అనగనగా వెంకటంపల్లిలో ఒక సాధువు నివసించేవాడు. ఒకసారి రామయ్య అనే రైతు ఒకడు సాధువు దర్శనం చేసుకొని, "అయ్యా! ఈ భూమి మీద అన్నింటికన్నా గొప్పది ఏది?" అని అడిగాడు. "భూమి మీద ఉన్నవన్నీ గొప్పవే నాయనా! వాటిలో హెచ్చు తగ్గులు మనం కల్పించుకున్నాం, అంతే. అయినా నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది?" అడిగాడు సాధువు.
"అయ్యా! మామూలు ప్రజలు రకరకాల దేవుళ్ళను పూజిస్తారు. నేను మాత్రం ఈ భూమిమీద అన్నింటి కంటే గొప్ప దానిని మాత్రమే పూజించాలనుకుంటున్నాను" చెప్పాడు రామయ్య.
సాధువు చిరునవ్వు నవ్వాడు. "నీ ఇష్టం ఎలా ఉంటే అలా కానివ్వు నాయనా! ఎటొచ్చీ దేన్నీ అతిగా మాత్రం చెయ్యకు" అని సాధువు తన దగ్గర ఉన్న ఒక విగ్రహాన్ని రామయ్య చేతికి ఇచ్చాడు. "నాకు తెలిసినంతవరకూ ఇది గొప్పదే నాయనా! దీన్ని పూజించు" అన్నాడు.
"ఇది భూమి మీద అన్నింటి కన్నా గొప్పదే కద, స్వామీ!" అడిగాడు రామయ్య, దాన్ని కళ్ళకద్దుకుంటూ.
"కావచ్చు, కాకపోవచ్చు కూడాను.. దీన్ని పూజిస్తూ ఉండు; ఒక వేళ నీకు దీనికన్నా గొప్పది వేరే ఏదన్నా కనిపిస్తే, అప్పుడు దీని బదులు దాన్ని పూజించు!" అని చెప్పాడు సాధువు, నవ్వుతూ.
రామయ్య ఆ విగ్రహాన్ని సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళాడు. పూజా మందిరంలో దాన్ని ప్రతిష్ఠించి, రోజూ పూజించడం మొదలు పెట్టాడు. ప్రతిరోజూ ఆ విగ్రహానికి ఏదో ఒక పండుని నైవేద్యంగా అర్పించేవాడు; పూజలు చేసి, దీపం వెలిగించి పాటలు పాడేవాడు.
ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజున రామయ్య విగ్రహం ముందు ఉంచిన పండు ఎలా మాయమైందో, మాయమైంది! ఆశ్చర్యపడ్డ రామయ్య మరునాడంతా మాటిమాటికీ దేవుడి గదినీ, విగ్రహాన్నీ, నైవేద్యాన్నీ చూస్తూ గడిపాడు. చూడగా అది ఒక ఎలుక! ఎలుక వచ్చి విగ్రహం ముందు ఉంచిన పండును తీసుకొని తింటున్నది!
దాన్ని చూసిన రామయ్యకు అనిపించింది: "ఆహా! ప్రాణం లేని ఈ విగ్రహం దానికి అర్పించిన పండుని కూడా కాపాడుకో-లేకపోతున్నది కదా! ఈ ఎలుకే గొప్పది, దానికంటే!" అని. "స్వామి వారు చెప్పారు కదా, 'దీనికంటే గొప్పది ఏదైనా కనబడితే దాన్ని పూజించు' అని?" అందుకని రామయ్య ఆ రోజు నుంచి విగ్రహానికి బదులు ఎలుకను పూజించటం మొదలు పెట్టాడు.
ఇప్పుడు రోజూ ఆ ఎలుక వుండే కన్నం ముందు రకరకాల ఆహార పదార్థాలు ఉంచుతున్నాడు రామయ్య. ఆ ఎలుక వాటిని తినటానికి బయటికి వచ్చినప్పుడల్లా దానికి సాగిలపడి మొక్కుతున్నాడు. ఎలుక కూడా భయంలేకుండా అతను పెట్టిన పదార్ధాలనన్నిటినీ తన కలుగులోకి చేర్చుకుంటూ పోతున్నది.
అంతా బాగా నడుస్తోంది అనగా, ఒక రోజున రామయ్య చూస్తూండగానే ఒక పిల్లి ఆ ఎలుక మీదికి దూకింది. చటుక్కున దాన్ని నోట కరచుకొని పారి పోయింది!
మరుక్షణం రామయ్యలో పిల్లి పట్ల భక్తి ఉదయించింది. ఎలుక భక్తుడు రామయ్య, ఇప్పుడు పిల్లి భక్తుడుగా మారిపోయాడు.
ఎలుకకన్నా పిల్లిని పూజించటం సులభంగా ఉంది. పిల్లికి నైవేద్యం పెట్టటం సులభం. కొన్నాళ్ళు ఇది బాగానే నడిచిందిగానీ, ఒక రోజున పిల్లికి గిన్నెలో పాలు పోసి పెట్టేసరికి, దగ్గర్లోనే ఉన్న కుక్క ఒకటి పరుగెత్తుకొచ్చింది. పిల్లి మీదికి దూకి పాలు కాస్తా తాగేసింది. బ్రతుకుజీవుడా అని పిల్లి కాస్తా పారిపోయింది.
వెంటనే ఆ కుక్కలో దైవత్వం కనిపించింది, రామయ్యకు. "గొప్ప దేవుడు, ఇన్నాళ్లకు దొరికాడు" అని ఇప్పుడు అతను కుక్కను పూజించటం మొదలుపెట్టాడు. కుక్క దేవుడికి కూడా చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు దానికడుపు నిండుతున్నదిగద, బాగా!
ఒక రోజున ఆ కుక్క వాళ్ల వంటింట్లోకి దూరింది. ఒక పాత్ర దగ్గర మూతిపెట్టి వాసన చూడటం మొదలు పెట్టింది. గబుక్కున లోపలికి వచ్చిన రామయ్య భార్య కోపం పట్టలేకపోయింది. "ఓ రామయ్యా! ఇటురా!నీ దేవుడు ఏం చేస్తున్నదో చూడు!" అని ఒక్కపెట్టున అరిచి, ఆమె చేతికందిన కర్రనొకదాన్ని కుక్కమీదికి విసిరేసింది. కుయ్యో కుయ్యోమని కుక్క దేవుడు పారిపోతుంటే చూసిన రామయ్యకు తన భార్యలో ఆ కుక్క కంటే గొప్పదేవుడు కనబడటం మొదలు పెట్టాడు.
ఆనాటి నుండి తన భార్యను పూజించటం మొదలు పెట్టాడు రామయ్య. ఆమెకు అది చాలా సంతోషాన్నిచ్చింది. కానీ ఆమె సంతోషం ఎంతోకాలం నిలవలేదు. రెండో రోజునే ఆమె సాంబారులో ఉప్పు వెయ్యడం మరచిపోయింది. భార్యలోని దేవుడిని తాత్కాలికంగా మర్చిపోయిన రామయ్య, భార్యమీదికి అంతెత్తున ఎగిరాడు. అతని అరుపులకు ఆమె గజగజా వణికిపోయింది. మూలన కూర్చొని ఏడవటం మొదలు పెట్టింది. ఆ క్షణంలో రామయ్య కళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి. "ఈమె ఎవరు? నా దేవత! అంతటి దేవతే నన్ను చూసి ఇంత భయపడిందంటే, ఇక నేనే గొప్పవాడిని గదా, ఆమెకన్నా?" అనుకున్నాడతను.
"ఓహో!అందరిలోకీ గొప్పవాడిని నేనే" అని, ఇక తనను తానే పూజించుకోవడం మొదలు పెట్టాడు రామయ్య. రోజూ అగరు బత్తులు వెలిగించి, తనను తానే పొగుడుకుంటూ పూజ చేసుకోవటం మొదలు పెట్టాడు.
ఒక రోజున రామయ్యకు కడుపులో బాగా ఆకలైంది. తనకు తను గంధం పూసుకున్నా, అగరు వత్తులు వెలిగించుకున్నా, హారతులు ఇచ్చుకున్నా, అతని ఆకలి మాత్రం ఆగేటట్లు లేదు. చివరికి అతను తన పూజను మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది. ఆదరాబాదరా తింటూండగా అతనికి అర్థం అయ్యింది- తనకంటే గొప్ప దేవుడు, తన కడుపు!
ఒకసారి ఈ ఆలోచన వచ్చాక రామయ్య ఇక ఆగలేకపోయాడు. తన కడుపునే తన దేవునిగా మార్చుకున్నాడు. ఈ బొజ్జదేవుడు చాలా ప్రమాదకరమైన దేవుడు- ఎందుకంటే ఎన్నెన్ని పెట్టినా ఆ దేవుడు మాత్రం ఎంతకీ ప్రసన్నం కాడు!
"ఎప్పుడూ తింటూనే ఉండాలి! నా దేవుడికి ఎప్పుడూ నైవేద్యం పెడుతూనే ఉండాలి " అనుకున్నాడు రామయ్య. తినీ తినీ అతని కడుపు పెద్ద బానలా తయారయ్యింది. దాన్ని చూసిన కొద్దీ రామయ్యకు భక్తి భావం ఇంకా ఇంకా ఎక్కువౌతూనే పోయింది. దాన్ని ఇంకా ఇంకా నింపటం మొదలు పెట్టాడు.
చివరికి ఒకనాడు ఆ వెర్రి భక్తుడు అలాగే ముందుకు ఒరిగి కన్ను మూశాడు!