ఐర్లాండ్ దేశపు రాజధాని డబ్లిన్ నగరంలో ఏటా "యంగ్ సైంటిస్ట్ అండ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్" అని ఒకటి జరుగుతుంది. స్కూలు పిల్లల్లో సైన్సు గురించి ఆసక్తి కలిగించడం ఈ కార్యక్రమం లక్ష్యం. మనకు జిల్లాస్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, దేశ స్థాయిలోనూ 'సైన్స్ ఎగ్జిబిషన్లు'జరుగుతాయి కదా, ఈ డబ్లిన్ నగరపు ఎగ్జిబిషన్ కూడా అలాంటిదే- మరికాస్త పేరు గాంచిందన్నమాట.
అక్కడ ఏటేటా ఇచ్చే 'యంగ్ సైంటిస్ట్' అన్న అవార్డు 2008 సంవత్సరంలో ఎమర్ జోన్స్ అనే అమ్మాయికి దక్కింది. 'ప్రతి ఏడాదీ ఎవరికో ఒకరికి రావల్సిందే కదా!' అనుకోవచ్చు- కానీ, ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ అవార్డు వచ్చేనాటికి జోన్స్ వయసు పదమూడు సంవత్సరాలే! వాళ్ల దేశంలో ఈ అవార్డు పొందిన అతి పిన్నవయస్కురాలు ఆమే!!
ఇంతకీ ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?? మీరంతా ఇసక సంచీలు చూసే ఉంటారు కదా ఎప్పుడో ఒకప్పుడు? పేరుకు తగ్గట్లే సాధారణంగా ఆ సంచీల నిండా ఇసక నిండి ఉంటుంది. జల ప్రవాహం ఆపడానికో, మిలటరీ వాళ్ళు యుద్ధాలు చేస్తున్నప్పుడు వెనుక దాక్కోవడానికో వాడుతూ ఉంటారు వీటిని. ఇంకా చాలా చోట్ల కూడా ఉపయోగిస్తూ ఉంటారు. బహుశా చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటారు మీరు. నా మట్టుకు నాకు ఇసక సంచీలు తొలిసారి చూసిన గుర్తు - మా ఊర్లో తుంగభద్రా నదిలో! ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే - 'ఒక్కొక్కసారి ఇసకసంచీలు అత్యవసర పరిస్థితుల్లో భద్రత కోసం కూడా వాడతారు అని అన్నా కదా. అవి నిజంగా భద్రమైనవేనా?' అని ఈ అమ్మాయి పరిశోధించింది. 'అలాగే, వాటిని మరింత భద్రత కలిగించేవిగా చేయడం ఎలా?' అన్న ప్రశ్నకు తన పరిశోధన ద్వారా పరిష్కారం కనుక్కుంది.
మామూలుగా ఈ ఇసకసంచీలను భద్రత కోసం ప్రహరీలాగా పెడుతున్నప్పుడు వాటిమధ్య నిలకడ కోసం ముళ్ళ కంచెల్ని ఉంచి వాడతారు. దాని బదులు వెదురు గానీ, చెక్క గానీ వాడితే, అదే స్థాయి భద్రతను- మరింత తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సాధించవచ్చని ఎమర్ పరిశోధించి నిరూపించింది! ఎంత చిన్న సంగతి-అయితే ఎంత ప్రధానమైన సంగతి! ఇందుకే ఆమెకి ఈ "యంగ్ సైంటిస్ట్" అవార్డు వచ్చింది. 'నీకు ఇంత చక్కని ఐడియా ఎలా వచ్చిందమ్మా?' అని అడిగితే 'ప్రకృతి భీభత్సాల గురించి, అత్యవసర సమయాల్లో భద్రత గురించీ చదివిన వార్తలే తనకి ప్రేరణ' అని చెప్పింది ఈ అమ్మాయి. ఈ ప్రదర్శన తరువాత ఆమె స్కూల్లోనూ, తరువాత ఆమె నివసించే పట్టణంలోనూ ఆమెకి ఒక సన్మానంకూడా చేసారట. ఇటీవలే స్కూలు చదువులు ముగించుకున్న ఈ అమ్మాయి పరీక్షల్లో చక్కటి ప్రతిభ ప్రదర్శించి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లో చదువుకోవడానికి సీటు దక్కించుకుంది.
అదీ ఈ అమ్మాయి కథ (ఇప్పటివరకూ). ఇలా మన ఆలోచనలకి పదును పెట్టుకుంటూ, మీ స్కూల్లోనూ, మీ జిల్లాలోనూ జరిగే సైన్సు ఎగ్జిబిషన్లలో ఉత్సాహంగా పాల్గొనడం వల్ల మీరు కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఏమంటారు?