కోదాడలో ఉండే సమతయ్య పడుకునే మంచం ఒకరోజు విరిగిపోయింది.

కొత్త మంచం కొనాలని సంతకి బయల్దేరాడు అతను. అయితే అతను అటు బయలుదేరే సరికి ఎదురింటి ఎల్లయ్య ఎదురయ్యాడు.

"ఎటు పోతున్నావు సమతయ్యా?" అని అడిగి, సంగతి తెలుసుకొని, "మా ఇంట్లో నిక్షేపంలాంటి మంచం ఒకటుంది. సగం ధరకే ఇస్తాను. దానికోసం వృధాగా సంత వరకు వెళ్ళేదెందుకు?" అన్నాడు.

'సగం ధర'అనే సరికి సమతయ్యకు ఆశ పుట్టుకొచ్చింది. ఎల్లయ్య సలహా నచ్చింది. ఆ మంచాన్ని కొనుక్కొని, వెంటనే వాడుకోవటం కూడా మొదలు పెట్టేశాడు.

అయితే ఇది జరిగే సమయానికి సమతయ్య భార్య సన్నమ్మ ఊళ్ళో లేదు. అతను మంచం కొనేసిన తర్వాత రెండు రోజులకి సన్నమ్మ పుట్టింటి నుంచి వచ్చింది. వస్తూనే పాత మంచం విరిగిన సంగతీ, కొత్తమంచం తెచ్చిన సంగతీ తెలుసుకుని ఒంటికాలిమీద లేచింది- "మీ తెలివి తెల్లారినట్టే ఉంది.

ఎల్లయ్య తండ్రి దీని మీదే పడుకునేవాడు. ఏదో తెలీని రోగం వచ్చి చచ్చి పోయాడాయన. ఆ తర్వాత అది వాళ్ళ ఇంట్లోనే పడి ఉండేది- 'రోగాలు అంటుకుంటాయేమో‌ ' అని దాన్ని ఎవరూ వాడేవాళ్ళు కాదు. అట్లాంటి ఆ మంచాన్ని తెలివిగా నీకు అంటగట్టాడు ఎల్లయ్య! తేరగా వస్తున్నదిగదా అని నువ్వు తెచ్చి పెట్టుకున్నావు ఆ దరిద్రాన్ని. ఇదిమనకెందుకు? వెళ్ళు! దీన్ని తిరిగి ఇచ్చేసి మన డబ్బులు వెనక్కి పట్టుకురా!" అంటూ తరిమింది.

అయితే ఆ మంచాన్ని వెనక్కి తీసుకోనన్నాడు ఎల్లయ్య! "ఒకసారి కొనేశాక ఏ వస్తువైనా నీదే! నీ వస్తువును నేనెలా తీసుకుంటాను?" అన్నాడు.

అది విని సన్నమ్మ కస్సుమనిలేచి, 'ఇది మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తీసుకెళ్ళి పాడుబడ్డ ఏ బావిలోనో పడేసిరా! దీన్ని తెచ్చావంటే ఇంక నిన్ను కూడా ఇంట్లోకి రానిచ్చేది లేదు' అని తేల్చి చెప్పేసింది.

ఇంక ఏమీ అనలేక, సమతయ్య ఆ మంచాన్ని నెత్తిన పెట్టుకుని, అడవిలో ఓ పాడుపడిన బావి దగ్గరకు పోయాడు. అక్కడికెళ్ళాక మంచాన్ని ఎత్తి బావిలోకి వెయ్యబోతూ అనుకోకుండా ఓ రాయిని తన్నుకుని ముందుకు పడ్డాడు. మంచం కాస్తా చటుక్కున జారి అక్కడున్న ఎండుటాకుల కుప్ప మీద పడింది 'దబ్బు..న. సరిగ్గా అదే సమయానికి కొందరు దారి దోపిడి దొంగలు తాము దోచుకున్న నగల్ని ఆ ప్రక్కనే కూర్చొని పంచుకుంటున్నారు.

అకస్మాత్తుగా 'దబ్బు..'మనేసరికి అదేదో తుపాకీ పేలిన శబ్దం అనుకున్నారు వాళ్ళు. ఇంకేముంది, వాళ్ళు బెంబేలు పడి నగలన్నీ ఎక్కడివక్కడ వదిలేసి పరుగు లంకించుకున్నారు.

ఇదేమీ తెలీదుగా, సమతయ్యకు? అతను లేచి దేవుడిని, తన భార్యను తిట్టుకుంటూ మంచాన్ని లేవనెత్తి, ఈసారి బలంగా నూతిలోకి పడేట్లు విసిరి, వెనక్కి తిరిగి ఇంటికి బయల్దేరాడు. ఇంకా పది అడుగులు వేశాడో లేదో, అతని వెనక చప్పుడైంది- నిండా తడిసి ఉన్న ఒకాయన అతడిని వెనక్కి పిలిచి- "చూడు బాబూ! నువ్వెవరో దేవుడిలాగా వచ్చావు. ఇంతకు కొంచెం సేపు ముందే దొంగలు నా డబ్బంతా దోచుకుని, నన్ను నూతిలోకి తోసేశారు. నీ మంచం దయ వల్ల బయటపడ్డాను- నా డబ్బంతా నాకు దొరికింది. ఇందులో సగం నీది! తీసుకో!' అంటూ కొంత డబ్బు, కొన్ని నగలు ఇచ్చి , మంచాన్ని కూడా జాగ్రత్తగా అప్పగించి చక్కాపోయాడు!

పారేసిన మంచం తిరిగి అంటుకోవటంతో సమతయ్యకు ఏం చేసేదీ పాలుపోలేదు. అయోమయంగా దిక్కులు చూస్తూ అక్కడే నిలబడ్డ సమతయ్యను కొందరు గిరిజనులు చుట్టుముట్టారు అంతలోనే-

'దేవుడిలా సమయానికి కనిపించావు మంచాన్ని చేతబట్టుకొని! మా ఆడమనిషి పురిటి నొప్పులతో బాధ పడుతోంది. నీ మంచం ఇచ్చావంటే ఆమెను పొరుగూరు మోసుకుపోతాం!' అంటూ బ్రతిమలాడారు.

"ఆహా! మంచం ఇట్లా వదిలిపోతున్న దన్నమాట!" అనుకొని సమతయ్య సంతోషంగా దాన్ని వాళ్లకిచ్చేసి ఇంటి ముఖం పట్టాడు.

అట్లా కొంత దూరం వెళ్ళాడో, లేదో- ఆ గిరిజనులు పరుగున వచ్చారు వెనకనుండి: 'ఓరయ్యా! నీ మంచం మహిమో, ఏమో- మా ఆడమనిషికి వెంటనే సుఖ ప్రసవం అయింది; పండంటి బిడ్డ పుట్టాడు! నూరేళ్ళు సల్లంగ బ్రతుకు!" అంటూ సంబరంగా కొంత డబ్బు చేతిలో పెట్టి, మంచాన్ని తిరిగి సమతయ్యకే అప్పగించి వెళ్లిపోయారు.

సమతయ్యకు ఆ మంచాన్ని చూస్తే బెంగ పట్టుకున్నది. "అది తనను వదిలేలా లేదు! దాన్ని పట్టుకొని తను ఇంటికెళ్తే సన్నమ్మ సన్నగా తిట్టదు! ఏం చెయ్యాలి?" అని అతను దాన్ని అక్కడే, అడవి మధ్యనే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పరుగు పెట్టాడు.

అతను ఇల్లు చేరే సరికి బాగా చీకటి పడింది. సన్నమ్మ మంచి నిద్రలో ఉంది. "ఇదే చాలురా, దేవుడా" అని సమతయ్య డబ్బుల్ని పెట్టెలో దాచి ఏమీ తినకుండానే పడుకొని నిద్రపోయాడు.

మర్నాడు తెలతెలవారగానే తలుపులు చప్పుడయ్యాయి. సమతయ్య దంపతులు తలుపు తీసి చూస్తే, ఎదురుగా రాజభటులు!

"నిన్న అడవిలో వేటకు వెళ్లి అలసి పోయిన మహారాజుగారికి ఎదురుగా ఈ మంచం కనిపించిందట. రాత్రంతా హాయిగా నిద్రపోయారట! ఇది ఎవరిదో కనుక్కుని, వాళ్లకు మంచంతోపాటు ఈ వజ్రాల హారాన్నికూడా కానుకగా ఇవ్వమన్నారు!" అంటూ వాళ్ళు ఆ హారాన్ని చేతికిచ్చి మంచాన్నికూడా మర్యాదగా ఇంట్లో పెట్టి వెళ్లిపోయారు!

'మంచం మళ్ళీ వచ్చిందే' అని ఏడుపు ముఖం పెట్టిన సమతయ్యను సన్నమ్మే ఓదార్చింది. "ఈ మంచం వల్లనేకదా, మనకింత సిరి వచ్చింది?! అంటే ఇదేదో చాలా మంచి మంచమేనన్నమాట! నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. రాజులు మెచ్చిన మంచం! దీన్ని మన ఇంట్లోనే ఉంచుకుందాం!' అంది అబ్బురంగా.

సమతయ్య సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడు.