క్రింది బొమ్మను చూడండి. మీకు ఏమనిపిస్తున్నది?

సొరంగం...!

సొరంగ మార్గం గుండా పోతే ఏమేం దొరుకుతాయో, తెలీదు! ఆ సొరంగం ఎక్కడికి తీసుకు పోతుందో కూడా తెలీదు..! అందులో ఏముంటాయో కూడా తెలీదు- కానీ ఏవో అద్భుతంగా ఉండి ఉంటాయిలే, అన్నీ! ఆ సొరంగం మనల్ని రాయలవారు దాచిపెట్టిన నిధుల దగ్గరికే తీసుకుపోవచ్చు; దొంగలు దాచుకున్న సొమ్ముల మూటల దగ్గరికే తీసుకు పోవచ్చు; లేకపోతే అందులో మనకు బుజ్జి బుజ్జి పులి పిల్లలో, పెద్ద పెద్ద ఎలుకలో‌దొరకచ్చు! మాకంటే ఆ కథలు ఏవో‌ మీకే బాగా తెలిసిఉంటాయి. రాసి పంపించండి, మరి ఆలస్యం చేయకండి. మా కథ కంటే బాగుంటే మీకథనే ప్రచురిస్తాం!

మా చిరునామా: కొత్తపల్లి బృందం, యంఆర్‌వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా-515101 ఫోన్లు: 08559 240222, 7702877670

కోతి

రెండు నెలల క్రితం ఇచ్చిన 'బొమ్మకు కథ రాయండి'కి వచ్చిన స్పందన ఇది...
రచన: శ్రీమతి రాధ మండువ, ఉపాధ్యాయిని, ఋషి వ్యాలీ, మదనపల్లి, చిత్తూరు జిల్లా.

రిషి వనం లో అంజనమ్మ, పవనయ్య అనే రెండు కోతులు ఉండేవి. వాళ్ళకి ముగ్గురు పిల్లలు.

"బిందూ! రేఖా! చక్రీ! ఎక్కడున్నారు? ఇటు రండి" పెద్దగా కేకలు వేసి వాళ్లని పిలిచింది అంజనమ్మ.

"ఏంటమ్మా!" అంటూ వచ్చారు బిందు, రేఖలు.

"చక్రి ఏడి? ఎక్కడకు వెళ్ళాడు? వీడి కాళ్ళు ఒక్కచోట కుదురుగా ఉండవు కదా!" అంది అంజనమ్మ, ప్రక్కనే నిలబడి ఉన్న తన భర్త పవనయ్యను చూస్తూ.

"వాడు పుల్లకు రంధ్రం చేసి, ఆ రంధ్రం గుండా పురుగులను పీల్చుకుని తింటున్నాడమ్మా! అన్నది బిందు.

"పిల్చుకురా, వాడిని ఇటు!" అని కోపంగా అరిచింది అంజనమ్మ.

అమ్మ అరవడం విన్న చక్రి తన చేతిలో ఉన్న పుల్లను చెట్టు వెనక దాచేసి, పరుగెత్తుకుంటూ వచ్చాడు.

"నీకెన్ని సార్లు చెప్పాను, పురుగులను తినొద్దని?! నేను, నాన్న బయటకు వెళుతున్నాం. ఇంట్లోనే బుద్ధిగా ఆడుకోండి. మేం మంచి మంచి పళ్ళు, గ్రుడ్లు తెచ్చి పెడతాం, సరేనా!?” అంది అంజనమ్మ.

"సరేనమ్మా!” అంటూ ముగ్గురూ తలలు ఊపారు.

అంజనమ్మ, పవనయ్య బయటకు వెళ్ళారు. వాళ్ళు అటు వెళ్ళగానే చక్రి బయటికి పరిగెత్తాడు. అక్కలిద్దరికీ చెప్పకుండానే -

"ఒరే! తమ్ముడూ! వెళ్ళొద్దు. అమ్మ తిడుతుంది" అని బిందు అరుస్తున్నా వినిపించుకోలేదు చక్రిగాడు. వాడు చాలా అల్లరి కోతిగాడు కదా! అమ్మ మాటే వినడు. ఇక అక్క మాటేం వింటాడు?

చెట్టు చాటున దాచి పెట్టుకున్న పుల్లను తీసుకుని, పురుగుల కోసం రంధ్రం గుండా చూస్తూ ఆడుతూ, పాడుతూ, గెంతుతూ అడవిలోకి పరుగెత్తాడు చక్రి.

దారిలో వాడికి ఒక చీమల బారు కనిపించింది. "భలే! భలే! చీమలు వరుసగా ఎక్కడికబ్బా, వెళుతున్నాయి?" అంటూ చీమల బారు వెంట నడుస్తూ నడుస్తూ పోయాడు వాడు. దారి తప్పి గుట్టల్లోకి వెళ్ళిపోయాడు గానీ, అలా దారి తప్పిన సంగతి కూడా తెలియలేదు వాడికి!

కొంతసేపటికి చీమల బారు కనపడకుండా పోవడంతో, మళ్ళీ పురుగుల వేట మొదలుపెట్టాడు. ఇంకొంచెం దూరం పోయేసరికి, అక్కడ పొలాల్లో క్యారెట్లు నాటుకుంటున్న కుందేళ్లు కనబడ్డాయి. దుముకుతూ వెళ్ళిన చక్రిని చూసిన కుందేళ్ళు "ఏయ్! అక్కడే ఆగు. పొలం తొక్కి పాడు చేస్తావా, ఏమిటి?!" అన్నాయి ఒక్కసారిగా.

"ఎందుకు పాడు చేస్తాను?" అన్నాడు చక్రి మూతి ముడుచుకుని.

అంతలో వాడికొక చెదలపుట్ట కనిపించింది. ఆ పుట్టలో వందల-వేల పురుగులు ఉన్నాయి! వెంటనే వాడు చేతిలో ఉన్న గొట్టాన్ని చకచకా నోట్లో పెట్టుకున్నాడు. పుట్టలో ఉన్న పురుగులను పీల్చుకొని నమలటం మొదలు పెట్టాడు. అయితే ఒక్కసారి గట్టిగా పీల్చేటప్పటికి, పురుగులన్నీ ఠకాలున వచ్చి, వాడి గొంతుకు అడ్డం పడ్డాయి! ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు చక్రి! ఊపిరి ఆడలేదు. ప్రాణం కొట్టుకున్నది నీళ్ళ కోసం. ఇక వాడు అడ్డదిడ్డంగా పరుగెత్తటం మొదలుపెట్టాడు. వాడి కష్టాన్ని చూసి ఒక చిలుక ఎగురుకుంటూ వచ్చింది వాడి దగ్గరికి.

అప్పటికే వాడికి ప్రాణం పోతున్నట్లు ఉంది. చిలుక "నాతో రా!" అని వాడిని చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆత్రంగా నీళ్ళు తాగిన చక్రి, ఆ చెరువు గట్టునే ఓ చెట్టు కింద సోలిపోయాడు. గొంతు బాధ అయితే తగ్గింది కానీ ఇప్పుడు వాడికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఆ నొప్పిలో వాడికి అమ్మానాన్న గుర్తుకొచ్చారు. "మా అమ్మానాన్నల్ని పిలుచుకు రావా, ప్లీజ్” అని ప్రాధేయపడ్డాడు చిలుకను.

చిలుక ఎగురుకుంటూ వెళ్ళి పవనయ్యను వెంట పెట్టుకు వచ్చింది. పవనయ్య చక్రిని వీపుమీద ఎక్కించుకుని ఇంటికి తీసుకు వచ్చాడు. అప్పటికే అంజనమ్మ కషాయాన్ని తయారు చేసి ఉంచింది. చక్రిగాడు రాగానే వాడి చేత వేప కషాయం తాగించింది. "వేపపుల్లను బాగా నమిలి, ఆ రసం మింగాలి. కడుపు నొప్పి తగ్గుతుంది" అని, వేపపుల్లనొకదాన్ని వాడి చేతిలో పెట్టి, వేపచెట్టు ఎక్కించింది అంజనమ్మ.

చెట్టు కింద కూర్చొని అన్న, అక్క, అమ్మ, నాన్నలు హాయిగా పండ్లు, గ్రుడ్లు తింటూ ఉంటే, చెట్టు మీద కూర్చొని చక్రిగాడు వేపపుల్లను నమలాల్సి వచ్చింది పాపం !

అయితే, బిందు అక్క చాలా‌ మంచిది కదా, కొన్ని పండ్లను, గ్రుడ్లను చక్రిగాడి కోసం దాచి పెట్టింది. మర్నాడు వాటిని తమ్ముడికిస్తూ "తమ్ముడూ! బయటికి వెళ్ళి అన్నింటినీ పరిశీలించడం, క్రొత్త క్రొత్త విషయాలను తెలుసుకోవటం మంచిదే; కానీ పురుగులను తినడం చెడ్డ అలవాటు- అందుకే నీకు కడుపు నొప్పి వచ్చింది. చెడ్డ అలవాట్ల వల్ల కష్టాలు వస్తాయి !" అని చెప్పింది.

"ఇంకెప్పుడూ పురుగులను తిననక్కా!" అన్నాడు చక్రి, అప్పుడే బాగైన తన బొజ్జను నిమురుకుంటూ.