అనగా అనగా చాలా కాలం క్రితం గ్రీకు దేశంలో ప్లాటో అనే ఒక పెద్ద గురువుగారు ఉండేవారు. చాలామంది రాజులూ, చక్రవర్తులూ సైతం ఆయన జ్ఞానం ముందు తలవంచేవాళ్ళు. ఖగోళ శాస్త్రం, సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, తత్వశాస్త్రం- ఒకటేమిటి, అన్ని శాస్త్రాల్లోనూ దిట్ట, ఆయన. ఆయన మాట అంటే అక్కడి రాజుగారికి వేదవాక్కులాగా ఉండేది.
బాగాతిని, కూర్చొని దీర్ఘంగా ఆలోచించి చాలా విలువైన నిర్ణయాలు వెలువరిస్తూ ఉండేవాడాయన. భూస్వాములూ, చిన్న చిన్న రాజులూ ఆయన ఆలోచనల్ని అమలు పరచటమే తప్ప, ఎదురు తిరిగి ప్రశ్నించటం అనేదే ఉండేది కాదు.
ఆయనకు ఒకసారి ఒక ఐడియా వచ్చింది: ప్రపంచంలో చాలా అసమానతలు ఉన్నై. కొందరు ధనికులు, కొందరు పేదలు. ధనికులు వాళ్ల పిల్లల్ని చాలా బాగానే పెంచుతున్నారు. వాళ్లకు దేశాభిమానమూ, నైతిక విలువలూఅన్నీనేర్పుతున్నారు. కానీ, పేదవాళ్ళు? వాళ్ల పిల్లలకు దేశప్రేమా ఉండట్లేదు; నీతి నియమాలూ ఉండట్లేదు. వాళ్లంతా రోగిష్టులూ, పోకిరీలూ అయిపోతున్నారు. అందుకని, పిల్లలందర్నీ రాజే పెంచితే బాగుంటుంది- అంటే రాజుగారు ఏరి కోరి ఎంపిక చేసిపెట్టిన మేధావి వర్గమే అందరు పిల్లల్నీ మలచే బాధ్యత స్వీకరిస్తుందన్నమాట. ఈమేధావి వర్గంవాళ్ళు దేశంలో పుట్టిన పిల్లలందర్నీ వాళ్ల తల్లిదండ్రులకు దూరంగా, రాజుగారు అప్పటికే గొప్పగా నిర్మించి పెట్టిన కలల ప్రపంచంలోకి ఎత్తుకెళ్ళిపోతారు. పిల్లల్ని ఒకసారి ఇట్లా కుటుంబాల పరిధిలోంచి తప్పించేశాక, వాళ్లకు మనం ఏవి కావాలనుకుంటే అవి నూరిపోయవచ్చు; వాళ్లందరూ గొప్ప పౌరులయ్యేట్లు శిక్షణనివ్వచ్చు. పేదవాళ్ళు బాగుపడటంకోసం ధనికులు ఈమాత్రంత్యాగంచెయ్యవలసిందే- తమ పిల్లల్నీ రాజుగారి బడికి పంపించాల్సిందే. అక్కడ పిల్లలందర్నీ ఒకేలాగా చూస్తారు కనుక, వాళ్లలో తేడాలుండవు. అందరూ కలిసి మానవ సమాజంకోసం శ్రమిస్తారు.
అయితే రాజుగారు అట్లాంటి పని మొదలు పెట్టేసరికి ఏమై ఉంటుందో ఊహించుకోవటం సులభం. గందరగోళమైంది! పిల్లలందరూ కలవరపడిపోయారు; ఎదురు తిరిగారు, తల్లిదండ్రులు గొడవ చేశారు; రాజ్యమంతా అల్లకల్లోలం అయ్యింది; అంతా జరిగాక గురువుగారి నోరు మూతపడింది. లోకం మళ్ళీ మామూలుగా తన దారిన తను నడవటం మొదలు పెట్టింది.
పిల్లలు మైనపు బొమ్మలు కారు. వాళ్లని ఇష్టం వచ్చినట్లు మలచిపారెయ్యటం వీలవదు. ప్రతి పిల్లవాడిలోనూ, ప్రతి పాపలోనూ తనదైన ఆత్మ ఒకటి ఉంటుంది. స్వీయమైన ఆ ఆత్మ ఎదిగే క్రమం కూడాఒకటి ఉంటుంది. చదువు నేర్పించే వాతావరణం ఆ క్రమానికి దగ్గరగా ఉంటే, పిల్లలు అందులో ఇమిడిపోయి, ఆ ధారలో ప్రవహిస్తూ, ఆ ధారకే క్రొత్త రంగులు అద్దుతూ, సంతోషంగా ఎదుగుతారు. అట్లా ఎదిగిన పిల్లల్లో చైతన్యం ఉంటుంది. శాస్త్ర విజ్ఞాన రంగాల్లో గానీ, కృషియాంత్రిక రంగాల్లోగానీ, కళల్లో గానీ- తాము దేన్ని ఎంచుకుంటే ఆ రంగంలోకి ఆ చైతన్యాన్ని జొప్పిస్తారు వాళ్ళు. అలా వాళ్ళు ఎదుగుతూ, ఆయా రంగాల్నీ రాణింపజేస్తారు.
ఈ భావనని ఇలా ఊరికే చెప్పటం కాకుండా, 'ఇది నిజంగా కావాల్సిందే' అని చేసి చూపించింది, మేరియా మాంటిసోరీ. ఇటలీ దేశానికి చెందిన ఈ డాక్టరమ్మ, పిల్లల్ని 'అర్థం చేసుకోవాలి' అని నొక్కి చెప్పిన గొప్ప మనిషి. జనవరి తొమ్మిదిన ఆవిడ మొదలుపెట్టిన 'కాసా ద బాంబిని'- పిల్లల ఇల్లు, ఈ నూరు పై చిలుకు సంవత్సరాల్లో చాలా పెద్దదే అయ్యింది. ఆవిడకు, ఆవిడ కట్టిన ఆ పొదరింటిని మరింత గుబాళింపజేసేందుకు ప్రయత్నిస్తున్న వాళ్లకు అందరికీ నమస్కారాలు.
ఈ 2012 పిల్లలందరికీ సంతోషాన్ని, చైతన్య దీప్తిని అందించాలని ఆకాంక్షిస్తూ, కొత్తపల్లి బృందం.