వెయ్యి సంవత్సరాలక్రితం చైనా దేశం నుండి యాత్రికుడొకడు భారతదేశాన్ని చూసేందుకు వచ్చాడు. ఆ రోజుల్లో మోటారు కార్లూ,విమానాలు ఉండేవి కావు. ఎంత దూరం వెళ్లాలన్నా నడిచో, బళ్లమీదో వెళ్లాలి. చైనా యాత్రికుడు కాలినడకన ఒక ఊరి పొలిమేరలు చేరుకునే సరికి మధ్యాహ్నం అయ్యింది. అక్కడ ఒక పొలంలో పంట నూర్పిడి పని జరిగినట్లుంది- నూర్చిన పంటని రెండు కుప్పలు చేసి పెట్టి ఉన్నారు. అందరూ మధ్యాహ్నం భోజనానికి వెళ్లారేమో, ఒక నడివయసు రైతు మాత్రం ఏదో పని మీద ఉన్నాడక్కడ.

చైనా యాత్రికుడిని చూడగానే రైతు అతన్ని పిలిచి, మర్యాదగా నులకమంచం మీద కూర్చోబెట్టి, త్రాగేందుకు నీళ్లు తెచ్చి ఇచ్చాడు. "చూడగా మీరు చాలా దూరం నుండి నడిచి వస్తున్నట్లుంది. బాగా అలసిపోయి, ఆకలిగొని ఉంటారు- ఇక్కడే, యీ మంచం మీద కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి. మాతమ్ముడు ఇప్పుడు భోజనానికి వెళ్లాడు. వాడు వెనక్కి తిరిగి రాగానే మీరు-నేను భోజనానికి వెళ్దాం. అంతవరకూ నడుం వాల్చండి" అని, తన పనిలో మునిగాడు మళ్లీ. యాత్రికుడు బాగా అలసిపోయి ఉన్నాడు. మంచం మీద విశ్రాంతిగా వాలి, భోజనం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఆలోగా రైతు ఒక కుప్పలోంచి ధాన్యాన్ని తట్టతో కొద్దికొద్దిగా రెండవ కుప్పలోకి తరలిస్తూ ఉన్నాడు. కొంతసేపు చూశాక చైనా యాత్రికుడికి చిన్న అనుమానం వచ్చింది. రాను రాను ఆ అనుమానం బలపడింది.

"ముందు ఆ కుప్పలు రెండూ సమానంగానే ఉండినై. బహుశ: అవి ఈ ఇద్దరు అన్నదమ్ముల భాగాలు అయి ఉంటాయి.. మరి అందరినీ భోజనానికి పంపించి, ఈ అన్న చేస్తున్నదేమిటి?! తమ్ముడి కుప్పలోంచి ధాన్యాన్ని తన కుప్పలోకి మార్చుకుంటున్నాడు!! ఎంత మోసం?! ఎవరినీ నమ్మేటట్లు లేవు, రోజులు! అన్నే తమ్ముడిని ఇంత మోసం చేస్తుంటే, ఇక బయటివాళ్లు ఏమేం చేస్తారో.." అనుకున్నాడు. అయినా లోకం తెలిసిన-వాడూ, ఓపిక గలవాడూ కనుక అతను త్వరపడి ఒక నిర్ణయానికి రాలేదు. "వేచి చూద్దాం, కొంతసేపు!" అనుకున్నాడు.

కొంతసేపటికి తమ్ముడు తిరిగి వచ్చాడు. అతిథిని చూడగానే అతను కూడా దగ్గరికి వచ్చి పలకరించాడు. మర్యాదగా అన్నతో "నేను చాలా ఆలస్యం చేసినట్లున్నాను- అన్నా! ఈయన్ని త్వరగా ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టించు. చాలా అకలి అవుతూ ఉండి ఉంటుంది, పాపం! తినగానే తిరిగి రానక్కర్లేదు; కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని, మెల్లగారండి. ఇక్కడి పనేదో నేను చూసుకుంటాను" అన్నాడు. అట్లా అన్న, యాత్రికుడు ఇద్దరూ ఇంటికి బయలుదేరారు.

దారిలో చైనా మనిషి అడిగాడు- "ఏమీ అనుకోకండి, మీ వ్యక్తిగత విషయాల్లో తల దూరుస్తున్నానని- కానీ మీరు ఇందాక చేస్తున్నదేమిటి? ఒక కుప్పలోంచి ధాన్యాన్ని ఇంకో కుప్పలోకి మారుస్తున్నారు కదా, ఎందుకు?" అని.

"ఓహో, అదా!?" నవ్వాడు అన్న. "ఏదో, మా ఇంటి విషయంలెండి. మా తమ్ముడూ, నేనూ ఇవాళ్ల పొద్దునే ధాన్యం పంచుకొని, పద్ధతి ప్రకారం రెండు సమానం కుప్పలు చేశాం. అయితే, వాడికి నలుగురు పిల్లలు; నాకేమో ఇద్దరే. వాడికి ఎక్కువ ధాన్యం అవసరం కదా, అందుకని నేను వాడిని ఎక్కువ కొలుచుకోమన్నాను. వాడికి ఎంత పొగరో చూడండి- తన వాటాకంటే ఒక్క సోలెడు కూడా ఎక్కువ తీసుకునేది లేదని మొండి పట్టు పట్టాడు. మరి ఇప్పుడు పంపకాలు పూర్తయిపోయాయి కదా, వాడు తినేందుకు ఇంటికెళ్లాడు; అందుకని నేను నా కుప్పలోంచి కొంత ధాన్యం ఎత్తి వాడి కుప్పలో కలిపేశాను, అదన్న మాట, చిన్న రహస్యం!" అన్నాడు.

ఈ అన్నదమ్ములిద్దరిలోనూ కనిపించిన సాహార్దత, నిజాయితీ చైనా యాత్రికుడిని ముగ్ధుడిని చేశాయి. తన దేశానికి తిరిగి వెళ్లాక తన యీ అనుభవాన్ని అతను చాలా మందితో పంచుకొన్నాడు. తను రాసిన పుస్తకంలో యీ సంఘటనను ప్రత్యేకంగా రాసి పెట్టాడు. ఆ పుస్తకం చైనాలో యీనాటికీ ఉంది!