ప్రాస కవిత్వం!
నేను కొన్నాను ఒక "టికెట్"
చూడడానికి "క్రికెట్"
నేను లాక్కున్నాను ఒక "వికెట్"
దాన్ని అమ్మి కొన్నాను ఒక "బకెట్"
ఒరేయ్ "బాసు"
ఏమి అట్లా పెట్టావు "ఫేసు"
బినినెన్స్ లో వచ్చిందా "లాసు"
దీపావళికి పేలుస్తావా "టపాసు"
నా పేరు "మీన"
తెచ్చాను ఒక నీళ్ళ "బాన"
దాన్ని పెట్టాను "నేలపైన"
దీని పై వాలింది "మైన"
గానం చేసింది ఆ "పైన"
గానం అర్థమైందా "ఇప్పటికైన"
-రచన: కె.శరత్‌చంద్రిక, 7వతరగతి, శ్రీ సాయినాథ్ స్కూలు, పొదలకూరు, నెల్లూరు.
పుష్ప విలాపం!
నల్లని జడలో అందంగా అలంకరించిన పువ్వులను చూడు
ఎంతో అందంగా తొందరగా మనసుని ఆకర్షిస్తున్నాయి.
కానీ పైకి అందంగా ఉన్నా ఆ పువ్వుల మనసులో బాధ ఉంది.
ఆ బాధ పాపం ఎవరికి చెప్పుకుంటాయి ఆ పువ్వులు
పుట్టీ పుట్టగానే ఆ పువ్వుని తల్లి నుండి దూరం చేశారు,
తల్లిప్రేమ అనుభవించక ఎంత దు:ఖిస్తున్నాయో ఆ
బాధ వాటికే తెలుసు, కావున పూగుత్తులు కోసే మిత్రమా
వాటి మనసు తెలుసుకొని మసలుకో.
-రచన: సి.కృష్ణవేణి, 9వతరగతి, ప్రకృతిబడి.
అపజయం
అపజయం కలిగిందని నిరాశపడకు
అపజయం విజయానికి తొలిమెట్టు
ఓడిపోయానన్న బాధ అక్కర్లేదు
ఓటమి వెంటే గెలుపుంటుంది.
ఎండ వెంట నీడలా
పగలు వెంట రాత్రిలా
అపజయం వెంట విజయం తప్పక ఉంటుంది.
మనసు పెట్టి చూడు మార్గముంటుంది.
నీ అపజయానికి కారణం ఆలోచించు
ఆలోచన లేని పని
నీరు లేని బావి లాంటిది
ఒంటరి వాన్నని నిరాశపడకు
నీ నీడే నీకు తోడు
విజయం వైపు నడక సాగించు
విజయాన్ని జయించు
అపజయాన్ని తొలగించు.
రచన: ఆర్.ప్రగతి,9వతరగతి,జిల్లా పరిషత్ హైస్కూల్, వెంకటంపల్లి.
తిక్క కవిత!
మా ఇంట్లో ఉంది మా అక్క
అరటికాయ తిని పడేసింది తొక్క
జారి పడింది జిత్తుల మారి నక్క
అది ఎవరోకాదు మా అక్క
పడుకోవడానికి వేసింది పెద్ద పక్క
దాని కింద ఉంది ఓ చెక్క
దాని పై పడుకుంది మా అక్క
అంతలో వచ్చింది ఎదురింటి కుక్క
పట్టుకొని లాగింది మా అక్క రెక్క
గబుక్కున లేచింది మా అక్క
తీసుకుంది పక్కకింద ఉన్న చెక్క
భయపడి పారి పోయింది ఎదురింటి కుక్క
రచన:షేక్ నాగుల్ షరీప్, అరవిందా హైస్కూల్, కుంచనపల్లి.
జోకులు:
ఎవరు కొత్త?
ఇద్దరు తాగుబోతులు రోడ్డుమీద ఇట్లా మాట్లాడుకుంటున్నారు:
గోపాల్: చూడు బ్రదర్, ఆకాశంలో ఉండేది చంద్రుడో, సూర్యుడో అర్థంకావట్లేదు- కాస్త చూసి చెబుతావా?
నరేష్: నా కెట్లా తెలుస్తుంది? నేనసలే ఈ ఊరికి కొత్త! అయినా ఇంతకాలంగా ఊళ్ళో ఉన్నావు- నువ్వు నన్నడగడమేమిటో!
అతితెలివి భక్తి!
భక్తుడు: దేవుడా! మాకు వేలకోట్ల సంవత్సరాల కాలం నీకు ఎంతతో సమానం?
దేవుడు: మీ వేలకోట్ల సంవత్సరాలూ నాకు ఒక్క నిముషంతో సమానం.
భక్తుడు: దేవుడా! మా వేలకోట్ల రూపాయలు నీకు ఎంతతో సమానం?
దేవుడు: నాయనా, మీ వేల కోట్ల రూపాయలూ నాకు ఒక్క పైసాతో సమానం.
భక్తుడు: అయితే దేవుడా! నాకు ఒక పైసా దానం చెయ్యి!
దేవుడు(అంతర్ధానం అయిపోతూ): అలాగే నాయనా, ఓ నిమిషం ఆగు!
అప్పు పాఠం!
టీచర్: వెస్టిండీస్ నుండి మనకు ఏమేం వస్తాయో చెప్పు, రామూ?
రాము: తెలీదు టీచర్!
టీచర్ (ఉత్సాహపరుస్తూ): నీకు తెలుసులే! చక్కెర ఎక్కడినుండి వస్తుంది?
రాము: ప్రక్కవాళ్ళ ఇంట్లో అప్పు తీసుకుంటే వస్తుంది టీచర్!
చక్కెరే లేదు!
డాక్టర్: ఏంటయ్యా, నీ సమస్య?
రోగి: ఏం లేదండి.
డాక్టర్: అయితే ఇక్కడికెందు కొచ్చావ్?
రోగి: ఈ పుండు మానడం లేదండి.
డాక్టర్: నీ కేమైనా షుగర్ ఉందా!
రోగి: మా ఇంట్లో బెల్లమే లేదు; ఇంక షుగర్ ఎక్కడిది?!
-షేక్ నాగుల్ షరీప్, అరవిందా హైస్కూల్, కుంచనపల్లి, గుంటూరు.
అంత నవ్వు రాలేదు!
స్వీట్ షాప్ వాడు: ఏవండీ పంతులు గారూ! 'పకోడి ' ఇమ్మంటారా?
బ్రాహ్మణుడు: ఏంటీ! నా చేత 'కోడి ' తినిపిస్తావా?! కలికాలం ముదిరిందయ్యా!
-షేక్ నాగుల్ షరీప్, అరవిందా హైస్కూల్, కుంచనపల్లి, గుంటూరు.
ఏమీ కాని ప్రశ్నలు
1.టైరు కాని టైరు..?
జ.సెటైరు
2.టీ కాని టీ..?
జ.ఆంటీ!
3.రాజు కాని రాజు..?
జ.తరాజు!
4.పిడి కాని పిడి..?
జ.పాపిడి!
5.మిడి కాని మిడి..?
జ.మామిడి!
6.పెరగటమే కానీ తరగనిది..?
జ.వయస్సు
-షేక్ నాగుల్ షరీఫ్, అరవిందా హైస్కూల్, కుంచనపల్లి.
క్రిందిపదాల్లో మూడు మూడింటిని నిలువుగాను, అడ్డంగాను చదివి చూడండి. ఎట్లా చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి!
స మ త
మ జ్జి గ
త గ ము
కం చ ము
చ క్కె ర
ము ర ళి
క్షీ ర ము
ర వ్వ లు
ము లు కు
కా ను పు
ను వ్వు లు
పు లు లు
కా ర ము
ర గ డ
ము డ త
స మ త
మ ర ల
త ల పు
త మ కం
మ ర్యా ద
కం ద కం
పొ ల ము
ల లి త
ము త క
ధ న ము
న వ్య త
ము త క
వ ర స
ర వి క
స క లం
హి మ జ
మ న ము
జ ము న
క వి త
వి న ల
త ల క
కో వె ల
వె న్నె ల
ల ల న
మ న సు
న య నం
సు నం ద
ది న ము
న గ రి
ము రి కి
టో క రా
క వ్వ ము
రా ము డు
చ దు వు
దు ర ద
వు ద కం
ప్ర దే శం
వే ది క
శం క రం
-('బాల' పత్రిక స్ఫూర్తితో తయారీ : రాధ మండువ, ఉపాధ్యాయిని, రిషి వ్యాలీ స్కూలు, మదనపల్లి, చిత్తూరు జిల్లా.)
వాక్యాల గజిబిబి!
-
వంద భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యమొక లక్ష్యమా!
-
కాకీక కాకికి కాక కుక్కకా!
-
నీ నాన్న నా నాన్నని నేనన్నానా, నా నాన్న నీ నాన్నని నేనన్నానా, నీ నాన్న నీ నాన్నే, నా నాన్న నా నాన్నే
-
నీ నూనె నా నూనెని నేనన్నానా, నా నూనె నీ నూనెని నేనన్నావా నీ నూనె నీ నూనే, నా నూనె నా నూనే.
సేకరణ:పి.పుష్ప, చెన్నేకొత్తపల్లి.
సుభాషితాలు
మనుషులకు ముత్యాల దండలు, భుజకీర్తులు అలంకారాలు కావు.
పన్నీటి స్నానం, గంధపు పూతలు- ఇవేవీ సౌందర్యాన్ని ఇవ్వవు.
చక్కని మాట తీరే మనుషులకు అసలు అలంకారం . -భర్తృహరి
అందరితో మర్యాదగా వ్యవహరించు. ఎక్కువమందితో కలుపుగోలుగా ఉండు. తక్కువ మందిని పరిచయం చేసుకో. ఒక్క ప్రాణ స్నేహితుడినైనా సంపాదించు.