రావులపాలెంలో ఉండే చంద్రయ్య చాలా వింత మనిషి . అతనికి ఐదు ఆవులు ఉండేవి. అయినా అతను మాత్రం వాటి ఆలనా పాలనా పట్టించుకునేవాడు కాడు. భర్తను ఏమీ అనలేని లక్ష్మమ్మ ఇరుగు పొరుగుల్ని ప్రాధేయపడి, వాళ్ల పొలాల నుండి రోజూ కాస్తంత గడ్డి తెచ్చి వేసి ఎలాగో ఒకలాగా ఆవుల్ని సాకేది. వాటి పాలు అమ్ముకుంటే వచ్చిన డబ్బులతోటే కుటుంబం గడిచేది.
అయినా చంద్రయ్య మాత్రం ఏ పనీ చేయకుండా "నేను అదృష్టజాతకుడిని , ఏదో ఒకనాటికి నాకు కాలం కలిసొస్తుంది. అకస్మాత్తుగా నేను ధనవంతుడినైపోతానట- చూస్తూండండి. అందుకేగద, నేను ఇలా నిశ్చింతగా ఉంటున్నది!" అని అందరితో చెప్పుకుంటూ తిరిగేవాడు.
ఒకసారి చంద్రయ్యను చూసి పోయేందుకు వాళ్ళింటికి వచ్చాడు శివరాం. శివరాం చంద్రయ్యకు చిన్ననాటి మిత్రుడు. చంద్రయ్య పద్ధతిని గమనించిన శివరాం అతన్ని చాలాసేపు మెచ్చుకొని, "చూడగా నువ్వనే అదృష్టం ఏదో నీ తలుపు తట్టే రోజు దగ్గరలోనే ఉన్నట్లుంది. ఏమైందో తెలుసా? -ఈ మధ్యే ఒక యోగిని సంప్రదించాను, నీ గురించి. ఆయనకూడా అదే చెప్పాడు- కోరిన కోరికలన్నిటినీ తీర్చే కామధేనువు ఈసారి మన ఊరి ప్రక్క అడవిలోకే రానున్నదట. ఈ దసరా నుండి సంక్రాంతిలోపలే ఏదో ఒక రోజున వస్తుందట అది! ఆవు కాబట్టి, అది కూడా సహజంగానే అడవిలో ఆవులు మేసే చోటికి వస్తుంది. ఆ ఆవుల్ని మేపుతూ, వాటికి సేవ చేస్తూ కన్పించిన వ్యక్తిని ఆశీర్వదించి పోతుందట అది. నిజంగానే నీలాంటి అదృష్టజాతకులకు మంచి అవకాశం!" అన్నాడు.
అది విన్నాక చంద్రయ్యకు ఎక్కడలేని ఉత్సాహమూ వచ్చింది. ఇక ఆగలేకపోయాడు. ఆరోజునుండీ ఆవుల్ని తనే అడవికి తోలుకెళ్ళటం మొదలుపెట్టాడు. కామధేనువు మంచి పచ్చిగడ్డి ఉండే ప్రదేశాలకు వస్తుంది కాబట్టి, తను ఆవుల్ని అలాంటి ప్రదేశాల్లో తిప్పాడు. ఆ ఆవుల్ని కొట్టకుండా, తిట్టకుండా ప్రేమగా పలకరించుకుంటూ సేవలు చేయసాగాడు.
ఆవులకు కడుపునిండా మేత దొరకటం, పట్టించుకునేవాళ్ళు కనబడటంతో అవి ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. దాంతో ఇంటి ఆదాయమూ పెరిగింది; "చంద్రయ్య ఆవుల్ని ప్రేమగా చూసుకుంటాడు" అని చుట్టుపక్కలవాళ్ళు కూడా కొందరు తమ ఆవుల్ని చంద్రయ్యకు అప్పగించారు.
ఎట్లాగూ అడవికి పోతున్నాడు కనక, ఇంట్లో వంటకు కావల్సిన పుల్లలను, కట్టెలను ఏరుకొచ్చేవాడు చంద్రయ్య. అప్పుడప్పుడూ కుంకుడుకాయలు, చింతపండు లాంటివి కూడా తెచ్చేవాడు. కొంచెం ఊపిరి పీల్చుకున్న లక్ష్మమ్మ తమ పొలంలో ప్రాణం పెట్టటమే కాక, వేరేవాళ్ళపొలాల్లోకూడా పనికి ఒప్పుకోవటం మొదలు పెట్టింది. ఇంకేముంది, సంక్రాంతి పండుగ వచ్చేసరికి వాళ్ల ఇల్లు ధనధాన్యాలతో కళకళలాడింది.
పండగరోజు చంద్రయ్య ఇంటికి వచ్చాడు శివరాం. "నీకు అదృష్టం కలిసి వచ్చినట్లుంది గద, చంద్రయ్యా! ఇంట్లో సంతోషమూ, తృప్తీ బాగా కనిపిస్తున్నై" అన్నాడు కొంచెం జాగ్రత్తగా, కామధేనువు సంగతి అతనికి గుర్తుకొస్తుందేమోనని భయపడుతూ.
"ఏం చెప్పను శివరాం, నువ్వు చెప్పాక ఎంత వెతికినా నాకు మాత్రం కామధేనువు కనిపించలేదు. అయితే ఎలా పడిందో గాని, దాని దృష్టి పడిందనుకుంటాను నామీద- నిజంగానే నా మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాయి. నేను ప్రయోజకుడినయ్యాను. కామధేనువు కటాక్షం వల్లనే కావొచ్చు, నాకు నీలాంటి మంచి మిత్రుడి సలహా దొరికింది!" అని శివరాంని మెచ్చుకున్నాడు చంద్రయ్య, సిగ్గుగా నవ్వుతూ.