తిరుమల కొండకి దాపున కొన్ని చిన్న గ్రామాలు దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఆ గ్రామాల మధ్య చిన్న కొండలు, పొదలూ ఉన్నాయి.
ఆ గ్రామాల్లో ఉండే పిల్లలందరూ చింతపల్లి బడికి వస్తారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ చదువుల్లో మునిగిపోతారు. మధ్యాహ్న భోజనం తర్వాత రకరకాల కార్యక్రమాలను చేస్తుంటారు. కొంతమంది బొమ్మలు గీస్తుంటారు. కొంతమంది చెక్కతో వస్తువులు చెక్కుతుంటారు. మరి కొందరు కాగితాలతో చెట్లు, పువ్వులు, జంతువులు తయారు చేస్తుంటారు. శని ఆది వారాలు స్కూలుకి సెలవు.
ప్రతి శనివారం నాడూ పిల్లలందరూ గాలిపటాలు తయారు చేసుకుని వాళ్ళ వాళ్ళ ఊర్ల నుంచే ఎగరవేస్తారు. గాలిపటాల పైన కాగితాలతో అందంగా వాళ్ళ పేరు, ఏదో ఒక పలకరింపు సందేశం రాస్తారు. అలా సందేశాలు పంపుకుంటూ, ఎవరి గాలిపటం అందరికంటే ఎత్తుకు ఎగిరిందో చూస్తూ ఆ రోజంతా సరదాగా గడుపుతారు.
ఆ గ్రామాలన్నిటికీ పెద్ద లక్ష్మయ్య గారు. వాళ్ల అబ్బాయి కార్తీక్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఆసారి ఆరు నెలల పరీక్షలలో కార్తీక్‌కు తక్కువ మార్కులు వచ్చాయి. తెలుగులో అయితే ఫెయిలే అయిపోయాడు. సరిగ్గా శనివారం రోజు గాలిపటం ఎగరవేయడానికి వెళ్తున్న కార్తీక్‌ను పిలిచి లక్ష్మయ్య గారు చీవాట్లు పెట్టారు. ఈ బడి మాన్పించేస్తామన్నారు. తొమ్మిది, పది తరగతులకు తిరుపతిలోని ప్రైవేటు స్కూల్లో చేర్పిస్తామన్నారు. కార్తీక్‌కు కోపం, చిరాకు కలిగాయి. తన గాలిపటాన్ని తీసుకుని విసురుగా బయటకి వెళ్ళిపోయాడు.
రకరకాల సందేశాలున్న గాలిపటాలు పైన ఎగురుతున్నాయి. కార్తీక్ కూడా గాలిపటాన్ని గాలిలోకి వదిలాడు. జెల్లావారిపల్లి వంశీ గాలిపటం అన్నిటికన్నా పైన ఎగురుతున్నది. కార్తీక్ మెల్లగా దారాన్ని వదులుతూ వంశీ గాలిపటం కంటే ఎక్కువ ఎత్తుకు పంపించాడు తన గాలిపటాన్ని.
అయితే ఈలోగా ఎక్కడి నుండి వచ్చిందో, ఒక తెల్ల గాలిపటం- పైన- పైపైన- అన్నిటికంటే ఎత్తున- ఎగరసాగింది. అది ఎవరిదో తెలియటంలేదు... దాని మీద పేరు కాని, సందేశం కానీ ఏమీ లేవు.
వెంటనే కార్తీక్ తన గాలిపటాన్ని కిందికి దించాడు. దాని మీద "సమావేశం " అనే సందేశం రాసి మళ్ళీ పైకి ఎగరేశాడు. దాన్ని చూసిన పిల్లలందరూ తమ తమ గాలిపటాలని కిందకు తెచ్చి స్కూలుకి దగ్గరగా ఉన్న బండ మీద సమావేశమయ్యారు. కానీ ఎత్తుగా ఎగురుతున్న తెల్ల గాలిపటం మాత్రం కిందకు రాలేదు. అది అలాగే ఎగురుతోంది ఇంకా... అది ఎవరిదో మరి, ఎవ్వరికీ తెలీలేదు.
'నిబంధనలకు వ్యతిరేకంగా ఎగురుతున్నది ఆ గాలిపటం. దాన్ని కిందకు దింపాలి. అది ఎవరిదో చూడాలి' అని సమావేశం నిర్ణయించింది.
వెంటనే పిల్లలందరూ ఇసుకను చిన్న చిన్న మూటలుగా కట్టారు. ఆ మూటలను తాళ్ళకి ముడి వేసారు. పైన ఎగురుతున్న గాలిపటం దారం పైకి విసిరారు వాటిని. ఎలాగో ఒకలాగా గాలిపటాన్ని కింద పడవేశారు.
అటుపైన అందరూ నిశ్శబ్దంగా అటు వైపుకి నడిచారు. దూరంగా పడి ఉంది గాలిపటం. అందరూ చేరుకున్నారు అక్కడికి. ఆ గాలిపటం అబ్బాయి కోసం ఎదురు చూడసాగారు.
మెల్లగా అడుగుల చప్పుడు వినవచ్చింది. దారాన్ని కండెకు చుట్టుకుంటూ వచ్చాడు ఒక 10-12 ఏళ్ళ పిల్లాడు. వాడు వీళ్ళ మీదికి తగాదాకు వస్తాడనుకున్నారు పిల్లలందరూ. కానీ ఆ పిల్లాడు వాళ్ళ ఉనికినే గమనించినట్లు లేడు- దారాన్ని చుట్టుకుని, వంగి గాలిపటాన్ని తీసుకోబోయాడు-
ఉదయం నుంచి చిరాగ్గా ఉన్నాడు కార్తీక్. దానికి తోడు 'ఇంత చిన్న పిల్లాడు గాలిపటాన్ని తనకంటే ఎక్కువ ఎత్తుకు ఎగరేశాడని' అసూయ. కోపంగా అరిచాడు కార్తీక్- "ఏయ్! పేరు రాయకుండానే గాలిపటాన్ని ఎగురవేస్తావా? నా సందేశానికి కూడా సమాధానం ఇవ్వలేదేమి?" అని. వెంటనే ముందుకి దూకి, గాలిపటాన్ని కాలితో తొక్కి పట్టి, ఆ పిల్లాడి భుజాన్ని గట్టిగా పట్టుకున్నాడు.
ఆ అబ్బాయి ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా కళ్ళెత్తి కార్తీక్ వైపు చూశాడు...ఆ పిల్లవాడికి కళ్ళు లేవు- వాడు గుడ్డివాడు!
మరుక్షణం కార్తీక్ అతన్ని వదిలేసి లేచి నిలబడ్డాడు. కోపం, చిరాకు ఎటు పోయాయో, వాటి స్థానంలో సిగ్గు, అపరాధ భావన చోటు చేసుకున్నాయి. మిగిలిన పిల్లలందరూ ఆ పిల్లవాడి చుట్టూ గుమి-గూడారు. అతని వివరాలు అడిగారు.
ఆ బాబు పేరు పరమేశ్వర. చిట్టడవిలో ఉన్న చెంచుల గూడెం వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు. తిరుపతిలో ఫ్యాక్టరీలో వాళ్ళ నాన్న కూలిపని చేసేవాడు. చిన్నప్పుడు బాబు కళ్ళు బాగానే ఉన్నాయి. కళ్ళల్లో చిన్న చిన్న పువ్వులుగా తెల్లని మచ్చలు ఏర్పడి ఈ మధ్య పూర్తిగా గుడ్డివాడయిపోయాడు.
డాక్టరు దగ్గరకు తీసుకువెళితే ఆపరేషన్ చేయాలన్నారు. వాళ్ళ నాన్న అంత డబ్బు ఎక్కడ నుండి తేగలడు? ఇప్పుడు వాళ్ళ నాన్న పని చేసే ఫ్యాక్టరీ కూడా మూతపడింది. అందుకే రెండు రోజుల క్రితం వాళ్ళ అమ్మమ్మ గారి ఊరికి వచ్చారు- ఇక్కడ ఏదైనా పని చేసుకుని బ్రతుకుదామని.
పిల్లలందరూ బాబుని అతని ఇంటి వరకూ వెళ్ళి వదిలి పెట్టి వచ్చారు. ఆ సోమవారం పరమేశ్వర స్కూల్లో చేరాడు. అతడు గాలిపటాన్ని పైపైకి ఎలా ఎగరవేయగలడో అందరికీ ఎప్పుడూ ఆశ్చర్యమే!
సంవత్సరాంతం పరీక్షలు దగ్గర పడటంతో అందరూ మళ్ళీ చదువుల మీద పడ్డారు. లక్ష్మయ్య గారు కార్తీక్‌ను దగ్గర కూర్చోపెట్టుకుని "కార్తీక్! పరీక్షలు బాగా రాయి. మార్కులు బాగా వస్తేనే నీకు తిరుపతిలో సీటు దొరికేది " అన్నాడు.
"ఆ స్కూల్లో ఫీజు ఎంత నాన్నా?" అని అడిగాడు కార్తీక్ .
" రెండేళ్ళకీ కలిపి రెండు, మూడు లక్షల దాకా అవ్వొచ్చు! ఖర్చు ఎంతయితేనేం ? అక్కడ ఎక్కువ క్లాసులు పెట్టి పదవ తరగతిలో మంచి రాంక్ వచ్చేట్లు చదివిస్తారు" అన్నాడు లక్ష్మయ్య.
"నాన్నా! ఆ డబ్బుతో పరమేశ్వర కళ్ళకి ఆపరేషన్ చేయించు. నేను మా నారాయణయ్య సార్ దగ్గర ఎక్కువ క్లాసులు తీసుకుని పదవ తరగతిలో ర్యాంకు తెచ్చుకుంటాను" అన్నాడు కార్తీక్ స్థిరమైన కంఠంతో.
లక్ష్మయ్యకి నోట మాట రాలేదు. తన కొడుకు ఎంతో ఎదిగిపోయినట్లుగా అనిపించింది ఆయనకు. త్వరలోనే పరమేశ్వరకు ఆపరేషన్ జరిగింది. వాడు ఇప్పుడు చక్కగా చూడగలుగుతున్నాడు.
తర్వాతి సంవత్సరం కార్తీక్ తన మాట నిలుపుకున్నాడు. పదవ తరగతిలో స్టేటు ర్యాంకు తెచ్చుకున్న కార్తీక్‌ను లక్ష్మయ్య అక్కున చేర్చుకున్నాడు.