అనగనగా అనంతపురంలో రాజారావు అనే రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు అన్నయ్య, చిన్నవాడు చిన్నయ్య. రాజారావుకు పెద్దగా ఆస్తులేమీ లేవు. 'తమ తర్వాత పిల్లలు ఎలా బ్రతుకుతారు?' అని రాజారావు భార్య ఆందోళన పడుతూ ఉండేది. అయితే 'పిల్లలిద్దరూ తెలివైనవాళ్ళే. ఎట్లాగో వాళ్ల పొట్ట వాళ్ళు పోసుకొని బ్రతుకుతారులే' అని నచ్చజెబుతుండేవాడు రాజారావు.

ఒక రోజున అతను పిల్లలిద్దరినీ పిల్చి "నాయనా, మాకు ఓపిక ఉన్నంత కాలం మిమ్మల్ని పెంచాం. ఇక మా వల్ల కాదు. మీరు ఎలాగైనా కష్టపడి, నీతిగా బ్రతకండి. ఇదిగో మన ఆస్తంతా ఈ ఒక్క ఆవే. దీన్ని తీసుకొని వెళ్లండి మీరు. ఎలా బ్రతుక్కుంటారో బ్రతుక్కోండి. ఒక సంవత్సరం పాటు మీకిది పరీక్ష అనుకోండి. సొంతగా జీవించటం మరీ కష్టమనిపిస్తే వెనక్కి తిరిగి వచ్చెయ్యండి. మళ్ళీ అందరం ఆలోచిద్దాం" అని చెప్పి పంపాడు. "సరేలే నాన్నా! మేం కూడా పెద్దవాళ్లమయ్యాం, మా కాళ్లమీద మేము నిలబడి చూపిస్తాం" అని ఆవును తీసుకొని బయలుదేరారు ఇద్దరూ.

అట్లా ఇద్దరూ నడుస్తూ పోతూ ఉంటే రెండు దారుల కూడలి ఒకటి వచ్చింది. అన్న అన్నాడు "తమ్ముడూ, మన దగ్గరున్నది ఈ ఒక్క ఆవే. దీన్ని అమ్మితే డబ్బులువస్తాయి, వాటిని మనం ఇద్దరం‌ పంచుకోవచ్చు. కానీ డబ్బులు ఖర్చు అయిపోవచ్చు. ఆ తర్వాత మనకు మన ఆవూ దక్కదు. అందుకని నువ్వు ఈ‌ఆవును తీసుకొని ఇటువైపు వెళ్ళు. నీకు నచ్చిన ఊళ్ళో దీన్ని పెట్టుకొని బ్రతుకు. ఆవుని నమ్మి చెడినవాడు లేడు. నువ్వు జీవితంలో పైకి వస్తావు. నేను రెండో దారిలో వెళ్తాను. నా తెలివితేటల్ని ఉపయోగించి బ్రతుకుతాను. ఒక సంవత్సరం తర్వాత మనం‌ మళ్ళీ కలుద్దాం. అప్పటికి ఎవరు ఎలా ఉంటారో చూద్దాం" అని.

తమ్ముడికి అది నచ్చలేదుకానీ, అన్న గట్టిగా చెబితే కాదనలేక, 'సరే' అన్నాడు.

తమ్ముడు ఆవుని తీసుకొని వెళ్ళి తనకు ఎదురైన మొదటి ఊళ్లో చేరుకున్నాడు. ఆవు పాలు పోసి, ఆ వచ్చిన డబ్బుతో జీవించటం మొదలు పెట్టాడు. కొంతకాలం జీవితం బాగానే గడిచింది, కానీ అకస్మాత్తుగా ఆ ఆవుకి ఏదో తెలీని జబ్బు చేసి చచ్చిపోయింది. చిన్నవాడు చాలా బాధపడ్డాడు- కానీ చేసేదేమున్నది? ఆ ఆవుని అడవిలోకి తీసుకెళ్ళి, దాన్ని కోసి, చర్మాన్ని ఒలిచి, ఎండేందుకని దాన్ని ఒక చెట్టు మీద పరచి పెట్టాడు . ఇలా ఒక వారం గడిచింది. ఆ చర్మం బాగా ఎండి ఉంది.

ఆరోజు అమావాస్య. చిమ్మ చీకట్లో కొందరు దొంగలు అదే చెట్టు క్రిందికి చేరుకున్నారు. అందరూ తాము తెచ్చిన బంగారు నాణాలను, నగలను అక్కడ పరచి పంచుకోవటంలో మునిగారు. అంతలో సన్నగా వాన మొదలైంది. టప టప రాలే చినుకులు చెట్టు మీదున్న చర్మం మీద పడటం మొదలు పెట్టాయి. తోలు ఎండి ఉన్నది కదా, ఒక్కో చినుకూ పడ్డప్పుడు 'ఢం!‌ఢం!" అని శబ్దం చేస్తున్నది. ఆ శబ్దానికి దొంగలు బెదిరి పోయారు. చెట్టు మీద ఎవరో‌ కూర్చున్నారు అనుకున్నారు. వాళ్ళు ఊళ్ళో వాళ్ళని పిలిచేందుకు పైనుండి డప్పు వాయిస్తున్నారు అనుకున్నారు.

తమ సంపాదనను అంతా అక్కడే విడిచేసి ఎటువాళ్ళు అటు పరుగెత్తారు!

ఉదయం తమ్ముడు తోలుకోసం అడవికి వెళ్ళి చూస్తే ఏముంది? చెట్టు క్రింద కుప్పలు కుప్పలుగా బంగారం! తమ్ముడు దానినంతా ఎత్తుకొని ఇంటికి వచ్చాడు. నాలుగు ఆవులు కొన్నాడు. మళ్ళీ పాలవ్యాపారం‌ మొదలు పెట్టి వృద్ధిలోకి వచ్చేసాడు.

ఇక రెండో దారిన వెళ్తున్న పెద్దవాడికి దారిలో‌ ఏడుస్తూ పోతున్న చిన్న పిల్లవాడొకడు ఎదురయ్యాడు. అటువైపు దగ్గర్లో జనాలు ఉండే ప్రదేశాలే ఏమీ లేవు- వీడు ఎక్కడినుండి వస్తున్నాడా, అని ఆ పిల్లవాడిని పలకరించాడు అన్న. వాడు ఎవరో గొప్పవాళ్ళ పిల్లడే; దారి తప్పాడు. అన్న వాడిని బుజ్జగించి, తన వెంట ముందుకు తీసుకెళ్ళాడు. అక్కడ వాడికి తినేందుకు ఏవో చిన్న చిన్న వస్తువులు కొనిపెట్టి, వాడి తల్లిదండ్రులెవరా అని ఆలోచించాడు.

అంతలో వాడికొక పెద్ద బట్టల దుకాణం కనబడింది. అన్న అక్కడికి వెళ్ళి "అయ్యా! నేను మీ దుకాణంలో బట్టల్ని తీసుకెళ్ళి చిన్న దుకాణాల్లో అమ్మి పెడతాను. అందుకు గాను నాకు మీకు తోచినంత మొత్తం ఇద్దురు" అన్నాడు ఆ దుకాణపు యజమానితో. "ఇస్తాం, కానీ‌ నిన్ను ఎట్లా నమ్మేది?" అన్నాడు దుకాణపు యజమాని.

అన్న అప్పుడు తనవెంట ఉన్న పిల్లవాడిని చూపించి వాడు తనకు ఎలా దొరికిందీ చెప్పాడు దుకాణపు ఆయనకు- "అయ్యా! మీరు నాకు ఈ ఒక్కసారికీ అవకాశం ఇచ్చి చూడండి. నేను దుకాణాల్లో సరుకు అమ్మటంతోబాటు ఈ బాబు తల్లిదండ్రులెవరో కూడా‌ విచారించి వస్తాను. నన్ను నమ్మండి. అంతవరకూఈ పిల్లవాడిని కూడా మీ దుకాణంలోనే ఉండనివ్వండి" అని బ్రతిమాలాడు.

దుకాణపు యజమాని పిల్లవాడి మొఖం ఒకసారి చూసి, సరే అన్నాడు. అన్నయ్య దుకాణంలో తనకి నచ్చిన చీరలు కొన్ని తీసుకొని, వాటిని వేరు వేరు చిన్న దుకాణాల్లో అమ్ముకొని వచ్చాడు. ఆ క్రమంలోనే అతనికి పిల్లవాడి తల్లిదండ్రులూ ఎదురయ్యారు! ఆ పిల్లవాడి నాన్న కూడా బట్టల వ్యాపారే, ఏదో తిరునాళ్లకెళ్ళి వెనక్కి వస్తుండగా పిల్లవాడు తప్పిపోయాడు. ఇది జరిగినప్పటినుండీ పిల్లవాడి తల్లి ఏకధాటిగా ఏడుస్తున్నది! ఆ వ్యాపారి వెంటనే అన్నయ్య వెంట వచ్చాడు. తమ పిల్లవాడు భద్రంగా ఉండటం చూసి అతన్ని చాలా మెచ్చుకున్నాడు. అతనికి బట్టలమ్మటంలో చాకచక్యం ఉన్నదని కనిపెట్టి, అతన్ని తనవెంట తీసుకెళ్ళి తన దుకాణంలో పని కూడా‌ ఇచ్చాడు!

అలా నమ్మకంగా పనికి కుదురుకున్న అన్నయ్య తన తెలివితేటలతో యజమానికి మంచి సలహాలనిస్తూ అతని వ్యాపారాన్ని చాలా వృద్ధిలోకి తెచ్చాడు. ఒక సంవత్సర కాలంలో వాళ్ల దుకాణం పెద్దదైపోయింది. అతని పట్ల కృతజ్ఞతతో యజమాని ఆ వ్యాపారంలో అతనికీ ఒక వాటా ఇచ్చాడు! సంవత్సరం పూర్తయ్యే సమయానికి అన్న, తమ్ముడు ఇద్దరూ ఊరు చేరుకున్నారు. వాళ్ళు జీవితంలో నిలదొక్కుకున్నారని చూసి తల్లి,తండ్రి ఎంతగానో సంతోష పడ్డారు. "చూశావా! 'పిల్లలు ఎలా నెగ్గుకొస్తారు' అని కంగారు పడ్డావు. వాళ్ల రెక్కల బలం మీద వాళ్ళు ఎంత బాగా బ్రతుకుతున్నారో చూడు!" అన్నాడు రాజారావు భార్యతో.