అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చుట్టూ చెట్టూ, చేమా, పొలమూ పుట్రా ఉన్నాయి. ఆ పొలాల మధ్యలోంచే వూళ్ళోకి వచ్చే పోయే దారి వుంది. ఆ దారి వేరే వూళ్ళకు పోయే దారులను కలుపుతుంది. అలా కలిసే కూడల్లో మనుషులు ఒకరికొకరు ఎదురవుతారు. పలకరించుకుంటారు. ఒకరి పొడ ఒకరికి గిట్టకపోతే ముఖాలు తిప్పుకొని ఎవరిదారిన వాళ్ళు పోతూ వుంటారు.

అది మనుషుల కథ. మామూలు కథ.

మరి మనుషులకు వేరే జీవులు ఎదురయితే ఏమవుతుందో, ఇదే ఇంకో కథ. అవాళ-

మనిషి, పాము ఒకరికొకరు ఎదురయిపోయారు.

'అమ్మో విషప్పురుగు. దాని కోరల్లో విషం..' అని భయంతో ఆగిపోయాడు మనిషి.

'అమ్మో విషప్పురుగు. మనకు కోరల్లోనే విషం. మనుషులకు నిలువెల్లా విషమే..' అని భయంతో ఆగిపోయింది పాము.

ఇద్దరూ అలాగే రెండు క్షణాలసేపు ఒకరివంక ఒకరు చూస్తూ వుండిపోయారు.

మనిషి వెనక్కి తగ్గుదామనుకున్నాడు. అడుగు తీసి అడుగు వెనక్కి వేద్దామనుకున్నాడు. కానీ పాము వెంట పడితే..? వెంటపడి కాటేస్తే..?' ఆలోచనలతో ఆగిపోయాడు.

పాముకూడా వెనక్కి తగ్గుదామనుకుంది. జరజరా వెనక్కి వెళ్ళిపోదామనే అనుకుంది. కానీ మనిషి వెంటపడితే..? వెంటపడి కొడితే..?' ఆలోచనలతో ఆగిపోయింది.

'నన్ను కాటెయ్యద్దు..'భయం భయంగా అనుకున్నాడు మనిషి.

'నన్ను కొట్టొద్దు..' భయం‌ భయంగా అనుకుంది పాము.

ఒకరి మాటలు ఒకరికి వినిపించలేదు.

'నా దారిన నన్ను పోనీ..' భయంతోనే నిల్చున్నాడు మనిషి.

'నీ దారిన నువ్వు పో..' భయంతోనే చుట్టుకుని వుంది పాము.

మనిషి భయపడుతూనే అడుగు వెనక్కి తీసాడు.

పాము భయపడుతూనే పడగను దించింది.

వాతావరణం ప్రశాంతంగా మారింది. గాలి వీచింది. ఆ అలికిడికి ఇరువుతూ ఉలిక్కి పడ్డారు. భయం పెరిగి అలజడీ, ఆందోళనా ఎక్కువయిపోతోంది.

ఒకరికొకరు హాని చేస్తారన్న భయమే ఇద్దరిలోనూ!

ఆ భయంతోనే బుస్సుమంటూ‌పాము పడగెత్తి లేచింది.

ఆ భయంతోనే రయ్ మంటూ‌మనిషి కర్ర తీసాడు.

ముప్పు ముంచుకొచ్చింది.

ఎప్పటిలాగే మనిషి పాము కాటుకి నురగలు కక్కి చావలేదు.

ఎప్పటిలాగే పాము మనిషి చేతిలో దెబ్బలు తినేసి చావలేదు.

ఒక్క క్షణం రెండు పక్షాలు అలాగే నిలబడ్డాక- పాము పడగ దించి పక్కకు పాక్కుంటూ పోయింది.

మనిషి కర్రదించి తనదారిన తానూ పోయాడు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక- ఎవరి వల్ల ఎవరికీ‌ హాని లేదన్నది తెలిసాక- భయం పోయింది. బతుకు మిగిలింది!