నరసాపురంలో నివసించే రంగమ్మ-రంగయ్యలు చాలా పేదవాళ్ళు. వాళ్ళకు పిల్లలు లేరు. రంగయ్యేమో తాగుబోతు. రంగమ్మ కూలిపని చేసి, చాలా కష్టపడి డబ్బులు తెస్తే, ఏ పనీ చేయకుండా సోమరిగా ఉంటూ తాగుడుకి డబ్బులు లాక్కునేవాడు రంగయ్య.
పిల్లలు లేరని అసలు ఏనాడూ పెద్దగా విచారించలేదు రంగయ్య. అయినా రంగమ్మకుమాత్రం పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు లేరన్న బాధకూడా రోజురోజుకూ ఎక్కువ కాసాగింది. బాగా ఆలోచించాక రంగమ్మ చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది- ఒకరోజున "అనాధ శరణాలయం నుండి ఒక బాలికను దత్తత తీసుకుందాం" అనేసింది భర్తతో. రంగయ్య దానికి ససేమిరా ఒప్పుకోలేదు. 'మనకే గతిలేదు- ఇంకా మనకు పిల్లలెందుకు?'అన్నాడు. కానీ రంగమ్మ మొండికేసింది. చివరికి ఒక పాపను దత్తు తీసుకొని వచ్చింది. 'దీని ముఖం చూసన్నా నువ్వు మారితే అంతే చాలు'అన్నది భర్తతో. 'నా పద్ధతులు నావి. ఇంకొకరి కోసం వాటిని ఎందుకు మార్చుకోవాలి?' అన్నాడు రంగయ్య.
పాపకు 'కరుణ' అని పేరు పెట్టి, అల్లారు ముద్దుగా సాకింది రంగమ్మ. రంగయ్య మాత్రం తన పద్ధతుల్ని యథావిధిగా కొనసాగించాడు. రంగమ్మ పాపను ఎత్తుకొని కూలికి పోయేది. వెనక్కి వచ్చాక ఆమె సంపాదనలో సగం లాక్కొనిపోయేవాడు రంగయ్య. ఇలా కొన్నేళ్ళు గడిచాయి.
కరుణకూడా కొంచెం కొంచెం పెద్దయింది.
కరుణ చాలా మంచిపాప. ఒకసారి ఆ పాప తన స్నేహితురాళ్ళతో కలిసి ఆడుకోవడానికి ఊరి దాపుల్లో ఉన్న పొలానికి వెళ్ళింది. అక్కడ పొదల మాటున ఆ పాపకు ఒక కుందేలు పిల్ల దొరికింది. దాన్ని చూసి ఆ పాప ఎంతో ముచ్చట పడింది. పెంచుకుందామని దాన్ని ఇంటికి తెచ్చింది. చూడగా దానికి అప్పటికే జ్వరం వచ్చి ఉన్నది!
ఆ కుందేలును చూశాడు రంగయ్య. "ఇలా ఇవ్వు దాన్ని! కూరగా వండుకుందాం, లేకుంటే సంతలో అమ్ముకుందాం!" అన్నాడు.
కరుణ కుందేలును హత్తుకొని బయటికి పరుగెత్తింది. ఆ పాపకు అర్థమైంది- 'చిట్టి కుందేలుకి తమ ఇంట్లో రక్షణ లేదు. రంగయ్య అన్నంతపనీ చేస్తాడు- దాన్ని తినేస్తాడు!'
'మరి ఇప్పుడేం చేయాలి?' రహస్యంగా ఇంటి వెనుకాల ఒక గూడును తయారు చేసి, కుందేలును ఆ గూటిలో పెట్టింది కరుణ. వాళ్ళ అమ్మను, టీచరును అడిగి, వాళ్ళ సహాయంతో దానికి ఆకుపసర్లు అన్నీ తెచ్చి పెట్టింది. రంగయ్య లేని సమయమంతా తను ఆ గూటి ముందరే, బుజ్జి కుందేలుకు సపర్యలు చేస్తూ గడిపింది. రంగయ్య వచ్చే సమయానికి అక్కడినుండి లేచి పుస్తకాలు పట్టుకోవటం మొదలు పెట్టింది.
ఇదంతా గమనించింది రంగమ్మ. ఆరోజు సాయంత్రం సమయం చూసుకొని రంగయ్యతో అన్నది- "తనకు సంబంధం లేని చిన్న జంతువును కూడా ఎంతో జాగ్రత్తగా సాకుతుంది కరుణ. ఒక చిన్న కుందేలు పిల్ల అనారోగ్యంతో ఉంటే శ్రద్ధగా ఆకుపసరులు ఇప్పించి కాపాడుతోంది చూడు! రాను రానూ నేనూ పెద్దదాన్నవుతాను- నువ్వు కూడానూ. మన ఈ ఆరోగ్యాలు కూడా ఎంతో కాలం ఉండవు. మన శక్తులు ఉడిగిపోయినప్పుడు మనల్నీ కనిపెట్టుకొని సాకుతుంది ఈ పాప. ఇట్లాంటి మనసున్న పాప మనకు దొరకటం మన అదృష్టం. కాబట్టి నువ్వు కరుణను ఏమీ అనవద్దు. ఆ కుందేలు పిల్ల జోలికి వెళ్ళవద్దు" అని నచ్చ చెప్పింది.
ఏ కళన ఉన్నాడో, 'సరే' అన్నాడు రంగయ్య. అంతేకాదు- అడవిలోకి వెళ్ళి కొన్ని మందు ఆకులను తెచ్చి ఇచ్చాడు కరుణకు- 'వీటిని కుందేలు ఉన్న గూటిలోపెట్టు. దాని జ్వరం తగ్గుతుంది. నేను దాన్నేం చెయ్యనులే, భయపడకు!' అని చెప్పాడు.
త్వరలోనే కుందేలు ఆరోగ్యం మెరుగైంది. మళ్ళీ చలాకీగా తయారైంది. కరుణ దాన్ని చూసుకొని పొంగిపోయింది. దాన్నీ కరుణనూ చూసుకొని మురిసిపోయాడు రంగయ్య. రంగయ్యలోని మార్పును చూసుకొని రంగమ్మ సంతోషపడ్డది.
కొద్దిరోజుల్లోనే రంగయ్య త్రాగుడు మానేశాడు. తను కూడా కూలి పనికి వెళ్ళి డబ్బులు తెచ్చి ఇవ్వటం మొదలు పెట్టాడు. బాధ్యతగా కుటుంబాన్ని పోషిస్తూ , కరుణను మంచి బడిలో చేర్పించాడు. ఆపైన వాళ్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది!