ఒకనాడు అడవిలో ఎంత తిరిగినా ఆ పులికి ఆహారం దొరకలేదు. దానికి చాలా ఆకలి వేస్తున్నది; కడుపు నకనక లాడుతున్నది.

అప్పుడది చాలా విచారిస్తూ- "అయ్యో ఇవాళ్ల ఎంత చెడ్డరోజో కదా! పట్టుపట్టి తిరిగినా ఇవాళ్ళ ఒక ముద్ద మాంసం కూడా నోటికి అందలేదే! సాయంత్రం లోపు దొరికే అవకాశం కూడా‌ పెద్దగా కనబడటం లేదు. ఇన్నాళ్లయింది- ఇంతకు మునుపు ఎప్పుడైనా మాంసం దొరకని దినమంటూ ఉన్నదా? దేవుడు ప్రతికూలిస్తే మన బలం ఎందుకూ పనికిరాదు కదా?! ఇప్పుడిక ఏమి చేయను?

ఇవాళ్ల నా కడుపులో భగభగా మండుతున్న జఠరాగ్నిని శాంతింపజేసే ఆహారం కళ్ళబడకుంటే ఊరికే ప్రాణాలు కోల్పోవాల్సివచ్చేట్టు ఉన్నది.
"మా హింస్యాద్ సర్వభూతాని- ఏ ప్రాణినీ హింసింపకుము" అని ధర్మ సూత్రాలు చెబుతున్నాయి- కానీ తన ప్రాణాలు నిలిచాకనే కదా, ఏలాంటి ధర్మ సూత్రమైనా అక్కరకు వచ్చేది?

"శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం- ధర్మ సాధనకుమొదట అవసరమయ్యేది శరీరమే" అని కూడా చెప్పి ఉన్నారు పెద్దలు. ముందు తనకు ఉంటే తర్వాత పదివేలమందికి పెట్టొచ్చు- అందుకని ధర్మాన్ని తుంగలో త్రొక్కి అయినాసరే, తన్ను తాను కాపాడుకోవాలి.

శరీరం కోసం భూమినైనా తాకట్టు పెట్టవచ్చని చెబుతారు- 'ఆత్మార్థం పృథివీం త్యజేత్ '. నా కడుపులో ఎగసిపడుతున్న ఆకలిని చల్లబరచే మార్గం దొరకకపోతే నా ప్రాణాలు ఊరికే పోయేటట్లున్నాయి. కాబట్టి ఇప్పుడు 'ధర్మ మార్గాన్ని తుంగలో తొక్కైనాసరే, తనను తాను కాపాడుకోవటమే పరమ ధర్మం'.

శరీరంకోసం భూమిని, ఆకాశాన్ని ఐనాసరే వదిలెయ్యాలి- అని నీతి వాక్యం. దాన్ని అనుసరిస్తాను! నేనిప్పుడు ఏదైనా‌ ఉపాయంతో ఈ కొంగను చంపి తింటాను-

కనీసం అట్లాగైనా నా ప్రాణం నిలబడుతుంది- నా ప్రాణం దక్కితే చాలు- తక్కిన పాపాలన్నిటినీ ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకొని పోగొట్టుకుంటాను" అనుకున్నది.

అట్లా తన ఆకలిని చల్లార్చుకోవటంకోసం స్నేహితుడి ప్రాణాలకే ఎసరు పెట్టి, అది ఓ ఉపాయం ఆలోచించింది. తలను నేల వాల్చింది- ఇదివరకటి కంటే హెచ్చు స్థాయిలో గొంతు పెంచి, గుహలు మారుమ్రోగేట్లు పెద్దగా దొంగ ఏడుపులు ఏడ్వటం మొదలుపెట్టింది.

పులి అరుపులు విని, చల్లని మనసుగల కొంగ తత్తరపడింది. దాని ప్రాణాలు కలబడ్డాయి. అంతులేని దు:ఖంతో మిత్రునికి ఏమైందోనని పరుగు పరుగున వచ్చిందక్కడికి.

వచ్చి, అది సింహంతో- "మిత్రమా! ఎందుకు ఇవాళ్ళ ఇంత కలవరపడుతున్నావు? చాలా తల్లటపడుతున్నావు కూడా. నీ మనసులో ఉన్న కష్టాన్ని నాతో‌చెప్పుకునేందుకు ఎందుకు, ఇంత సంకోచం? నేనేమైనా క్రొత్తవాడినా, నీకు? చెప్పు! నీ దు:ఖానికి కారణం‌ ఏంటో చెప్పు. నీకు ఇప్పుడు నా వల్ల ఎట్లాంటి సాయం కావాలన్నా చేస్తాను- నా ప్రాణాలైనా ఇస్తాను" అన్నది.

అప్పుడు ఆ పులి ఒకవైపున తన మనసులో ఉబ్బిపోతూనే, ముఖంలో బాధను అనుకరిస్తూ, జీరబోయిన గొంతుతో- "ఇతరులు నాకు చేసిన మేలును మరచేంత కృతఘ్నుడిని కాను. నా యీ శరీరం అంతా నువ్వు పెట్టిన చెట్టే; సందేహం లేదు. ఇప్పుడు నేను ఇట్లా బ్రతికి ఉన్నానంటే అది నీ చలవే.
మిత్రమా! గతంలో నా ప్రాణాలను కాపాడి నాకు మహోపకారం చేసావు. అలాంటి నీకు చిన్న వీసమెత్తు సాయం కూడా తిరిగి చేయలేదే అని సిగ్గుగా ఉంది నాకు.

లోకంలో ఎంతవాడైనా సరే "నేను బలవంతుడిని; నాకు ఇతరులతో ఏమి పని?!" అని విర్రవీగకూడదు. బలవంతులకు కూడా బలహీనులతో సాయం అవసరపడచ్చు. ఆనాడు నువ్వు నా ప్రాణాలు కాపాడావు; నేను బలవంతుడిని; అయినా కూడా‌ నేను నీకు తిరిగి ఎలాంటి సాయమూ చెయ్యలేదు చూడు- అలాంటి నా యీ బ్రతుకు ఎందుకు?

అయినా ఆ దేవదేవుడి మాయ ఎలాంటిదో ఎవ్వరికీ తెలియదు. ఎప్పటికీ నువ్వు చేసిన సాయమే నా కళ్లముందు కదలాడుతున్నది.
దాన్ని అట్లా ఉంచు. అయినా ఇప్పుడు మరొకమారు నీ సహాయమే కోరవలసి వస్తున్నది నాకు! చూశావా, కాల మహిమ?! ఎంత వారికైనా కాల ప్రభావంనుండి తప్పించుకోవటం సాధ్యం కాదు.

ఇప్పటి నా యీ దురవస్థ విను- ఇదివరకు లాగానే ఇప్పుడుకూడా నా పళ్ళ సందులో ఎముక ముక్క ఒకటి ఇరుక్కున్నది; ఆ బాధ భరించలేకున్నాను నేను.

నా అంతటి బలవంతుడికి మేలు చేసి కూడా నువ్వు ఇన్నాళ్ళూ నీ చిన్ని కడుపును నింపుకునేందుకు పడరాని పాట్లు పడుతూనే వస్తున్నావు- నేను ఇంతలేసి కళ్ళుపెట్టుకొని నీ కష్టాలన్నీ చూస్తూ వచ్చాను తప్పిస్తే, నీకు చిన్నపాటి సాయం కూడా‌ చెయ్యలేదు- నన్ను మన్నించు. నీ పాదాల సాక్షి- ఇకమీదట నిన్ను ఏనాడూ ఆహారంకోసం అటూ ఇటూ తిరగనివ్వను. నేటితో నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. నా మనసులోని మాటను సత్యంగా పలికాను- నన్ను నమ్ము.

స్నేహితుడికి సాయం చేయవలసిన అవసరం మరొకమారు తలెత్తింది- అందువల్ల ఇక ఆలస్యం చెయ్యకు- మిత్రరక్షణకోసం నా నోట్లోకి దూరు! నన్ను కాపాడు! నా యీ తల్లటను చల్లార్చు!" అన్నది.

అప్పుడు కొంగ సంతోషంతో‌ఉబ్బి తబ్బిబ్బైపోతూ- "స్నేహితుడా! ఇదెంతపని! దు:ఖం విడచిపెట్టు! ఇట్లాంటి కష్టాలు ప్రపంచంలో నీకొక్కడికే వస్తాయా ఏమి? విధి రాతనుండి తప్పించుకునేవాళ్ళు ఎవరున్నారు గనుక? ఇది నా చేతిలోని పనేగదా; పరాయివాడిని వేడుకున్నట్లు నన్నూ ఇంత ప్రాధేయపడాలా?

'స్నేహితుడి మనసులోని కోరికను తీర్చటంకంటే చేయదగిన పని వేరే ఏదీ లేదు' అని పెద్దలు చెబుతారు. ఇన్నాళ్లకు నా యీ జన్మ ధన్యం కానున్నది- నా పుణ్యం ఏమని చెప్పను?! చూడు, నేను క్షణంలో పీకేస్తాను ఆ ఎముకను. అయినా ఇది నీ అంత శక్తివంతులకు రావలసిన అవస్థ కాదు" అంటూ తెరచిఉన్న ఆ పులి నోట్లోకి తల దూర్చింది.

మరుక్షణం ఆ పులి చటుక్కున దాని మెడను కొరికేసి దాన్ని తినేసింది.

చూశావా, దుర్మార్గులు స్వార్థంతో ఎంత పాతకానికైనా ఒడిగడతారు. స్వీయపోషణ కోసం వాళ్ళు మిత్రద్రోహానికి కూడా వెనుదీయరు.
అందువల్ల దుష్టులు ఎంత ఇష్టంగా మాట్లాడినా వాళ్ల మాటల్ని చెవికెక్కించుకోకూడదు.

తప్పిజారి 'విన్నాము' అంటేదానివల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది.” అని చిలుక కొనసాగించింది. (మిగతాది మళ్ళీ..)