ఒకరోజు ఇంద్ర పాలితుడు ధనగుప్తుడితో ముచ్చట్లాడుతూ ఉండగా వీధిలో "పండ్లమ్మా పండ్లు!" అని పండ్లమ్ముకునేవాడు ఒకడు అరిచాడు. ధనగుప్తుడి కొడుకు, చిన్నవాడొకడు, కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమంటుండగా తప్పటడుగులు వేస్తూ వచ్చి గునుస్తూ, ఏడుస్తూ తండ్రిని పట్టుకొని లాగుతూ, పండ్లు కొనిమ్మని మారాం చేయటం మొదలుపెట్టాడు.
అప్పుడు ఇంద్రపాలితుడు వాడిని చంకనెత్తుకొని, "నా తండ్రివిగా, నాయనా, ఏడవకు. నేను నీకు పండ్లు కొనిస్తాను, రా" అని వాడిని చంకనెత్తుకొని, పండ్లవాడిని వెంబడిస్తున్నట్లు గబగబా బయటికి పోయాడు.
తర్వాత ఆ పిల్లవాడిని దూరంగా తీసుకుపోయి ఎక్కడో ఒకచోట దాచి, నిద్రపుచ్చాడు. ముఖంలో దు:ఖంతో, గబగబా, ఒంటరిగా వెనక్కి వస్తున్న ఇంద్రపాలితుడిని చూసి ధనగుప్తుడు "ఏమైంది, పిల్లవాడు ఏడి?!" అని అడిగాడు.
అప్పుడతను ఏడుపు గొంతుతో "నేనేం చేసేది! చంకలోఉన్న బిడ్డని క్రిందికి దించి పండ్లు బేరమాడటం మొదలు పెట్టానా? ఇంతలో ఎక్కడినుండి వచ్చిందో, ఓ పాడు గ్రద్ద, బిడ్డని ఉన్నవాడిని ఉన్నట్లు తన్నుకుపోయింది!" అన్నాడు.
ధనగుప్తుడికి ఎక్కడలేని ఆవేశం ముంచుకొచ్చింది. చేతితో రొమ్ములు చరచుకొంటూ "ఒరేయ్! ఎంత పాపానికి ఒడిగట్టావురా? సొమ్ముకు ఆశపడి ఇంత సాహసం చేస్తావా? అంత లేత పిల్లవాడి ప్రాణాలు తీసేందుకు నీకు మనసెలా వచ్చిందిరా? నీకు చేతులెలా వచ్చాయి? మిత్రద్రోహివి కదరా, నువ్వు! అంత బిడ్డని గ్రద్ద ఎత్తుకెళ్తుందా? ఎవరైనా నమ్ముతారా, ఈ మాటను?" అని దు:ఖంతోటీ, కోపంతోటీ పళ్ళు పటపటా కొరికాడు. "కానీరా! సొమ్ము దక్కిందనుకోకు. ఇదిగో, నీచేత క్రక్కిస్తాను చూడు" అని వెంటనే లేచివెళ్ళి న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు.
న్యాయాధిపతులు ఆశ్చర్యపోయి ఇంద్రపాలితుడిని పిలిపించి, 'ఇది నిజమేనా?' అని అడిగారు. అవునన్నాడు వర్తకుడు. వాళ్ళు నవ్వి "ఓయీ! నువ్వు చెబుతున్న ఈ కారణం ఏదోగాని, మేం ఇదివరకు ఎన్నడూ విననిది, చూడనిది. మాకు చాలా ఆశ్చర్యం వేస్తున్నది. అంత పెద్ద బిడ్డడిని గ్రద్ద ఎత్తుకెళ్లటమేమిటి?" అని అడిగారు.
"అయ్యా! ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మిత్రుడుగదా అని నమ్మి, అరవై బారువుల ఇనుమును ఇతని ఇంట్లో దాచుకొని పోయాను. ఆ లోహాన్నంతా ఎలుకలు తినేశాయట! ఇనుమును తినే ఎలుకలు ఉన్నచోట, పసిబిడ్డను గ్రద్దలు ఎత్తుకొని పోవటంలో ఆశ్చర్యం ఏమున్నది?" అన్నాడు ఇంద్రపాలితుడు వాళ్లతో.
అది విన్న అధికారులకు వాస్తవం అర్థమైంది. వాళ్ళు ఇనుమును, పిల్లవాడిని తెప్పించి, ఇంద్రపాలితుడికి ఇనుమును, ధనగుప్తుడికి పిల్లవాడిని ఇప్పించారు. మిత్రుడిని మోసం చేసి సొమ్మును కాజేసినందుకుగాను ధనగుప్తుడికి జరిమానా విధించారు.
కరటకుడు దమనకుడికి ఈ కథని చెప్పి, అతన్ని చాలా చీవాట్లు పెట్టాడు.
సరిగ్గా ఆ సమయానికి సింహరాజు కోపం నసాళానికి అంటింది. దాని మెడమీది వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఆ కోపంలో అది 'కోపం అంటే ఇట్లా ఉంటుందా!' అన్నట్లు ఎర్రబారింది. దిక్కులన్నీ పిక్కటిల్లేట్లు అది ఒక్క పెట్టున గర్జించి చెంగున ఎగిరి సంజీవకుడి ప్రక్కల్లోఒక్కతను తన్నింది. ఆ తాపుకు కాపుకోలేక, ఎద్దు కాళ్లకి నాడాలు కొట్టేటప్పుడు క్రిందపడినట్లు, గుభిల్లున ఒక ప్రక్కకు తూలి పడింది. మరుక్షణం సింహం దాని మీదికి దూకి, ముందుకాళ్లతోదాని తలను ఒత్తిపట్టి, మెడను కొరికి నెత్తురు గుటగుటా త్రాగింది. సంజీవకుడు ఇక పైకి లేవలేదు. శత్రువును అలా అంతం చేశాక, సింహం కోపం చల్లారింది. ఊపిరి యథాస్థితికి వచ్చాక, అది ప్రశాంతంగా వెనక్కి తిరిగి తన నివాసానికి పోయింది.
వెనక్కి చేరనైతే చేరింది గానీ, దాని మనస్సు పశ్చాత్తాపంతో దహించుకు పోసాగింది. తనకు ఎదురు వచ్చిన కరటకుడినీ, దమనకుడినీ చూసి అది -"అయ్యో! ఎంత చెడ్డపని చేశాను! కాపాడి, పోషించి ప్రజలను సంతోషపెట్టేవాడిని 'రాజు' అంటారు గాని, నాలాంటి వాడికి 'రాజు' అనే బిరుదు ఏం నప్పుతుంది?! అయ్యో!ముందు చూపు లేనివాడిని! కనుకనే చేతులారా సంజీవకుడిని చంపుకున్నాను. ఎంతటి విషవృక్షం అయినా తానై పెరుగుతుంది తప్ప, తన కాండాన్ని తానే నరుక్కోదు. తెలిసో తెలీకో, సేవకుడెవరైనా ఒక తప్పు చేస్తే, నయానో భయానో వాడి తప్పు వాడే ఒప్పుకునేటట్లు చేసి, ఆపైన వాడిని ఊరికే వదిలెయ్యాలి. ఆ తర్వాతకూడా వాడు అదే తప్పును కొనసాగిస్తే వాడిని మన శక్తి కొద్దీ అణచివెయ్యాలి.
అంతే తప్ప, ఎక్కువ కోపాన్ని కనబడనివ్వరాదు. మన అసహనం బయట పడితే సేవకులకు మన ఆయువుపట్టు దొరుకుతుంది. దానివల్ల మనకే కష్టం వాటిల్లుతుంది. ఇందులో వేరే అనుమానం ఏమీ లేదు. ఎంత కష్టకార్యాన్నైనా సాధించవచ్చు గానీ, సరైన సేవకుడిని సంపాదించటం సులభం కాదు. అది అంతా ఒక ఎత్తు- దానిని అటు ఉండనివ్వండి. నేను చేసిన ఈ పని వల్ల, జీవించి ఉన్నంతకాలమూ చెరగని అపకీర్తి నా పాలబడింది. ఇప్పుడు నేను ఏం చేయను?" అని చేతులు ముడుచుకొని, తలవంచుకొని, నేలచూపులు చూసింది.
అప్పుడు కరటకం అన్నది- "మహారాజా! శత్రువును అంతంచేసి, ఆపైన తమరు ఇంతగా బాధపడటం తగదు. రాజన్నవాడు తనకు కీడు తలపెట్టిన వారినెవరినైనా సరే, వదిలిపెట్టక శిక్షించాలి' అని నీతి తెలిసిన పెద్దలు చెబుతుంటారు. నేరం చేసిన వాడిని క్షమించి వదిలిపెట్టటం అన్నది తపస్సు చేసుకునే మునులకు సరిపోతుందేమో గాని, రాజులకు అది మేలుగూర్చదు. సింహాసనంమీది ఆశతో, రాజ్య కాంక్షతో ప్రవర్తించే దుష్టులకు మరణమే దండన; వేరే శిక్షలు వాళ్లకు చాలవు. దీన్ని అందరూ అంగీకరిస్తారు" అని.
అది ఇలా చాలా సేపు మాట్లాడాక పింగళకుడి మనస్సు చల్లబడ్డట్లైంది. అది సంతోషంగా మళ్ళీ తన సింహాసనం ఎక్కి కూర్చున్నది. దమనకుడు కూడాచాలా సంతోషపడి, "మహారాజా! మీకు మేలు కలగాలి! మీవల్ల ఈ లోకానికి మేలు కలగాలి!" అని ఉల్లాసపరచే మాటలు మాట్లాడింది. ఆపైన ఆ నక్కలు అన్నీరాజాశ్రయంలో సుఖంగా కాలం గడిపాయి.
-అని మిత్రభేదాన్ని పూర్తిగా చెప్పిన విష్ణుశర్మ," చూశారుగదా! స్నేహితుల మధ్య పోట్లాటలు ఎలా తలెత్తుతాయో! దీన్ని అర్థం చేసుకొని, మీరు మీ శత్రువుల పట్ల సరైన వైఖరిని అవలంబించండి" అన్నాడు, రాజకుమారులతో. మిత్రభేదాన్ని జాగ్రత్తగా విన్న రాజకుమారులు చాలా సంతోషపడ్డారు. (నీతి చంద్రికలో పరవస్తు చిన్నయ సూరి రచించిన 'మిత్రభేదం' అనే రెండవభాగం ఇంతటితో ముగిసింది.)