రాము చాలా తెలివైన పిల్లవాడు. తను చదివేది నాలుగో తరగతే; కానీ పదో క్లాసు పుస్తకాల్ని కూడా అవలీలగా చదివేస్తాడు. వాడి స్నేహితులు, ఉపాధ్యాయులు వాడిని 'తెలివిగల రాము' అంటుంటారు. రాము వాళ్ళ నాన్న గోపాలం గ్రామ పంచాయితీ సర్పంచి. ఊళ్ళో పెద్ద మనిషి కావటంతో‌ ఆయన రకరకాల వివాదాలను పరిష్కరించాల్సి వస్తుండేది. కొన్ని సార్లు తను పరిష్కరించలేని సమస్య ఏదైనా వస్తే రాముని సాయం అడిగేవారు గోపాలంగారు. అట్లాంటప్పుడు రాము తన తెలివినంతా ఉపయోగించి ఆ సమస్యలకు సమాధానం వెతికేవాడు.

ఒకసారి అట్లాంటి చిక్కు సమస్య ఒకటి వచ్చిపడింది గోపాలం గారికి. ఆరోజున రంగయ్య, సూరయ్య ఇద్దరూ‌ గొడవ పెట్టుకొని, పరిష్కారం కోసం గోపాలం గారి దగ్గరికి వచ్చారు. "ఏమయిందయ్యా" అని ఆయన అడిగితే రంగయ్య చెప్పాడు- "వారం రోజుల క్రితం నేను నా కుటుంబంతో కలిసి మా అన్నయ్య వాళ్ల ఊరికి వెళ్ళాను. మాకొక ఆవు ఉన్నది. మేమంటే వెళ్తాం గానీ, మా ఆవుని బస్సులో తీసుకుపోలేం కదా?! అందుకని నా స్నేహితుడు సూరయ్య దగ్గర ఉంచాను, ఆవును. తిరిగి వచ్చాక నా ఆవుని ఇవ్వమని అడిగితే "అది నాదే" అంటున్నాడు సూరయ్య. దయచేసి మీరే న్యాయం చెయ్యాలి" అని.

"కాదండీ, ఊరికి వెళ్ళొస్తానంటే 'సరే వెళ్ళి రమ్మ'న్నాను. నాకేం తెలుసు, నా ఆవు మీద వీడి కన్ను పడిందని? ఇన్నాళ్ళ తర్వాత వెనక్కి తిరిగి వచ్చాడు, మా ఆవుని పట్టుకొని తనదంటున్నాడు. నా ఆవు వాడిది ఎట్లా అవుతుంది? మీరే చెప్పండి" అన్నాడు సూరయ్య.

గోపాలంగారికి ఏం చెయ్యాలో తోచలేదు. వాళ్ళిద్దరినీ రకరకాలుగా ప్రశ్నించి చూశాడు. ఏమీ తేలేటట్లు కనబడలేదు. రాము ఏమైనా చెబుతాడేమో చూద్దామని సమస్యను రాముకు అప్పగించారు.

రాము కళ్ళు మూసుకున్నాడు. కొంచెంసేపటికి రంగయ్యను దగ్గరికి పిలిచి, "మీ ఆవును మీరు ఏమని పిలుస్తారు?" అని అడిగాడు.

"నేను దాన్ని 'శివుడూ' అని పిలుస్తాను" చెప్పాడు రంగయ్య. తర్వాత సూరయ్యని పిలిచి అడిగితే "నేను దాన్ని 'కోటీ' అని పిలుస్తాను" అన్నాడు అతను. దాంతో రాముకి పరిష్కారమార్గం దొరికినట్లయింది!

వెంటనే ఆవుని చావడికి రప్పించాడు రాము. చుట్టూ అందరూ గుండ్రంగా నిలబడి ఉన్నారు- మధ్యలో ఆవు నిలబడి దిక్కులు చూస్తున్నది బెరుకుగా.

"కోటీ! ఇటు చూడమ్మా! సూరయ్య నిజం చెబుతున్నాడామ్మా, చెప్పు?!" అడిగాడు రాము, ఆవునే చూస్తూ. ఆవు చప్పుడు చేయలేదు. "ఓయ్,శివుడూ!" నువ్వు చెప్పు!" అన్నాడు రాము ఈసారి. 'శివుడూ' అన్న పేరు వినగానే ఆవు రాము కేసి చూసి రెప్పలార్పింది.

చెవులాడించింది. మెళ్లో గంటలు గణగణలాడేట్లు తల ఊపి, ఓ అడుగు ముందుకి వేసింది!

దాంతో అక్కడ చేరినవాళ్ళందరికీ అర్థమైపోయింది- నేరం ఎవరిదో. మరుక్షణం సూరయ్యకూడా తన తప్పు ఒప్పుకొని ఆవును రంగయ్యకు అప్పగించాడు. అందరూ రాము తెలివిని మెచ్చుకున్నారు. గోపాలంగారు నవ్వేసి, సూరయ్యను గట్టిగా మందలించి వదిలేశారు.

అయితేనేమి, పాడి ఆవుమీది ఆశతో స్నేహితుడినే మోసం చేసిన సూరయ్య ఆ తర్వాత ఇక ఊళ్ళో తలెత్తుకు తిరగలేకపోయాడు. చివరికి అతను ఆ ఊరిని విడిచి పెట్టి పోవలసి వచ్చింది!