రామయ్య అనే రైతు దగ్గర ఒక ఆవు ఒక మేక ఉండేవి. మేక ఎప్పుడూ చురుకుగా, తన పని తను చేసుకుంటూ ఉండేది. ఆవు బద్ధకంగా, 'ఎవరైనా ఎప్పుడూ తనకు గడ్డి తెచ్చిపెడితే బాగుండును కదా' అనుకుంటూ‌ ఉండేది. అయితే మేకకు ఒక్కతే మేత మేయటం ఇష్టం ఉండదు కదా, అందుకని ఏదో ఒక మాయ చేసి రోజూ ఆవుని కూడా తన వెంట తీసుకెళ్తూ ఉండేది. అయినా పెద్దగా ప్రయోజనం‌ ఉండేది కాదు- నాలుగడుగులు వేయగానే ఆవు ఆగిపోయేది- "ఇంక చాలు బాబూ! ఇక్కడ ఏది దొరికితే అది మెయ్యి! నేను ఇంటికెళ్ళాక తింటానులే!" అనేది.

ఒక సారి, రామయ్యకు పొరుగూరిలో ఏదో పని పడింది. "సాయంత్రానికి ఎలాగూ వస్తాలే" అనుకొని, ఆవునీ మేకనీ వదిలేసి, తను ఊరికి బయలుదేరి పోయాడు. అక్కడక్కడే తిరుగుతున్న ఆ రెండిటికీ ఒక గుర్రం ఎదురైంది. "చూస్తే మీరు చాలా మంచివాళ్ళలాగున్నారు. నేనూ మంచివాడినే. మనం స్నేహం చేద్దామా?" అని అడిగిందది.

"ఓ సరే! ఇప్పుటినుండీ మన ముగ్గురం స్నేహితులం" అంది మేక.

మేక, గుర్రం చురుకుగా అక్కడున్న గడ్డినంతా తిన్నాయి. ఆవు మాత్రం ఏమీ తినకుండా ఊరికే పడుకున్నది.

"రా! తిను! గడ్డి పర్వాలేదులే, బానే ఉంది!" అంది గుర్రం.

"లేదు. నేను ఇంటికెళ్ళాక తింటాను" అంది ఆవు.

"ఇక్కడే తినచ్చుగా, మాతోబాటు?" అని గుర్రం ఎంత చెప్పినా అది వినలేదు.

"నాకు ఇంటికెళ్ళాక తినటమే అలవాటు" అని చెప్పి తప్పించుకున్నది.

ఆ రోజు ఇంటికెళ్ళే సరికి ఇంట్లో ఎవరూ లేరు- రాత్రైనా ఆవుకి మేత దొరకనే లేదు. సాయంత్రానికే వద్దామనుకున్న రామయ్యకు పని పూర్తి కాక, మరొక రోజు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది మరి!

మరునాడు తెల్లవారే సరికి ఆవుకి నీరసం ముంచుకొచ్చింది. అయినా అది కదిలేటట్లు, సొంతగా మేత మేసేటట్లు కనబడలేదు.

మేక ఈ సంగతి చెప్పే సరికి గుర్రం - "ఎవరినైనా సరే ఒకసారి బద్ధకంపట్టుకున్నదంటే ఊరికే వదలదు- చాలా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇవాళ్ల మనం ఏదో ఒక మాయ చేసి, ఆవు సొంతగా మేత మేసేట్లు చేద్దాం" అన్నది.

అటుపైన అది ఆవుకి వినబడేట్లు మేకతో- "మిత్రమా! మన ఊళ్ళో అదిగో- ఆ పెద్ద కొండ ఉంది గదా," అన్నది- "ఆ కొండ దగ్గర చాలమంచి మేత ఉందట! అది మనకి మాత్రమే తెలిసింది- వేరే ఎవ్వరికి తెలియదు! అందుకని మనం ఇప్పుడు ఆ కొండ దగ్గరకు వెళ్ళి మేసి వద్దాం" అన్నది.

దాని పధకం అర్థం చేసుకున్న మేక "భలే భలే! ఇవాళ్ల మా యజమాని ఎలాగూ ఊళ్ళో లేడు! పోయి వద్దాం పద! కడుపునిండా పచ్చగడ్డి తిని ఎన్ని రోజులైందో" అన్నది.

అయితే ఆవుకి బద్ధకం కదా! అది అన్నది- "నేను రానులే, మీరే నాకు కూడా కొంచెం గడ్డి తెచ్చి పెట్టండి. ఇవాళ్ల నాకు కొంచెం నీరసంగా ఉన్నది " అన్నది.

మేకకు ఏం చెప్పాలో తెలీలేదుగానీ, గుర్రం అన్నది- "అట్లా కుదరదమ్మా! మేం నీకు గడ్డి తెస్తే‌, మరి మా పిల్లలకు ఎవ్వరు తెచ్చిపెడతారు? మాకు ఆకలిగా ఉంది- నువ్వు వస్తే రా, లేకపోతే మేము ఇద్దరమే పోతాం మరి!" అని మేకను బయలుదేరదీసింది.

వెంటనే ఆవు కూడా లేచి నిలబడింది- "సరే! నేను కూడా వస్తాను! మరి ఆ ప్రదేశం దగ్గరలోనే ఉందిగా? ఏమంత దూరం కాదుగా?" అని అడిగింది. మేక , గుర్రం అన్నాయి- "అదిగో, ఆ కొండే! ఇక్కడే!" అని.

ఆవు బద్ధకంతో మెల్లగా నడవసాగింది. దానికి ఆకలౌతున్నది మరి! చూడగా దానికి సరిపడేంత గడ్డి దగ్గర్లో ఎక్కడా కనబడలేదు. అందుకని అది లేని శక్తిని కూడగట్టుకొని ఎలాగో ఒకలాగ కొండ వరకు నడిచింది.

"ఇంకా ఎంత దూరం?" అని అడిగిందది, గుర్రాన్ని.

"ఇదిగో, ఈ కొండేగా?! మీరు రండి నా వెనకనే" అంది గుర్రం గబగబా కొండ ఎక్కేస్తూ.

"అబ్బ! ఈ గుర్రం ఎంత చురుకైనదో, చూడు! ఎంత చక్కగా కొండ ఎక్కుతున్నదో!" అన్నది మేక.

"దానిదేముందిలే, మనం మాత్రం చురుకుగా ఎక్కటం లేదూ?" అంది ఆవు, కొంచెం తెచ్చిపెట్టుకున్న పట్టుదలతో.

ఆవు పట్టుదల, మేక ప్రోత్సాహం రెండూ కలిసి వాటిని కొండలో నాలుగో వంతు వరకూ ఎక్కించాయి. ఆసరికి ఆవు పట్టుదల సడలిపోయింది. "ఇంక నేను నడవలేనమ్మా! నాకు ఇక్కడికే తెచ్చివ్వు ఆ గడ్డేదో" అని అక్కడే కూలబడ్డది. "ఆ గుర్రం ఎక్కగా లేనిది మనం ఎక్కలేమా? మన పరువు ఏం కావాలి? నువ్వు ఎక్కగలవులే, ఊరికే వెనకంజ వేయకు!" అని ప్రోత్సహించింది మేక.

"సరేలే కానివ్వు" అని ఆవు కొండ సగం వరకూ ఎక్కి కూల బడింది. "ఇంక నావల్ల కాదు- నేను ఎక్కలేను" అన్నది.

మేక అన్నది- "చూడు, ఇప్పుడు మనం సగం వరకు ఎక్కాం. మనతోపాటు వచ్చిన గుర్రం కొండను పూర్తిగా ఎక్కేసింది చూడు, హాయిగా మేతమేస్తున్నది పైన" అని ఆశపెట్టించింది మేక. పైన పచ్చ గడ్డి దగ్గర్లోనే ఉందన్న ఆశతో‌ఆవు మూడు వంతుల కొండను ఎక్కేసి, అక్కడ కూలబడింది.

"చూడు, మూడు వంతుల కొండని ఎలాగూ ఎక్కనే ఎక్కాం. ఇప్పుడు ఇంక ఖాళీ కడుపుతో కిందకు వెళ్ళటం కంటే కళ్ళు మూసుకొని ఆ కొంచెం కొండా ఎక్కటమే మంచిది. ఒక్కదానివే ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు?" అన్నది మేక గడుసుగా.

ఇట్లా ఆవు కొంచెం దూరం నడవటమూ, 'నేనూ నడవలేను' అని కూలబడటమూ, మేక ఓర్పుతో 'ఇంకొంత దూరం మాత్రమే' అని చెప్పటమూ, పైనుండి గుర్రం 'తొందరగారండి' అని పిలవటమూ- దీంతో ఆవు చివరికి ఎలాగో కొండనెక్కేసింది!

ఆ మరునాడు కూడా రామయ్య ఊరికి రాలేదు! పచ్చగడ్డి ఆలోచనతోటే ఆవుకి నోట్లో నీళ్ళు ఊరాయి. అది గుర్రం, మేకల వెంట ఉత్సాహంగా బయలుదేరి వచ్చింది- ఈరోజున అది దారి మధ్యలో అస్సలు సణగనే లేదు! మిగిలిన రెంటితోపాటు చకచకా కొండనెక్కేసింది!

మరునాడు రామయ్య వచ్చాక, దానికి మళ్ళీ ఓసారి అనుమానం వచ్చింది- "తను కొండనెక్కగలదా?" అని.

"నువ్వు తలచుకుంటే ఏ పనినైనా చెయ్యగలవు" అని మేక, గుర్రం నమ్మబలికాక, అది నవ్వుతూ "సరే, పదండి ఏం చేస్తాం?! పచ్చిగడ్డి కావాలంటే కొండనెక్కాల్సిందే మరి!" అని ముందుండి కొండకు దారితీసింది!

దానిలో మార్పును గమనించి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు.