జింకలవంక అనే ఊళ్లో గీత, రాధ అనే పిల్లలు తొమ్మిదవతరగతి చదువుతున్నారు. గీతకేమో లెక్కలు బాగా వచ్చు; ఇంగ్లీషు అంత బాగా రాదు. రాధకేమో ఇంగ్లీష్ బాగా వచ్చు; లెక్కలు బాగా రావు. అయితేనేమి, ఇద్దరూ మంచి స్నేహితులు కదా! గీత రాధకు లెక్కలు నేర్పేది. రాధ గీతకు ఇంగ్లీష్ నేర్పేది. ఇలా ఒకరి దగ్గర ఒకరు నేర్చుకోవాలంటే కలిసి చదువుకోవాలికదా? అందుకని వాళ్ళిద్దరూ ఒక రోజు గీత వాళ్ళింటి దగ్గర, ఒక రోజు రాధ వాళ్ళింటి దగ్గర కూర్చొని చదువుకునేవాళ్ళు. అట్లా కలిసి మెలసి చదువుకుంటూ బళ్ళో 'భలే పిల్లలు, బాగా చదువుతారు' అని పేరు తెచ్చుకున్నారు ఇద్దరూ.
ఒకసారి మూడు నెలల పరీక్షలు మొదల-య్యాయి. పిల్లలంతా బాగా చదివారు. పరీక్షలు చక్కగా రాస్తున్నారు. చివరి పరీక్ష రోజున గీత బయటికి వచ్చేసరికి తన కోసం ఎదురు చూస్తున్నాడు వాళ్ళ నాన్న- "అన్నయ్య వచ్చాడు-నీకోసమే ఎదురు చూస్తున్నాడు, రా!" అని చెప్పి తొందరగా తీసుకెళ్లాడు.
ఆ సంగతి రాధకు ఏం తెలుసు? ఎప్పటి మాదిరే పరీక్ష అయిపోగానే గీత కోసం నిలబడింది. ఎంతసేపు నిలబడ్డా గీత రాలేదు! చివరికి ఎవరో చెప్పగా తెలిసింది- గీత ముందుగానే వెళ్లిపోయిందని.
రాధకు చాలా కోపం వచ్చింది. "ఒక్క మాట కూడా చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్లిపోయింది చూడు! నేను ఇక ఎప్పటికీ తనతో మాట్లాడను" అనుకున్నది. మామూలుగానైతే ఆ రోజుసాయంత్రం చదువుకోవడానికి గీత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తను. కానీ పంతం పట్టిన రాధ వెళ్ళనేలేదు. మరునాడు గీత వచ్చింది రాధ వాళ్ళింటికి. ఆ పాప ఎంత మాట్లాడించినా చాలా సేపటివరకూ రాధ బదులివ్వలేదు. చివరికి అన్నది కరకుగా- "నువ్వు నా స్నేహితురాలివి కాదు. నాకు లెక్కలు రావని నీకు అలుసు కదూ?! నువ్వేనా, నాకు లెక్కలు నేర్పేది? నేను మా అన్నయ్యను అడిగి చెప్పించుకుంటాను" అని.
గీతకు కూడా కోపం వచ్చేసింది: "ఓహో! నేను కూడా ఇంగ్లీషు మా అన్నయ్యతో చెప్పించుకోగలను. నువ్వేనా ఏంటి, నాకు ఇంగ్లీషు నేర్పగలిగేది?!" అంటూ గబుక్కున లేచి ఇంటికి వెళ్లిపోయింది.
అటుపైన దసరా సెలవుల్లో అంతా వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూడనేలేదు. సెలవులు అయిపోయి బళ్ళు తెరిచాక రాధ, గీత విడివిడిగా బడికి పోసాగారు. ఎవరిపాటికి వాళ్ళు చదువుకున్నారు. మరో మూడు నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఆరునెలల పరీక్షలు జరిగాయి.
వాటిలో రాధ, గీతలకు అందరికంటే తక్కువ మార్కులు వచ్చాయి!
"ఇద్దరం కలిసి చదువుకున్నప్పుడు ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నామో కదా!? ఇప్పుడు చూడు ఎలా జరిగిందో! నేస్తాలతో కలిసి చదువుకుంటే సంతోషంగా ఉంటుంది. ఒకరి సందేహాలను మరొకరు తీరుస్తారు- అట్లా అందరికీ మేలు జరుగుతుంది" అనిపించింది ఇద్దరికీ.
రాధ గీత దగ్గరకు వెళ్లి మాట్లాడింది- "జరిగినదానిలో తప్పంతా నాదే- నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు. నీకు ఇష్టమైతే మనిద్దరం మళ్ళీ కలిసి చదువుకుందామా? ఈసారి నేను నీమీద కోపం చేసుకోను-" అన్నది.
"నేను మీ యింటికి వస్తాను ఇవాళ్ల. రేపు నువ్వు రావాలి మా యింటికి- సరేనా?" అన్నది గీత సంతోషంగా. ఇప్పుడు వారిద్దరూ మళ్ళీ స్నేహితులైపోయారు. ఇద్దరూ శ్రద్ధగాకలిసి చదువుతున్నారు. తరగతిలో మొదటి మార్కు వాళ్లదే, ఈ నాటికీ!