ఏళ్ళ క్రితం జరిగిన కుంభమేళాలో చాలా మంది వయసు మళ్ళినవారు- ఎక్కడెక్కడినుంచో వచ్చినవారు- దిక్కుతోచని స్థితిలో ఉండటం గమనించారట పోలీసులు. వాళ్ళని రక్షణలోకి తీసుకొని ప్రశ్నిస్తే, కళ్ళు తిరిగే నిజం ఒకటి బయటపడింది: వాళ్లంతా సొంతగా అక్కడికి రాలేదు! వాళ్లని ఎలా వదిలించుకోవాలో తెలీక, పవిత్రస్నానాలకని చెప్పి తీసుకొనివచ్చి, అక్కడే వదిలేసి వెళ్లిపోయారట, వాళ్ళ పిల్లలు! 'రంగయ్య గాడిద' కథ చదువుతుంటే ఆ విషయం గుర్తు కొచ్చింది. మనిషి ఎంత నిర్దయుడు!

హర్షవర్ధన్ వాళ్ల అమ్మ చెప్పిన కథ చాలా కొత్తగా ఉంది. తాత సమయస్ఫూర్తి బాగుంది. శైలి చక్కగా, చదివించేలా ఉంది.

పిల్లాడితో నమస్కారం‌ పెట్టించుకోవటంకోసం చిన్నారిగారు అనుసరించిన పద్ధతిలో కొంత అతిశయం ఉందేమోగాని, 'పిల్లలకు మనం‌ ఏది ఇస్తామో దాన్నే తిరిగి పొందుతాం' అనే సత్యం దాగి ఉంది అందులో. గౌరవమే కాదు- ప్రేమ, మర్యాద, ద్వేషం- ఏదైనా అంతే.

'రాణి కడుపులో చేప' బాగుంది. ఎంత బంగారందైనా, బావిలో బ్రతుకు దుర్భరమే కదా. స్వేచ్ఛకి దూరం చేసి సకల సౌకర్యాలను ఇచ్చినా ఎంత వృధా! చేపకు అందరిమీదా అక్కసు కలగటం తప్పుకాదనిపించింది.
'ఎగిరిన నక్క' వేరే రకంగా చదివినదే. కానీ నక్కలకి పిట్టలంటే అందుకు కోపమని మాత్రం ప్రగతి చెప్తేనే తెలిసింది. ఇంతా చేసి, చివర్లో కూడా పిట్టపైనే కోపం పెంచుకున్నది గానీ, తన కాలు విరగటానికి కారణం తన మూర్ఖత్వం అని గుర్తించనే లేదు నక్క- దానికి నిజంగా బుద్ధి వచ్చిందంటావా, ప్రగతీ?

సంపాదకీయంలో స్వాత్రంత్ర్యం గురించి, బాపూజీ గురించి, సాదా- సీదాగా, క్లుప్తంగా, మరెంతో సూటిగా చెప్పిన తీరు చాలా బాగుంది- కొత్తపల్లి మార్కుతో! స్వాతంత్ర్య దినోత్సవంనాడు పిల్లలకి చెప్పదగినది అంతకంటే మంచిది మరోటి లేదనిపించింది. 'బానిసత్వంలో ఉన్నామని గుర్తించటంలోనే స్వాతంత్ర్యపు బీజాలున్నాయి' నిజంగానే. అలా గుర్తించలేకపోవటం, గుర్తించినా మభ్యపెట్టుకొని బ్రతికెయ్యటం, ఆ బానిసత్వంలోనే సుఖం వెతుక్కోవటం- ఇదే సమస్య. అట్టమీద బాపూజీ సజీవమైన తేజస్సుతో దర్శనమిచ్చాడు, హుందాగా. చిత్రకారుడు వీరాంజనేయులుకి మరోసారి అభినందనలు.

మనం చెప్పుకునే కథలు ఏవైనా, వేటికవి ఓ ప్రత్యేకమైన కాలానికీ, నేపథ్యానికీ చెందినవై ఉంటాయి. ఆ కాలాన్ని బట్టీ, పాత్రల స్వభావాన్ని బట్టీ కథలో వాడే పదాలు ఉండాలి. కొత్తపల్లిలో అలాంటి తప్పులు అసలు ఉండకపోతేనే బాగుండనిపిస్తుంది: నీతిచంద్రికలో 'రేటు', రాజుల కాలంనాటి 'రాణికడుపులో చేప' కథలో 'లేటు' లాంటి పదాలను చూసినప్పుడు. ఆ కథల సహజత్వమే దెబ్బ తిన్నట్లు అనిపిస్తుంది. అలాగే బొమ్మలు కూడాను- విశ్వనాధ రాసింది రాజుల నేపధ్యంలోని కథ- మరి ఆ కథలో వ్యాపారి కొడుకులు ప్యాంటు షర్టులు వేసుకున్నారేమి? అలాగే నమస్కారం కథ పల్లెటూరికి సంబంధించినది- అందులో పిల్లలేమో కార్గో ప్యాంట్లు, పోలోనెక్ టీ షర్టులు వేసుకొని మోడ్రన్ గా ఉన్నారు! ఈ విషయంలో మరికాస్త శ్రద్ధ వహించాలి. అట్లాగే దయ్యాల్నీ, రాక్షసుల్నీ నేనైతే ప్రత్యక్షంగా ఎన్నడూ చూడలేదుగానీ, సాంప్రదాయ చిత్రణ ప్రకారం రెండూ వేరు వేరే. మరి 'మంగయ్య తెలివి'లో ఉన్నది దయ్యమా, రాక్షసా?

వెనక అట్టమీది అనురాగ్ వేసిన బొమ్మల కథ నాకైతే అర్థం కాలేదు నిజంగా. దాని కొనసాగింపు కూడా ఉన్నదట, చూడాలి- అబ్బ, పిల్లలు! వాళ్ళ ఊహలు ఊహలు కావు!

'మంచి పుస్తకం' లో చెప్పిన 'ఇట్లు నాన్న'ని వెంటనే చదవాలి. నెలనెలా ఓ మంచిపుస్తకాన్ని పరిచయం చేస్తున్న మామంచి పుస్తకం కొత్తపల్లికి అభినందనలు, ధన్యవాదాలు!