ముదిగుబ్బ గ్రామ శివార్లలో పెద్ద వేపచెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టుకింద పురాతనమైన పెద్దమ్మ దేవత గుడి. శివరాత్రి రోజున జాగారాలు అయిన తరువాత పెద్దమ్మ తల్లికి దేవరపోతును బలి ఇస్తారు. తరతరాలుగా జరుగుతున్న 'పెద్దమ్మ పరుష' దాంతో మళ్ళీ ఓ సారి మొదలవుతుంది. ఆ సమయంలో వరాలు అడగటంకోసం చాలామంది ఆడవాళ్ళు గుడిముందు నిలబడి వుంటారు. అక్కడున్నవాళ్ళు వాళ్ళ తలల మీద బిందెలతో నీళ్ళు పోస్తుంటారు.
ఎప్పటిలాగే ఓ కోడిపుంజును తీసుకొని, కూతురు వెన్నెలతో పెద్దమ్మ పరుషకు వెళ్ళాడు రాముడు. పూజారప్ప దేవర పోతును బలి ఇచ్చాక, ఎవరికి వాళ్ళు మేకల్ని, పొట్టేళ్ళను, కోళ్ళను, బలులు ఇచ్చారు. ఆ మాంసాల్ని కాల్చడానికని అక్కడే ఓ అగ్నిగుండం ఏర్పాటు చేశారు. దానిలో నిప్పులు కణకణలాడుతూ మండుతున్నాయి. అందులో వేస్తున్న మాంసాల వాసన ఆ ప్రాంతం అంతా వ్యాపించి ఉన్నది.
రాముడి కూతురు వెన్నెల అక్కడే ఓ ప్రక్కగా నిలబడింది. పరుషలో జరుగుతున్న తంతుల్ని వివరంగా గమనిస్తున్నది. అక్కడ వరాలు అడగడానికి నిలబడ్డ ఆడవాళ్ళు ఆ పాప దృష్టిని ఆకర్షించారు. ఇంతలో ఏమైందో, వాళ్లలో ఒకామె వేపమండలు చేతపట్టుకొని, పెద్దగా అరుస్తూ గంతులు వేయటం మొదలు పెట్టింది. అక్కడికి పరుగున వచ్చిన డప్పులవాళ్ళు 'జజ్జనక' అని దరువులు వేయసాగారు. ఆ దరువుల వెంబడి ఆమె ఏదో మత్తులో ఉన్నట్లు అటూ ఇటూ ఊగిపోవటం మొదలు పెట్టింది. "ఏమైంది నాన్నా, ఆమెకు?" అని అడిగింది వెన్నెల. "పెద్దమ్మ పూనింది తల్లీ! ఆమె శరీరం ఇప్పుడు పెద్దమ్మకు ఆశ్రయం అయిపోయింది. ఆమె ద్వారా పెద్దమ్మ పలుకుతుంది ఇప్పుడు" అన్నాడు రాముడు, భక్తితో కళ్ళు మూసుకుంటూ. ఆ పెద్దమ్మ పూనిన తల్లి ఇప్పుడు గబగబా నిప్పులున్న వైపుకు పరుగు పెట్టింది.
జనాలందరూ గందరగోళంగా తప్పుకున్నారు; పెద్దమ్మ తల్లికి దారి ఇచ్చారు. ఆమె పరుగున పోయి నిప్పుల్లో అటూఇటూ నడవడం మొదలు పెట్టింది! వెన్నెల నివ్వెరపోయింది. చుట్టూ ఉన్న వాళ్లంతా పెద్దమ్మ మహిమను గుర్తుచేసుకోవటం మొదలు పెట్టారు. వందలాదిమంది ఆమె కాళ్ళపై పడి మొక్కేందుకు తొక్కిసలాడారు. ఆమె కాళ్ళు దొరికించుకొని మరీ మొక్కుతున్నారు జనాలు. కొంత సేపటికి ఆమె గట్టిగా అరుస్తూ గిరగిరా తిరిగి కింద పడిపోయింది. జనాలందరూ ఆమెను పైకి లేపి, పెద్దమ్మ తల్లి విగ్రహం ఎదుట పడుకోబెట్టారు.
దాన్నంతా కన్నార్పకుండా చూసింది వెన్నెల. రాముడు ఆమె దగ్గరగానే ఉన్నాడు గానీ, ఈ లోకంలో ఉన్నట్లు లేడు. తండ్రికి తెలివి వచ్చాక, వెన్నెల అడిగింది- "నిప్పుల్లో దిగితే కాలదా, నాన్నా?!" అని.
"పెద్దమ్మ తల్లి పూనితే నిప్పులు-గిప్పులు ఏం చేయవమ్మా!" చెప్పాడు తండ్రి .
ఆ ప్రక్కనే నిలబడి వీరి సంభాషణను వింటున్నాడు 'డౌసు'. డౌసు అన్న అంటే చుట్టు ప్రక్కల వూర్లోని విద్యార్థులకు చాలా గౌరవం. వెన్నెల సందేహం తీర్చాలనుకున్నాడు డౌసు. "వెన్నెలా! ఇటురామ్మా, నీ సందేహం తీరుస్తాను" అని పిలిచాడు. వెన్నెల డౌసు దగ్గర కెళ్ళి నిలబడింది.
డౌసు చెప్పసాగాడు- "చూడమ్మా! అమాయక జనం చూస్తే భయపడతారు గానీ, నిజానికి నిప్పులలోంచి నడవటం ఏమంత కష్టం కాదు. ఇందులో ఏ మహిమా లేదు- ఉన్నది సైన్సే.
నిప్పులలోంచి నడవాలంటే ముందు కాళ్ళు బాగా కడుక్కోవాలి. నిప్పుల పైన బూడిద, రాళ్ళు, మేకులు లేకుండా చూడాలి. అట్లా అవి కణకణా మండుతున్నప్పుడు వాటిమీదినుండి గబగబా నడిస్తే- కాళ్ళు కాలవు! నిజం!
అయితే అందుకుగాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక విడతలో నిప్పులమీద కేవలం మూడు- లేదా నాలుగు అడుగులు మాత్రమే పడే విధంగా చూసుకొని నడవాలి. నిప్పులమీద నడుస్తూ ఎక్కడా ఆగిపోకూడదు- మూడు సెకన్ల కంటే ఎక్కువ సేపు కాళ్ళను నిప్పులమీద ఎక్కడా నిలపకుండా నడవాలి.
ఇందులో మహాత్యం ఏమీ లేదమ్మా, ఇది కేవలం మన చర్మానికున్న లక్షణం: శరీరాన్ని కాగడాలతో కాల్చుకున్నాకూడా, ఆ మంట మూడు సెకన్లకంటే తక్కువ సేపే గనక మన చర్మాన్ని తగిలితే, మనకు ఏమీ కాదు- మన చర్మం కాలదు. అయితే మూడు సెకన్ల కంటే ఎక్కువ సేపు ఒకే చోట కాల్చకూడదు!
దీనికి కొంత సాధన అవసరం. నువ్వు గమనించావోలేదో- ఇందాక ఒకావిడ నిప్పుల్లో నడచింది గదా, ఆమె నీళ్ళలో వరసగా తడుస్తూనే వుంది. ఆమె కాళ్ళకు బాగా బురద కూడా అంటుకుని ఉంది. ఎక్కువ తేమ, మట్టి చేరే సరికి కాళ్ళు మొద్దుబారి వున్నాయి. అదీగాక ఆమె నిప్పులమీదుగా గబగబా నడిచింది తప్పిస్తే, ఎక్కడా నిలబడలేదు. అందుకనే, ఆమె కాళ్ళు అసలు కాలలేదు. అర్థమైంది గదా, ఈ పని ఎవరైనా చేయచ్చు- పెద్దమ్మ పూనవలసిన అవసరం అసలు ఎంతమాత్రమూ లేదు!" అన్నాడు గట్టిగా.
డౌసు చెబుతుంటే చుట్టూ ఉన్నవాళ్ళు వింతగా విన్నారు. 'ఎవరు వీడు, పెద్దమ్మనే అవమానిస్తున్నాడు' అన్నట్లు అపనమ్మకంగా చూశారు. వాళ్ళలో ఒకడు వెన్నెల కంటే ముందు అడిగాడు- "ఊరికే చెప్పటం కాదు డౌసూ, చేతనైతే నువ్వూ నిప్పుల్లోంచి నడిచి చూపించు! పెద్దమ్మ తల్లి దయ లేకుండానువ్వు నిప్పుల్లోంచి ఎలా బయటికొస్తావో మేమూ చూస్తాంగా?!" అన్నాడు.
అంతే- మరుక్షణం ఎవరూ ఊహించని విధంగా డౌసు నిప్పుల దగ్గరికి వెళ్ళాడు. బక్కెట్టులో నీళ్ళు కాళ్లమీద కుమ్మరించుకున్నాడు. నవ్వుతూ నిప్పుల్లోంచి నడచి వెళ్ళాడు! చుట్టూ చేరినవాళ్లకు నోట మాట రాలేదు.
డౌసు నిప్పుల్లోంచి నడిచి బయటికి రాగానే జనాలందరూ అతని చుట్టుతా మూగారు. అతని కాళ్ళను పరీక్షించారు. "నిజంగా నడవొచ్చా, మేమూనూ?" అని అడిగారు. "ఓఁ, ఎవరైనా నడవచ్చు. ఇది సైన్సే! మహిమ కాదు" అన్నాడు డౌసు.
అక్కడే నిలబడి డౌసు చెబుతున్నదంతా వింటున్న మరొక అతను ముందుకు వెళ్ళాడు. కాళ్ళమీద నీళ్ళు కుమ్మరించుకొని, ధైర్యంగా నిప్పులమీదినుండి నడిచి వచ్చాడు! అతన్ని చూసి మరొకళ్ళు..మళ్ళీ ఒకళ్ళు! అందరూ ఎవరికి వాళ్ళు డౌసు చెప్పిన రహస్యాన్ని పరీక్షించి చూసుకున్నారు.
జనం అందర్నీ మెచ్చుకుంటూ చప్పట్లుచరిచారు. రాముడు మాత్రం వెన్నెల వెనక నిలబడి, ఆ పాప నిప్పులలోకి పోకుండా పట్టుకున్నాడు! "కంగ్రాట్స్ అన్నయ్యా! భలే రహస్యం చెప్పావు ఈ రోజు!" అంది వెన్నెల డౌసును మెచ్చుకుంటూ.