నీకు జాన పళ్ళు తెలుసా? పరికి పళ్ళు? పులికాయలు? వాక్కాయలు? రేగుపళ్ళ పచ్చడి ఎలా చేస్తారో తెలుసా?

ఈత కొట్టటం, చిల్లాఁకట్టె ఆడటం వచ్చా?

బొంగరానికి తాడుకట్టి చఠాల్మని వదిలితే అది నేలమీద పడి గుక్కపట్టి తిరిగేలా చేయటం వచ్చా? అట్లా తిరుగుతున్నదాన్ని తాడుతో అలాగే ఎత్తి అరచేతిమీద పెట్టుకొని ఆడిస్తూ ఎగరటం?

వంద జానల దూరంలో ఉన్న తెల్లగోలీని నీ నల్ల గోలోతో ఠకాల్మని కొట్టి, ఆ తెల్లగోలీ పోయి గుంతలో పడేట్లు చెయ్యటం వచ్చా? గాలిపటాలు ఎగరెయ్యటం?

ఎన్నిసార్లు గాలికొట్టినా సైకిలు ట్యూబులో‌గాలి నిలవకపోతే ఏం చెయ్యాలో తెలుసా? ఏ కొంచెం వెనక్కి తొక్కినా సైకిలు చైను పడిపోతుంటే ఏం చెయ్యాలో? సైకిలు టైరుకి గటర్ పెట్టుకోవటం, వాల్వ్ ట్యూబు మార్చుకోవటం వచ్చా?

మట్టినేలని పైపైన ఊడ్చి, కళ్ళాపు చల్లి, అది ఆరకముందే ముగ్గు వెయ్యటం వచ్చా?

నువ్వు వేసుకునే చొక్కా జిప్పు పైకిలాగినా తెరుచుకుంటూనే ఉంటే ఎలా బాగు చేసుకోవాలో‌తెలుసా?

పాము కరిస్తే వెంటనే ఏం చెయ్యాలి? కుక్క కరిస్తే? వేరే ఏమైనా జంతువులు? దెబ్బ తగిలి రక్తం కారుతుంటే దాన్ని ఆపేందుకు ఏం చెయ్యాలి?

అకస్మాత్తుగా జ్వరం వచ్చేస్తే ఏం చెయ్యాలి?

ఇటుకలతో గోడ కట్టటం వచ్చా, నీకు? సిమెంటులో ఇసుక వేసి, నీళ్ళు కలిపి మసాలా చెయ్యటం వచ్చా? వెదురు చీల్ని బద్దలు చెయ్యటం? బంకమట్టిని పిసికి మట్టి గురుగులు, వినాయకుళ్ళు చేయటం వచ్చా?

పాలు పితకటం వచ్చా? పాడైపోయిన హెలికాప్టరు బొమ్మలోంచి మోటారును పీకి, దాంతో స్టీమరును నడిపించటం?

కొమ్మలు నరకటం వచ్చా, నీకు? గునపంతో‌గుంతలు త్రవ్వటం, పారతో గెనాలు చెక్కటం, చేదబావిలోంచి నీళ్ళు చేదటం, హ్యాండ్‌పంప్‌లో నీళ్ళు కొట్టటం?

సూదిలోకి దారం ఎక్కించటం వచ్చా? పేకముక్కలతో మేడలు కట్టటం? కాయితాలతో‌అద్భుతాలని సృష్టించటం?

గులక రాళ్ళని ఎగరేస్తూ అచ్చంద కాయలు ఆడటం వచ్చా?

ఇవన్నీ‌మన మనసును, చేతుల్నీ కలిపే పనులే. పైకి మామూలుగాను, అతి సాధారణంగాను కనబడ్డా, వీటిలో మన వ్యక్తిత్వాలను మలచే జీవశక్తి దాక్కొని ఉంది.

ఈ జీవశక్తి పట్టణాలలో ఉంటున్న పిల్లలకు అందటం లేదు, కొంత కాలంగా.

పిల్లలందరికీ ఇవి అందాలని తపిస్తున్న పెద్దలు ఎంతమందో! వాళ్ళందరికీ నమస్కారాలు.

గురుపూజోత్సవ శుభాకాంక్షలతో,
కొత్తపల్లి బృందం.