బుద్ధుడు ఇంకా జీవించి ఉన్న సమయంలో శ్రావస్తీ నగరంలో సుదత్తుడు అనే పెద్ద వ్యాపారి ఒకడు ఉండేవాడు. ఆ సమయంలో బుద్ధుని ఖ్యాతి దేశపు నలుమూలలా మారు- మ్రోగుతూ ఉండేది. స్వతహాగా మంచివాడు, దానశీలి అయిన సుదత్తుడు కూడా ఆయన బోధనలు విని, ఆయన పట్ల ఆకర్షితుడైనాడు.
సుదత్తుడికి "అనాధపిండకుడు " అని పేరు ఉండేది. 'నా' అన్నవాళ్లు లేని అనేకమందికి దయతో జీవనాధారాలు, భోజన సదుపాయాలు కల్పించటం వల్ల అతనికి ఆ పేరు కలిగింది. అట్లాంటి అనాధ పిండకుడికి ఒకసారి తెలిసింది- బుద్ధభగవానుడు శ్రావస్తి పరిసరాల్లోనే ఉన్నాడు. తను ఆహ్వానిస్తే శ్రావస్తికి కూడా రావచ్చ!
వెంటనే అతను బయలుదేరి వెళ్లి బుద్ధుడిని తమ నగరానికి రావలసిందిగా ఆహ్వానించి వచ్చాడు. ఆ సమయంలో బుద్ధుని వెంట 1,250 మంది బిక్షువులు కూడా ఉండేవాళ్లు. వాళ్లందరూ కూడా బుద్ధుడు ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉండేవాళ్లు. వీళ్లంతా శ్రావస్తిలో బసచేసేందుకు తగినంత పెద్ద స్థలం కావల్సి ఉండింది. అంతేకాక బుద్ధుడి ప్రవచనాలు వినేందుకు లక్షలాది మంది సాధారణ ప్రజలు కూడా రావచ్చును- ఆ స్థలం వారందికీ సరిపోవాలి!
మరి, భిక్షువులు అందరికీ సౌకర్యంగా ఉండాలంటే, అది జనసమ్మర్దం ఉన్న ప్రదేశంలో ఉండకూడదు. అట్లా అని జనవాసాలకు దూరంగా కూడా ఉండకూడదు- అందరూ వచ్చి వెళ్లాలి గదా!
'అట్లాంటి చక్కని ప్రదేశం ఏది ?' అని వెతికాడు అనాధపిండకుడు. ఊరి చివరలో ఉన్న 'జేతవనం' అన్ని రకాలుగాను సరిపోతుంది ' అనిపించింది. నిండుగా రకరకాల పండ్ల చెట్లు కళకళలాడే జేతవనంలో భగవానుడికి కావలసినంత నీడ కూడా లభిస్తుంది! అయితే సమస్యల్లా, ఆ వనం శ్రావస్తీ నగర రాజకుమారుడు జేతుడి ఉద్యానవనం- దానిలోకి అందరికీ ప్రవేశం ఉండదు!
అనాధపిండకుడు ఈ విషయమై జేతుడిని కలిసి, "నీ జేతవనం కొనేస్తాను, అమ్ముతావా? ఎంత ధరకు?" అని అడిగేశాడు. జేతుడికి ఉద్యానవనాలు అమ్మవలసిన అవసరం లేదు. అదీగాక అతను రాజకుమారుడు- భావి రాజు కూడాను! అట్లాంటి వాడు, ఊరికే ఉద్యానాలు ఎందుకు అమ్ముతాడు? "లేదు లేదు! అసలు అమ్మేది లేదు " అన్నాడు జేతుడు. కానీ అనాధపిండకుడు పట్టువిడువక, "ఏదో , నేను కొంటానన్నాను కదా, అమ్మితే నీకేమి? ఎంత డబ్బు కావాలో చెప్పు! ఎంత ఇమ్మన్నా ఇస్తాను" అన్నాడు జేతుడితో.
"ఓహా! ఎంత ఇమ్మన్నా ఇస్తావా?" అన్నాడు జేతుడు వెటకారంగా.
"ఇస్తాను, నువ్వు అడిగి చూడు!" అన్నాడు అనాథపిండకుడు.
"జేతవనంలో ఎంత భాగం మీదకి నువ్వు బంగారం పరచగలవో చూడు. ఎంత భాగంలో బంగారం పరిస్తే అంత నేలను నీకిస్తాను" అన్నాడు జేతుడు, నవ్వుతూ, ఎగతాళిగా.
అనాథపిండకుడు నవ్వలేదు.
"ఏంటి, బాధపడుతున్నావా? కోపపడకు. నాకు ఆ వనాన్ని అమ్ముదామని లేదు అసలు!" అన్నాడు జేతుడు నవ్వుతూ.
"కాదు- 'ఏ గోదాములో ఉన్న బంగారం తెప్పించాలా' అని ఆలోచిస్తున్నాను" అన్నాడు అనాధపిండకుడు.
మరునాడు, జేత రాకుమారుడు వ్యాహ్యాళికి వెళ్లేసరికి అక్కడ వందలాది బళ్లలో బంగారం వచ్చి ఉన్నది. పనివాళ్లు వనమంతటా బంగారం పరుస్తున్నారు! ఇంకా ఇంకా బళ్లు వస్తున్నాయి, నిండా బంగారంతో! ఖాళీ అయినవి తిరిగి పోతున్నాయి! చివరికి తోటలోని నేల మొత్తం బంగారంతో కప్పబడింది. పండ్ల చెట్లు నిలచి ఉన్న స్థలాల్లో తప్పిస్తే, మిగతా తోటలో నేల అన్నది కనబడకుండా అయ్యింది!
తను నవ్వులాటకి అన్న మాటని అనాథపిండకుడు అంత గట్టిగా తీసుకునే సరికి జేతుడికి ఆశ్చర్యం వేసింది. దాంతో బాటు "ఈ బుద్ధుడెవరో, నిజంగా అసాధారణమైన వ్యక్తి అయిఉండాలి. లేకపోతే ఎవరైనా నేలను బంగారంతో కొలిచి ఎందుకు కొంటారు? అలా కొన్నదాన్ని అతనికి దానంగా ఎందుకు ఇచ్చేస్తారు?' అనిపించింది అతనికి.
తరువాత బుద్ధుడిని కనులారా చూసి, ఆయన చెప్పిన సంగతులు విన్నాక, అనాధపిండకుడు తను కొన్న స్థలాన్నంతా బుద్ధ సంఘానికి దానం చేసినప్పుడు, జేతుడు తన వంతుగా చెట్ల మొదళ్లున్న స్థలాన్ని బుద్ధుడికి ఇచ్చేశాడు.
అటు తర్వాత ఆ వనంలో బుద్ధుడు పంథొమ్మిది వర్షాకాలాలు గడిపాడు. తన జీవితంలో అధిక భాగం ప్రవచనాలను బుద్ధుడు ఈ వనం నుండే ఇచ్చినట్లు తెలుస్తున్నది.
జేత - అనాథపిండకులిద్దరూ పూర్తిగా నిస్వార్థంగా, పరిపూర్ణ హృదయాలతో దానం చేయటం వల్లనే ఆ వనానికి అంతటి సౌభాగ్యం కలిగిందని చెబుతారు.