాడి చేతులోంచి క్రింద పడిపోతుందని బలంగా అనుకో.. ఆ ఆలోచననే గట్టిగా పట్టుకో.

జాస్మిత్: సరే, అలాగే ఆలోచిస్తాను- ఏమౌతుందో చూద్దాం

నిహార్: ఆఁ..! స్వీట్ డబ్బా పడిపోయింది!

అమ్మమ్మ: అదే నేనంటున్నది- జాస్మితా, నీకు అర్థమైందనుకుంటాను- అందుకే మనం ఎప్పటికీ నెగటివ్ ఆలోచనలను ప్రసారం చేయవద్దు. నిహార్: ఎందుకు?

అమ్మమ్మ: మన ఆలోచనలకు చాలా శక్తి ఉంది.మనం బలంగా చేసే ఆలోచనలు నిజం అవుతాయి. ఒకవేళ మనం మంచి ఆలోచనలు చేశామనుకో, అది నిజంగానే జరుగుతుంది. చెడు ఆలోచనలు చేశామనుకో, చెడే జరుగుతుంది-

మీకు తెలుసా, మాయింటి దగ్గర్లో ఇదివరకు ఒక కళాకారిణి ఉండేది. చాలా మంచి మనసుతో‌ అందరికీ సాయం చేసేది. తర్వాతి కాలంలో ఆమె దేశం మొత్తంలోనూ పేరు గాంచిన నాట్యకత్తె అయిందని తెలిసి చాలా సంతోషించాము- ఆమె విజయం ఆమె మంచి ఆలోచనల వల్లనే సాధ్యమయిందని మాకు అనిపించింది.

మరి అట్లాగే ఇంకో సంగతి చెబుతాను- ఒకప్పుడు ఇద్దరు శాస్త్రవేత్తలు- త్రివేద్ మరియు నివేద్ ఉండేవాళ్ళు. ఒకసారి త్రివేద్‌కి ఒక కల వచ్చింది:

ఆ కలలో అతని అన్నయ్య నివేద్ చనిపోయాడు; తమ పరిశోధన ఫెయిలయింది !

నిద్రలేచాక త్రివేద్ ఆ కలని చాలా సార్లు గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకున్నకొద్దీ అతనికి ఇంకా ఇంకా బాధ కలిగింది. మెల్లగా అతనికి తను చేస్తున్న పనుల మీద ఇష్టం, శ్రద్ధ, ఆసక్తి అన్నీ తగ్గిపోయాయి. అంతకు ముందు ఇతను చాలా పరిశోధనలను, చాలా నమ్మకంతో చేశాడు. ఇప్పుడు, ఆ కల గురించి ఆలోచించి ఇబ్బంది పడడం వల్ల అతని పరిశోధనలు సక్రమంగా జరగటం లేదు. క్రమంగా అతని మనసులో అన్నీ నెగటివ్ ఆలోచనలే రాసాగాయి: అతనిప్పుడు అన్ని పనులనూ తప్పుగానే చేస్తున్నాడు. తన కల గురించి నెగెటివ్‌గానే ఆలోచిస్తూ పోవడం వల్ల అతని జీవితంలో నిజంగానే నష్టపరచే సంఘటనలు ఎదురయ్యాయి.

జాస్మిత: ఏమైంది?

అమ్మమ్మ: అతని రీసర్చ్ ఫెయిల్ అయింది. అతను నెగెటివ్‌గా ఆలోచించడం వలన, ఆ నెగెటివ్ ఆలోచనకు పవర్ వచ్చి అలా జరిగిందన్నమాట!

నిహార్: దేవుడా! ఎంత తిరకాసుగా ఉంది!

అమ్మమ్మ: ఇది తిరకాసు కాదు; నిజం! దీనిని బట్టి ఏమి తెలుస్తోంది?

జాస్మిత : నేనూ ఓ పుస్తకంలో చదివాను- ఎవరైనా ఏదో ఒక విషయం గురించి నెగెటివ్‌గా గాని పాసిటివ్‌గా గాని ఒక వారం ఆలోచన చేశారనుకో, అటుపైన అనాలోచితంగా ఆ తవాతి రోజు నుండికూడా అతనికి అవేలాంటి ఆలోచనలు వస్తాయి; ఆ ఆలోచనలకు అనుగుణంగానే అతను ప్రవర్తిస్తాడు. తన ఆ ఆలోచనలను కొద్ది రోజుల పాటు ఆపుకోలేకపోతాడు.

అమ్మమ్మ: అవును- ఎప్పుడు పాసిటివ్‌గా ఆలోచిస్తే పాసిటివ్‌గానే చేస్తావు; పాసిటివ్‌గా ఉంటావు.

నిహార్: ఏమో, మీరు మాట్లాడేదంతా నాకైతే తిరకాసుగానే అనిపిస్తోంది. నేను నిద్ర పోతా! బై! గుడ్‌నైట్! తిరకాసు మాటలు-తిరకాసు ఆలోచనలు! అట్లా అంతా తిరకాసు పనులే చేస్తాం; చివరికి మొత్తం తిరకాసే అవుతుంది- కదూ!

జాస్మిత, అమ్మమ్మ: అబ్బ పోరా! నీకు బాగా నిద్ర వచ్చేసింది; పోయి చక్కగా పడుకో.

(నిహార్ నవ్వుతూ పడుకునేందుకు పరుగు పెడతాడు)