ఒక పల్లె పేరు రామాపురం. ఆ పల్లెలో రామయ్య, అతని భార్య సాలమ్మక్క ఉండేవాళ్ళు. ఆ వూళ్ళో నీళ్ళకు చాలా కరువుగా ఉండేది. కారణం, అక్కడ వర్షం చాలా తక్కువ పడేది. అంతే కాక వర్షం నీళ్ళు నిలవకుండా కొట్టుకు పోయేవి. ఒక ఏడాది ఆ పల్లె ప్రజలు నీళ్ళ కోసం చాలా చాలా కష్టపడ్డారు. ఏమంటే అప్పటి వరకూ నీళ్ళు నిలువచేయడం కోసం వాళ్ళు ఏమీ ప్రయత్నించలేదు మరి.

ఆ సమయంలో రామయ్యకు, సాలమ్మక్కకు ఒక ఆలోచన వచ్చింది: "మన ఊరికి ఎప్పుడూ నీళ్ళ కరువు ఎందుకు, ఉంటుంది? ఊళ్ళో అందరూ ఉపయోగించుకోవటం కోసం ఒక కుంట త్రవ్వితే బాగుంటుంది కదా! వర్షం నీళ్లను ఇంకొన్ని రోజులు నిలువ ఉంచచ్చు కదా!"అని. దీని కోసం రాజుగారిని కలవాలని అనుకున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ రాజుగారికి కోపం చాలా ఎక్కువ. అయినా గానీ ఆ రాజుగారిని కలవాలని, ఇద్దరూ ధైర్యం చేసుకొని రాజధానికి వెళ్ళారు. కానీ వీళ్ళ వేషాలను చూసి వేళాకోళం చేశారు సైనికులు. ఎంత బతిమాలుకున్నా వాళ్ళని లోపలికి అనుమతించలేదు. ఇక చేసేది ఏమున్నది? ఇద్దరూ‌ ఖాళీ‌చేతులతో ఇంటికి తిరిగి వచ్చారు.

ఊళ్లోకి రాగానే రామయ్య, సాలమ్మక్క ఒకొక్క ఇంటికీ వెళ్ళి తమ ఆలోచనను తెలియజేసారు. "వాతావరణం ఇలాగే ఉంటే కొద్దిరోజులకు పూర్తిగా కరువు ఏర్పడుతుంది. అప్పుడు ఇక వ్యవసాయానికి, త్రాగటానికీ రెండింటికీ నీళ్ళు ఉండవు. వర్షపు నీటిని నిల్వ చేయకపోతే లాభం లేదు- మనకు ప్రతి యేడూ‌ నీటి కరువు ఉంటుంది, తప్పదు. అందుకని మనం మన ఊళ్ళో‌ఒక బావినో, చెరువునో తవ్వుకుందాం" అని చెప్పుకుంటూ పోయారు. ప్రజలందరికీ "ఔను! మనం ఇలాగే ఉంటే మనకే నష్టం" అనిపించింది. అందరూ కలిసి కట్టకట్టుకొని అనువైన స్థలంలో ఒక కుంటను తవ్వడం మొదలు పెట్టారు. కుంట పని పూర్తయ్యేసరికి వర్షం వచ్చింది. కుంటలో నీళ్ళు నిల్వ ఉండేసరికి ప్రజలందరికీ పట్టరాని సంతోషమైంది.

ఈ విషయం తెలుసుకొని పక్క ఊరి ప్రజలు వచ్చి రామయ్యను సంప్రదించారు. ఆయన చెప్పినట్లు వాళ్ళూ‌ ఒక చెరువును తవ్వుకున్నారు. ఇంకొక ఊరి వాళ్ళూ అలాగే చేసారు.

క్రమంగా రామయ్య, సాలమ్మక్కల ఆలోచన రాజ్యమంతా విస్తరించింది. బావులు, కుంటలు, చెరువులు- ఇలా చాలా రకాల నీటి వనరులను ప్రజలు వాళ్ళంతట వాళ్ళే నిర్మించుకున్నారు. దాంతో కరువు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయింది.

ఎప్పుడూ కోపంలో ఉండే రాజుకి రాజ్యంలో జరుగుతున్న మార్పులు గమనించడానికి చాలా సమయం పట్టింది.

ఏం జరిగిందో తెలుసుకున్నాక ఆయన విపరీతంగా సిగ్గుపడ్డాడు- "ఇంత పెద్ద రాజును, నేను ప్రజలకి అంత మాత్రం సహాయం చేయలేక పోయానేమి?" అని. "ప్రజల్లారా! ఈ రోజు నుండీ రాజ్యం అంతటా చెరువులు, ఆనకట్టలు కట్టిస్తాం" అని వాగ్దానం చేసాడు. పని వాళ్ళను పిలిపించి ఊరూరా, అక్కడి అవకాశాలను బట్టి- చెరువులు, కుంటలు కట్టించాడు; ఊట బావులు త్రవ్వించాడు.

అటుపైన రాజ్యంలో ఎన్నడూ కరువన్నదే రాలేదు.