రాము, రవి మంచి స్నేహితులు. సీను, రమణ కూడా మంచి స్నేహితులే.

రాము-రవి ఇద్దరూ కలిసి చదువుతారు; కలిసి ఆడతారు; ఒకరికొకరు సాయం చేసుకుంటారు.

సీను-రమణ కూడా అంతే. కలిసి చదువుతారు; ఆడతారు; సాయం చేసుకుంటారు.

అయితే వీళ్ళు వేరు- వాళ్ళు వేరు. వాళ్లకీ-వీళ్ళకీ ఎప్పుడూ పోటీనే.

ఒకసారి ఊళ్ళో పరుగుపందాలు జరిగాయి. పిల్లలంతా అందులో‌ పాల్గొన్నారు.

చాలా దూరం పరుగెత్తాలి, అడవి దారిలో. ఇద్దరిద్దరిది ఒక జట్టు.

చాలా వేగంగా పరుగెత్తాడు రవి- అందరికంటే వేగంగా. వాడి వెనకనే రాము!

అయితే పరుగులో బాగా అలసిపోయాడు రవి. అకస్మాత్తుగా‌ కుప్పకూలిపోయాడు.

వాడు పడిపోవటం చూసి రాము‌ ఆగిపోయాడు. స్నేహితుడిని లేవనెత్తాడు. తలని ఒళ్ళో పెట్టుకొని చెమట తుడిచాడు. సపర్యలు చేస్తున్నాడు.

వాళ్ల వెనకనే పరుగెత్తుకొని వస్తున్నారు సీను-రమణ. సీను వీళ్ళని చూసి నవ్వాడు. బొటన వేలు పైకెత్తి చూపించాడు- "మేమే గెలుస్తాం" అని కళ్ళు ఎగరేసాడు. ఇద్దరూ వీళ్ళని దాటుకొని ముందుకు పరుగు తీసారు.

ఉత్సాహంగా నాలుగడుగులు వేశాక, రమణ అన్నాడు-"వాడికి అస్సలు బాగాలేనట్లుందిరా, పాపం!" అని.

సీను పరుగు కొనసాగిస్తూ "పోనీలే! అట్లాగైనా మనం గెలుస్తాం, ఈసారి!" అన్నాడు.

"ఆగి ఏమైనా సాయం చేద్దామా, పోనీ?" అన్నాడు రమణ, వేగం తగ్గిస్తూ.

"నీ ఇష్టం. చక్కగా గెలిచే అవకాశం మరి, చెయ్యి జారి పోతుందేమో!" అన్నాడు సీను, ఆగుతూ.

ఇద్దరూ వెనక్కి వచ్చారు. రవికి సాయం చేశారు. దగ్గర్లో ఉన్న వాగులోంచి నీళ్ళు తెచ్చి ఇచ్చారు. వాడు తేరుకునేంతవరకూ వెంట కూర్చున్నారు.

ఆలోగా మిగిలిన జట్ల వాళ్ళు అందరూ ముందుకెళ్ళిపోయారు.

తర్వాత ఈ నలుగురూ వాగు దగ్గరికి వెళ్ళి, కాళ్ళు-చేతులు కడుక్కొని, మెల్లగా ఊరు చేరుకున్నారు.

పరుగుల పోటీలో నలుగురూ ఓడిపోయారు.

అయితే ఆ తర్వాత, ఇప్పుడు రాము-రవి-సీను-రమణ నలుగురూ మంచి స్నేహితులు. నలుగురూ కలిసి చదువుతున్నారు; కలిసి ఆడుతున్నారు; నలుగురూ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు; నలుగురూ సంతోషంగా ఉంటున్నారు. ఊళ్ళో ఎవర్నడిగినా "వాళ్ళు నలుగురూ ఒక జట్టు- చాలా మంచి పిల్లలు. ఏ పనినైనాఎంత బాగా చేస్తారో!" అంటున్నారిప్పుడు.

మంచి పిల్లల్ని కూడా విడదీసేవి, నిజానికి చిన్న చిన్న గీతలే. వాటిని చెరిపేసుకోవటం ఏమంత పెద్దపని కాదు. కొంచెం పెద్ద మనసుతో ప్రయత్నిస్తే చాలు- ఆపైన గెలుపు అందరిదీ అయ్యే అవకాశం ఉంటుంది- ఏమంటారు?

కొత్తపల్లి బృందం.