రామాపురంలో వ్యవసాయం చేసుకునే కృష్ణయ్యకు ఇద్దరు కొడుకులు- సోము, రాము. ఇద్దరినీ అల్లారుముద్దుగా పెంచాడు కృష్ణయ్య. "నేను ఎలాగూ చదవలేదు; కనీసం వీళ్లన్నా బాగా చదివితే, అంతే చాలు" అని తపనపడేవాడు అతను.
రాము రోజూ బడికి వెళ్ళేవాడు; అయ్యవార్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేవాడు; చక్కగా నేర్చుకొని అందరి మన్ననలను పొందేవాడు. సోము తరచు బడికి ఎగనామం పెట్టేవాడు; అల్లరి చిల్లరిగా తిరిగి, బడి ముగిసే వేళకు ఇంటికి తిరిగి వచ్చేవాడు. అయితే నిజం ఏమిటో రాము ద్వారా తెలిసేది కదా, తండ్రి ఎప్పుడూ సోమును మందలిస్తూ ఉండేవాడు. "మేరెప్పుడూ నన్నే తిడతారు. రాముని మాత్రం ఏమీ అనరు" అని కుళ్ళేవాడు తప్పిస్తే, సోము మటుకు తన దారిని మార్చుకునేవాడు కాదు.
అంతలో "దసరా సెలవుల్ని మీ ఊరిలో గడపదలచుకున్నాం. నేనూ సురేషూ ఇద్దరం వస్తున్నాం" అని హైదరాబాద్లో ఉన్న శంకరం బాబాయి ఉత్తరం రాశాడు. శంకరం బాబాయి తెలుగు పండితుడు. ఆయనంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. రాము సోములు కూడా బాబాయి రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసారు.
చూస్తూండగానే బాబాయీ, సురేష్, ఇద్దరూ రామాపురం చేరుకున్నారు. తన వెంట తెచ్చిన ఆటవస్తువులను , బొమ్మల పుస్తకాలను ఇస్తూ 'ఎలా చదువుతున్నార్రా?' అని అడిగాడు బాబాయి.
"బాగా చదువుతున్నాను బాబాయ్!" చెప్పాడు రాము.
సోము ఏమీ జవాబివ్వకుండా దాటవేశాడు. చురుకైన బాబాయి ఆ సంగతిని గమనించాడు. "ఏంటి వీడి కథ?" అని కృష్ణయ్యను అడిగాడు వేరుగా.
"ఏం చెప్పమంటావురా, వీడు బడిని ఎగగొట్టి ఎక్కడెక్కడోతిరుగుతున్నాడు. ఏం చెప్పినా వినడు!" తమ్ముడితో బాధని వెలిబుచ్చాడు కృష్ణయ్య.
"నేను చూస్తానులే, వాడిని నువ్వు ఏమీ అనకు కొన్నాళ్ళు" అని శంకరం అన్నను సముదాయించాడు. ఆ రోజునుండీ శంకరం బాబాయి సోముని జాగ్రత్తగా గమనించటం మొదలు పెట్టాడు.
సోము కూడా చురుకైనవాడే. బాబాయి చెప్పే పద్యాలను రాము ఎంత వేగంగా నేర్చేసుకునేవాడో, సోము కూడా అంతే వేగంగా నేర్చుకునేవాడు. అయితే అలా నేర్చుకున్న పద్యాలను రాయమంటే మటుకు వాడు ముడుచుకు పోతాడు! అక్కడినుండి తప్పించుకొని దూరం పోయేందుకు ప్రయత్నిస్తాడు!
"ఎందుకురా, నీకు రాయటం అంటే ఇష్టం ఉండదా?" అడిగాడు బాబాయి సోముని.
"ఉహుఁ. రాస్తే చేతులు నొప్పులు పుడతాయి. అసలు ఎందుకు, రాసేది?!" అన్నాడు సోము.
బాబాయికి సోము సమస్య అర్థమైంది. "వీడికి రాయటమంటే ఇష్టం లేదు. ఈ సమస్యను మాటలతో పరిష్కరించటం కుదరదు..."
మరునాడు బాబాయి తన సంచీలోంచి కొత్తపల్లి పుస్తకం తీసి చదువుకోవటం మొదలు పెట్టాడు. "ఏంటి బాబాయ్! అంత శ్రద్ధగా చదువుతున్నావ్?" అంటూ దగ్గరికొచ్చిన సోము కొత్తపల్లిలో బొమ్మల్ని చూసి ముచ్చటపడ్డాడు. అందులో తనకు నచ్చిన కథనొకదాన్ని వాడికి చదివి వినిపించాడు బాబాయ్- "ఇదిగో సోమూ! కొత్తపల్లిలో సగం కథలు పిల్లలు రాసినవే- కావాలంటే నువ్వూ ఓ కథ రాసి పంపచ్చు. ఇందులో అచ్చైతే నీ కథని ఎంతమంది పిల్లలు చదువుతారో! కథతోబాటు నీ ఫొటో కూడా అచ్చు వేస్తారు వాళ్ళు!" సోముని ఊరించేందుకు ప్రయత్నించాడు బాబాయి.
సోము ఉత్సాహం చూపలేదు. అంతలో అక్కడికొచ్చిన సురేశ్ కొత్తపల్లిని చూడగానే ఎగిరి గంతేశాడు- "పోయిన సారిది ఉందా, అందులో నేను రాసి పంపిన కథ ఉంది!" అరిచినంత పని చేశాడు. "అవునా! నీ కథ అచ్చైందా?" ఆశ్చర్యంగా అరిచాడు రాము. ఇద్దరూ ఆ సంచికను వెతుక్కునేందుకు పరుగు పెట్టారు.
బాబాయి సోముకేసి చూశాడు. వాడు రాము, సురేష్ వెళ్ళినవైపుకే చూస్తున్నాడు..! బాబాయి తన చేతిలో ఉన్న కొత్తపల్లి పుస్తకాన్ని అక్కడే వదిలేసి పనిపడ్డట్లు బయటికి వెళ్ళాడు. కొంతసేపటికి వచ్చి చూస్తే అక్కడ కొత్తపల్లీ లేదు; సోము కూడాలేడు!
ఆరోజు రాత్రి బాబాయి పడుకోబోతుండగా సోము బాబాయి దగ్గరకొచ్చి మెల్లగా అడిగాడు- "నేనేదైనా కథ రాస్తే కొత్తపల్లి వాళ్ళు దాన్ని అచ్చు వేస్తారా?" అని.
"ఓ! మా చక్కగా వేస్తారు. ఎందుకెయ్యరు?!" అన్నాడు బాబాయి, నిద్రకు ఉపక్రమిస్తూ.
తెల్లవారి బాబాయి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా సురేష్ నిలబడి ఉన్నాడు. వాడి ముఖం వెలిగి పోతున్నది- చేతిలో వాడు క్రొత్తగా రాసిన ఓ కథ, గజిబిజిగా గాలికి అటూ ఇటూ కదులుతున్నది!
"ఎవరికీ చెప్పకు! దీన్ని కొత్తపల్లి వాళ్ళకు పంపించు! వాళ్ళకిది నచ్చుతుందో నచ్చదో..చూడు" అన్నాడు వాడు గుసగుసగా.
బాబాయి కథ చదివి చూశాడు- నిజంగానే అద్భుతమైన కథ! సోము ఇంత చక్కని కథ రాయగలడని ఆనాటివరకూ ఎవ్వరికీ తెలీనే తెలీలేదు! ఆ తర్వాత కొత్తపల్లిలో వరసగా మూడు నెలల పాటు ప్రతినెలా సోము రాసిన కథలు ప్రచురితమయ్యాయి.
"ఒరేయ్! నీ కథ కొత్తపల్లిలో వచ్చింది! నువ్వే రాసావా దీన్ని!? నిజంగా?!" అని ఇంట్లోవాళ్ళందరూ గందరగోళ పడ్డారు. ఆ హడావిడిలో ఎవ్వరూ గమనించనే లేదు- సోము ఇప్పుడు బడిని ఎగగొట్టటం లేదు! అర్థ వార్షిక పరీక్షల్లోను, వార్షిక పరీక్షల్లోను వాడికి చాలా మంచి మార్కులు-ఎన్నడూ రానన్ని మార్కులు- వచ్చాయి.
"ఒరేయ్! ఇదేంటిరా, ఇట్లా చదివేస్తున్నావు!" అని బళ్ళో టీచర్లందరూ ముచ్చటపడుతున్నారిప్పుడు. సోము కొత్తపల్లికి కథల మీద కథలు రాసి పంపిస్తున్నాడు.
వేసవి సెలవుల్లో మళ్ళీ రామాపురం వచ్చిన బాబాయి చేతులు పట్టుకొని కృష్ణయ్య-"భలే మాయ చేసావురా! రాయిలాంటి మా సోము నీవల్ల ఇప్పుడు రత్నంగా మారాడు" అన్నాడు.
"కాదు. వాడు ముందునుండీ రత్నమే. 'చదువులు అర్థవంతంగా ఉండాలి' అనేది అందుకనేరా, అన్నయ్యా. 'ఎందుకు చదవాలి, ఎందుకు రాయాలి' అనేది పిల్లలకు ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉండాలి.
సోము చాలా చురుకైనవాడసలు. అయితే వాడికి రాయటం ఎందుకో అర్థంకాలేదు. అందుకనే వాడు మొదట్లో అట్లా ఉండిపోయాడు. కథల పుణ్యమా అని, వాడికి ఇప్పుడు రాయటం ఎందుకో అర్థమైంది- అంతే తేడా!" అన్నాడు బాబాయి, తనూ సంతోషపడుతూ.