అనగా అనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకొక మంత్రి. ఆ మంత్రి గారికి దేవుడంటే చాలా నమ్మకం ఉండేది. ప్రపంచంలో ఏం జరిగినా 'ఆ భగవంతుడే అట్లా చేయించాడు' అనుకునేవాడు. అందుకని , ఆయనకు ఎవరు, ఎట్లాంటి వార్త చెప్పినా, "అవునవును- చాలా మేలు జరిగింది. అది మన మంచికే; ఎందుకంటే చెడ్డదైతే దాన్ని దేవుడు అసలు జరగనిచ్చేవాడే కాదు!" అనేవాడు.

మంత్రిగారిచ్చే ఇట్లాంటి జవాబులు చాలా కాలం పాటు బాగానే నప్పాయి- ఏమంటే ఆయన చుట్టూ ఎందుకనో, ఎప్పుడూ అదృష్టమే నెలకొని ఉండేది- దురదృష్టం ఎప్పుడోగానీ ఆయన తలుపు తట్టేది కాదు. అయితే ఒక రోజున ఆయన నిజంగా కష్టాల ఊచిలో చిక్కుకున్నాడు!

ఆరోజున రాజుగారు పొరుగురాజు మీద యుద్ధానికి వెళ్లారు. ఆ యుద్ధంలో ఆయన చిటికెన వేలు ఒకటి తెగిపోయింది. అయితేనేమి, ఆ యుద్ధంలో చివరికి గెలుపు ఆయనదే అయ్యింది. అందరూ ఉత్సాహంగా రాజధానికి తిరిగి వచ్చారు. అటుపైన తనూ, తన సైన్యమూ ఎంత గొప్పగా యుద్ధం చేసిందీ వివరించి చెబుతున్నారాయన, మంత్రిగారికి.

ఆ సమయంలో ఆ రాజుగారు తన చెయ్యి పైకెత్తి చూపిస్తూ - "అయితే ఇన్ని సంతోషాల నడుమ ఒక్క చిన్న దురదృష్టపు సంఘటన కూడా జరిగింది. శత్రురాజుతో భయంకరమైన ఖడ్గయుద్ధం చేస్తున్నపుడు నా చిటికెనవేలు పూర్తిగా తెగిపోయింది. చూడండి!" అన్నాడు. మంత్రిగారు రాజుగారి వేలును శ్రద్ధగా పరిశీలిస్తూ - "ఇది కూడా మన మంచికేలెండి. ఇలా వేలు తెగిమంచిదే అయ్యింది. లేకపోతే దేవుడు ఇట్లా ఎందుకు అవ్వనిస్తాడు?" అన్నాడు.

రాజుగారికి చాలా అవమానం‌ జరిగినట్లనిపించింది. విపరీతమైన కోపం వచ్చింది. తన వేలు పోయిందని బాధపడే బదులు, ఈ మంత్రి సంతోషపడటం నిజంగా సాహసమే. "ఇలాంటి దుస్సాహసికి శిక్ష తప్పదు- ఇతనిక నగరంలో ఉండేందుకు వీలులేదు. అడవి అంచున ఒక గుడిసె వేసుకొని నివసించాలి. ఇదే అతనికి తగిన శిక్ష!" అన్నాడు కఠినంగా. మంత్రిగారు 'కాదు' అనలేదు. "దైవేచ్ఛ! ఆయన ఎలా అంటే అలాగే" అని నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు.

ఇట్లా కొద్ది నెలలు గడిచాయి. తర్వాత ఒకరోజున రాజుగారు వేటాడడం కోసం అడవికివెళ్లారు. అక్కడ ఆయనకొక దుప్పి కనబడింది. రాజుగారు దాని వెంటబడ్డారు. అది తప్పించుకొని పరుగెత్తుతూ పోయింది. రాజుగారొక్కరే దాని వెంటపడి తరిమారు. అయితే అప్పటికే సాయంకాలం అయ్యింది; పైగా అవి అమావాస్య రోజులు! అడవంతా చీకటి క్రమ్ముకున్నది.

ఇక చేసేదేమీ లేక రాజుగారు కొన్ని కట్టెల్నీ, కొంచెం గడ్డీ - గాదాన్ని ప్రోగుచేసి, దగ్గర్లోనే ఉన్న మర్రిచెట్టు మీద ఒక మంచెను తయారు చేసుకొని దానిమీద పడుకున్నారు. అలసి పోయి ఉన్నారేమో, బాగా నిద్రపట్టింది. ఆయన నిద్ర లేచేసరికి అప్పుడే తెలవారుతున్నది. చూసుకుంటే ఏముంది? ఆయన కాళ్లూచేతులూ కట్టేసి ఉన్నాయి! ఎవరో బందిపోటు దొంగలు కాబోలు, ఆయన్ని బందీ చేసి, చుట్టూ కూర్చొని ఉన్నారు! "నన్ను వదిలెయ్యండి" అని రకరకాలుగా చెప్పిచూశారు రాజుగారు. ఏవేవో ఆశలు చూపించారు. కానీ ఆ దొంగలు ఆయన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. పై పెచ్చు, "మేం భవానీ మాతకు బలి ఇచ్చేందుకు తగిన నర మనిషి కోసం ఎన్నో రోజులుగా వెతుకుతున్నాం. ఈ రోజున ఆ మాతే, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది" అని ఆయన్ని వాళ్ల నాయకుడి దగ్గరికి లాక్కెళ్లారు.

బందిపోట్ల నాయకుడు కూడా రాజుగారిని చూసి చాలా సంతోషపడ్డాడు. అంత అందంగా, బలంగా దృఢంగా ఉన్న వాడిని బలి ఇస్తేనే కదా, దేవి సంతోషించేది!

"ఒరే ! చాలా మంచి వేటనేపట్టి తెచ్చార్రా! బాగుంది బాగుంది- ఇక సమయం వృధా చేయకండి. వెంటనే యీ వేటకు స్నానం చేయించండి. చూస్తే బలికి వీడు బాగా సరిపోయేటట్లే ఉన్నాడు. అయినా ఎందుకైనా మంచిది- మళ్లీ ఓ సారి జాగ్రత్తగా పరిశీలించండి. బలికి అన్నీ సిద్ధం చెయ్యండి. 'ఇవాళ్లే పండుగ' అని గూడెంలో అంతటా చాటింపు వేయండి! పదండి,అందరూ!" అని తొందరపెట్టాడు.

రాజుగారిని ఇప్పుడు వాళ్లంతా బలిపశువుని చేసేసి, స్నానం చేయించేందుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో కనుక్కున్నాడు వాళ్లలో ఒకడు- ఈ నరమానవుడికి ఉండాల్సిన పదివేళ్లూ లేవు, తొమ్మిదే ఉన్నై! వెంటనే వాడు యీ వార్తను నాయకుడికి అందించాడు. నాయకుడు గబగబా వచ్చి చూశాడు. "నిజమే ! వీడికి తొమ్మిది వేళ్లే ఉన్నాయి!" "తొమ్మిది వేళ్ల వాడిని బలి ఎట్లా ఇస్తాంరా?" అడిగాడు నాయకుడు.

మరుక్షణం గూడెంలో డప్పులు ఆగిపోయాయి. నిశ్శబ్దం అలుముకున్నది. గూడెం పెద్దలంతా కలిసి మరోసారి రాజుని పరీక్షించారు. అందరూ పెదవి విరిచారు- "అంబకు బలిచ్చే ప్రాణి అన్ని అవయవాలతో, సంపూర్ణంగా ఉండాలి. ఇట్లాంటిది పనికిరాదు" అని తేల్చేశారు.

ఇంకేం చెయ్యాలి; బందిపోట్ల నాయకుడు రాజుని వదిలిపెట్టేయమన్నాడు. వెంటనే దొంగలు కొందరు రాజుని తీసుకెళ్లి అడవి చివర్లో వదిలేసి వచ్చారు!

రాజుగారిని వాళ్లు వదిలేసిన చోట ఒక ముని కుటీరం ఉంది. రాజుగారు ఆ కుటీరాన్ని చేరుకొని సన్యాసిని చూడబోయారు. చూడగా ఆ సన్యాసి వేరెవరోకాదు, గతంలో తనుబహిష్కరించిన మంత్రే! ఇప్పుడు ఆ మనిషిని చూసేటప్పటికి రాజుకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లైంది. చాలా సంతోషంతో సన్యాసిని కౌగలించుకొని "మిత్రమా! ఆనాడు నువ్వన్నది నిజమే. యుద్ధంలో నా చిటికెన వ్రేలును పోగొట్టుకోవటం మంచిదే అయ్యింది. లేకపోతే నేను యీనాడు ప్రాణాలతో ఉండేవాడిని కాదు!" అన్నాడు, తన కథను యావత్తూ మంత్రికి వినిపించి, తనను క్షమించమని కోరుతూ.

"దానిదేమున్నది మహారాజా! తమరికేం కాలేదు; అంతేచాలు. భగవంతుడు అంతా మేలే చేస్తాడు, ఆయనకు తెలీకుండా ఏదీ జరగదు" అన్నాడు మంత్రి , నమ్మకంగా.

అంతలోనే రాజుగారు అడిగారు, ఏదో గుర్తొచ్చినట్లు- "కానీ నాకు ఒక సంగతి చెప్పండి- నేను మిమ్మల్ని బహిష్కరించాను గదా, మరి దానివల్ల మీకు ఏమైనా మేలు కలిగిందా?" అని.

"నాకు జరిగిన మేలు స్వయం సిద్ధంగా కనబడుతూనే ఉన్నది, నేను ఇప్పుడు ఇంకా బ్రతికి ఉన్నానంటే అది మీ చలవే!" అన్నాడు మంత్రి.

"అదెలాగ?" అని రాజుగారు అడిగిన మీదట మంత్రిగారు చెప్పారు- "చూడండి, నన్ను మీరు బహిష్కరించి ఉండకపోతే మీతో బాటు నేనూ అడవికి వచ్చి ఉండేవాడిని. దొంగలు నన్నుకూడా పట్టుకొని ఉండేవాళ్లు. మీకంటే చిటికెనవేలు లేదు- కనుక వాళ్లు మిమ్మల్ని వదిలిపెట్టేసే వాళ్లు.

కానీ నేను వాళ్ల ఉద్దేశానికి చక్కగా సరిపోయేవాడిని! వాళ్లు నన్ను ఈ పాటికి అంబకు బలిచ్చేసి ఉండేవాళ్లు!" అన్నారు.

రాజుగారు మంత్రిని అభినందించారు. అంత జ్ఞానమూ, నిబ్బరమూ ఉన్న ఆయన్ని రాజ్యానికి వెంటబెట్టుకెళ్లి మంత్రిపదవి తిరిగి ఇవ్వటమేకాక, పలు విధాలుగా సత్కరించారు.